న్యూఢిల్లీ: కొత్త బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సేవల విధానం కింద టీవీ వీక్షకులు తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మార్చి 31 దాకా పొడిగించింది. ఒకవేళ కస్టమర్లు నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంచుకోని పక్షంలో సముచితమైన ప్లాన్‌ను (బెస్ట్ ఫిట్ ప్లాన్) వారికి అందించాలని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్స్ (డీపీవో– కేబుల్ ఆపరేటర్లు)కు సూచించింది. ఆయా కస్టమర్ల వినియోగ ధోరణి, భాషల ప్రాధాన్యం, పాపులర్ చానల్స్ తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ‘ఇప్పటిదాకా చానళ్లను ఎంచుకోని సబ్‌స్క్రయిబర్స్‌ని ఉద్దేశించి గడువును మార్చి 31 దాకా పొడిగించాం.
అప్పటిదాకా డీపీవోలు అమలు చేసే బెస్ట్ ఫిట్ ప్లాన్‌ను గడువులోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. తాము ఎంపిక చేసుకున్న చానల్స్‌ను డీపీవోకి తెలియజేస్తే 72 గంటల్లో తదనుగుణంగా ప్లాన్‌ను మార్చడం జరుగుతుంది‘ అని ట్రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు మారినంత మాత్రాన ప్రత్యేకంగా లాకిన్ వ్యవధి ఏమీ ఉండదని, మార్చి 31లోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త బ్రాడ్‌కాస్టింగ్ విధానం గతేడాది డిసెంబర్ 29నే అమల్లోకి వచ్చినప్పటికీ.. టీవీ వీక్షకులు నచ్చిన చానల్స్‌ను ఎంపిక చేసుకునేందుకు జనవరి 31దాకా ట్రాయ్ గడువిచ్చింది. తాజాగా దాన్నే పొడిగించింది.
65 శాతం ఎంపిక పూర్తి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ కనెక్షన్లు, 6.7 కోట్ల డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. ఇప్పటికే కేబుల్ యూజర్లు 65% మంది, డీటీహెచ్ కస్టమర్లు 35% తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు ట్రాయ్ పేర్కొంది. కొత్త విధానంతో సబ్‌స్క్రయిబర్స్ కోరుకునే చానల్స్‌కే చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుందని తెలిపింది. నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంపిక చేసుకోని వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బెస్ట్ ఫిట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వివరించింది. కస్టమరు తనకు కావాల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకునే దాకా లేదా బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు బదిలీ అయ్యే దాకా పాత పథకమే కొనసాగుతుందని ట్రాయ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment