New tariff
-
కరెంట్ కోసం కొత్త టారిఫ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కింద ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం థ్రెషోల్డ్ లిమిట్ రెగ్యులేషన్–2023ని రూపొందించింది. ఈ మేరకు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 ప్రకారం.. కొత్త నిబంధనలతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను కమిషన్ తయారు చేసింది. దీనిపై ఎవరికైనా సూచనలు, అభ్యంతరాలుంటే ఈ నెల 29లోగా తమ ప్రధాన కార్యాలయానికి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది. ఈ గడువు ముగిసిన తర్వాత డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఖరారు చేస్తామని కమిషన్ తెలిపింది. ఈ రెగ్యులేషన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఏపీ ఈఆర్సీ పేర్కొంది. రెండుసార్లు అడిగిన కేంద్రం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021 మార్చి 15న ఒక లేఖ విడుదల చేసింది. ఇందులో ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్(టీబీసీబీ)ని ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. టీబీసీబీ ద్వారా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌లను అందించడానికి గరిష్ట పరిమితిని తెలియజేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టు 21న ఏపీ ఈఆర్సీకి మరో లేఖ పంపింది. వీటిని పరిగణలోకి తీసుకుని 2020–21 నుంచి 2023–24 వరకు నాలుగు ఆర్థి క సంవత్సరాల్లో ఏపీ ట్రాన్స్‌కో స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీకి మంజూరైన పెట్టుబడి అనుమతులను కమిషన్ పరిశీలించింది. ఆమోదించిన 23 ప్రాజెక్ట్‌లలో 10 ప్రాజెక్ట్‌లు (43.5 శాతం) అమలు జరిగినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ టారిఫ్‌ను తగ్గించడం, జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ సేవల కోసం ఇప్పటికే అమలులో ఉన్న టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకోవడం, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధిలో పోటీని ప్రోత్సహించే పవర్ మార్గదర్శకాల అభివృద్ధి కోసం కొత్త డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను కమిషన్ తీసుకువస్తోంది. -
జియో బాదుడు.. 39% పైనే
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో... ఛార్జీలు పెంచుతూ కొత్త రేట్లను బుధవారం విడుదలచేసింది. డిసెంబర్ 6 నుంచి ధరలు పెరగనున్నట్లు కంపెనీ గతంలోనే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యారిఫ్‌లతో పోల్చితే 39%కి పైగా పెంపును ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాకేజీ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా.. దీని ధరను రూ. 555 చేసింది. రూ.153 ప్లాన్ ధర శుక్రవారం నుంచి రూ.199 కానుంది. రూ.349 ప్లాన్ రూ. 399గా మారనుంది. రూ.448 ప్లాన్ రూ.599 కానుండగా.. ప్రస్తుతం ఏడాదికి రూ.1,699గా ఉన్న ప్లాన్ రూ.2199కి చేరనుంది. ట్యారిఫ్ పెరిగినప్పటికీ.. పోటీ సంస్థలు ఇస్తోన్న ప్లాన్లతో పోలిస్తే మాత్రం తమ నూతన ట్యారిఫ్ 25 శాతం తక్కువగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. రూ.199 ప్లాన్‌ను ఇతర సంస్థలు రూ. 249కి అందిస్తున్నాయని లెక్కలు వేసి చూపిస్తోంది. -
మరోసారి టీవీ చానళ్ల ఎంపిక గడువు పొడగింపు
న్యూఢిల్లీ: టీవీ ప్రేక్షకులకు ట్రాయ్ మరోసారి ఊరట కల్పించింది. వినియోగదారులు తమకు ఇష్టమైన చానళ్లను ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ట్రాయ్ మంగళవారం ప్రకటించింది. దీంతో టెలివిజన్ వీక్షకులకు కొంత మేర ఊరట కలిగినట్టయింది. ట్రాయ్ తొలుత పేర్కొన ప్రకారం డిసెంబర్ 29న నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల విజ్ఞప్తితో ట్రాయ్ తొలుత జనవరి 31 వరకు ఈ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ.. చాలా మంది వినియోగదారులు నూతన విధానంలోకి మారకపోవడం వల్ల వారికి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో సోమవారం డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశం నిర్వహించిన ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల కోసం ప్రస్తుతం వారు చెల్లిస్తున్న మొత్తానికి మించకుండా, వారు కోరుకున్న చానళ్లను అందించేలా ప్యాకేజీలు రూపొందించాలని ఆపరేటర్లకు సూచించింది. కొత్త నిబంధన వల్ల టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన చానళ్లను చూసుకునే అవకాశం అభిస్తుందని, వారిపై భారం కూడా తక్కువగానే పడుతుందని ట్రాయ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
చానళ్ల ఎంపిక గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకుని వాటికి మాత్రమే డబ్బు చెల్లించే కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ట్రాయ్.. దాని అమలు గడువును నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలిపింది. దీంతో టెలివిజన్ వీక్షకులకు కొంత మేర ఊరట కలిగినట్టయింది. ట్రాయ్ తొలుత పేర్కొన ప్రకారం డిసెంబర్ 29న నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ టీవీ వీక్షకుల సౌకర్యార్థం ట్రాయ్ ఈ గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశం నిర్వహించిన ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం అనంతరం ట్రాయ్ కార్యదర్శి ఎస్కే గుప్తా మాట్లాడుతూ.. ‘కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు అంగీకరించారు. అయితే కొత్త విధానాన్ని ఎటువంటి అంతరాయలు లేకుండా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అమలు చేయడానికి మాత్రం మరికొంత సమయం కావాలని పంపిణీ ఆపరేటర్లు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జనవరి 31వ తేదీ వరకు అవకాశం కల్పించాం. ఈ విధానంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నార’ని తెలిపారు. కొత్త నిబంధన వల్ల టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన చానళ్లను చూసుకునే అవకాశం అభిస్తుందని, వారిపై భారం కూడా తక్కువగానే పడుతుందని ట్రాయ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కరెంట్ షాక్...
- విభజన తర్వాత వడ్డింపు - కొత్త టారిఫ్ సిద్ధం చేస్తున్న విద్యుత్ అధికారులు - వినియోగదారులకు గుండె గు‘భిల్లే’ - దాదాపుగా రెట్టింపు కానున్న చార్జీలు - జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.360 కోట్ల భారం వచ్చే నెల నుంచి కరెంటు చార్జీలు మోతమోగనున్నాయి. నూతనంగా రూపొందించిన టారిఫ్ ప్రకారం ఇకపై మీరు కట్టే బిల్లు దాదాపుగా రెట్టింపు కానుంది. మీ జేబుకు చిల్లుపడనుంది. బిల్లు చూసి మీ గుండె గుభిల్లు మనడం ఖాయం. వినియోగదారుల నడ్డివిరిచేలా ఉన్న ఈ తాజా ప్రతిపాదనలు అమలైతే జిల్లాలో వినియోగదారులపై రూ.360 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. గుంటూరు, సాక్షి: అపాయింటెడ్ డే జూన్ 2 తర్వాత కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వినియోగదారుల నడ్డి విరిచే విధంగా జేబుకు చిల్లు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచేందుకు డిస్కం ఈఆర్సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేదు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబు దాటితే ముక్కు పిండి రూ.300కు పైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో కరెంటు వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది. చార్జీల పెంపు, కొత్త టారిఫ్‌లపై విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు గాను ఇకపై రూ.611.50 చెల్లించాలి. పొరపాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్టు పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు రానుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్టు ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున ఉంటాయి. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్టు పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించి ఆమోదం కూడా పొందడంతో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లు మోత మోగనుంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించనున్నారు. ఈ బాదుడు అమలైతే జిల్లాలో వినియోగదారులపై ఏడాదికి రూ.360 కోట్ల భారం పడనుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్తు బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ డిస్కంకు సెంట్రల్ డిస్కం నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.