న్యూఢిల్లీ: నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకుని వాటికి మాత్రమే డబ్బు చెల్లించే కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ట్రాయ్.. దాని అమలు గడువును నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలిపింది. దీంతో టెలివిజన్ వీక్షకులకు కొంత మేర ఊరట కలిగినట్టయింది. ట్రాయ్ తొలుత పేర్కొన ప్రకారం డిసెంబర్ 29న నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ టీవీ వీక్షకుల సౌకర్యార్థం ట్రాయ్ ఈ గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశం నిర్వహించిన ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశం అనంతరం ట్రాయ్ కార్యదర్శి ఎస్‌కే గుప్తా మాట్లాడుతూ.. ‘కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు అంగీకరించారు. అయితే కొత్త విధానాన్ని ఎటువంటి అంతరాయలు లేకుండా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అమలు చేయడానికి మాత్రం మరికొంత సమయం కావాలని పంపిణీ ఆపరేటర్లు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జనవరి 31వ తేదీ వరకు అవకాశం కల్పించాం. ఈ విధానంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నార’ని తెలిపారు. కొత్త నిబంధన వల్ల టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన చానళ్లను చూసుకునే అవకాశం అభిస్తుందని, వారిపై భారం కూడా తక్కువగానే పడుతుందని ట్రాయ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment