న్యూఢిల్లీ: టీవీ ప్రేక్షకులకు ట్రాయ్ మరోసారి ఊరట కల్పించింది. వినియోగదారులు తమకు ఇష్టమైన చానళ్లను ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ట్రాయ్ మంగళవారం ప్రకటించింది. దీంతో టెలివిజన్ వీక్షకులకు కొంత మేర ఊరట కలిగినట్టయింది. ట్రాయ్ తొలుత పేర్కొన ప్రకారం డిసెంబర్ 29న నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల విజ్ఞప్తితో ట్రాయ్ తొలుత జనవరి 31 వరకు ఈ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.
అయితే ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ.. చాలా మంది వినియోగదారులు నూతన విధానంలోకి మారకపోవడం వల్ల వారికి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో సోమవారం డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశం నిర్వహించిన ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల కోసం ప్రస్తుతం వారు చెల్లిస్తున్న మొత్తానికి మించకుండా, వారు కోరుకున్న చానళ్లను అందించేలా ప్యాకేజీలు రూపొందించాలని ఆపరేటర్లకు సూచించింది. కొత్త నిబంధన వల్ల టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన చానళ్లను చూసుకునే అవకాశం అభిస్తుందని, వారిపై భారం కూడా తక్కువగానే పడుతుందని ట్రాయ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment