cable networks
-
‘ట్రాయ్ పాలసీతో వినియోగదారునిపై పెనుభారం’
సాక్షి, పశ్చిమ గోదావరి: ట్రాయ్ కస్టమర్ ఛాయస్ కింద తెస్తున్న నూతన పాలసీతో వినియోగదారునిపై పెనుభారం పడనుందని భీమవరం కేబుల్ నెట్ వర్క్(బీసీఎన్) ఛైర్మన్ శ్రీనివాసరాజు, ఎమ్.డి. గోపాలరాజు తెలిపారు. గురువారం భీమవరం కేబుల్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో ఎమ్.ఎస్.ఓలు కాసాని కృష్ణ, సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. అన్ని చానళ్లను ఆస్వాదించటానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.250 కాస్తా రూ.1200లకు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ట్రాయ్ నేటితో ముగియాల్సిన పాత పాలసీని, మార్చి 31 వరకూ పొడిగించిందని వెల్లడించారు. మూడు నెలల్లో ఈ విధానం మార్పు చెందే అవకాశం ఉందన్నారు. బీసీఎన్ కేబుల్ 30 ఏళ్లుగా కేబుల్ రంగంలో సేవలు అందిస్తోందని, ఎల్.సి.ఓలు ప్రజలపై భారం లేకుండా 30 ఏళ్లుగా కేబుల్ వ్యవస్థను నడిపారని పేర్కొన్నారు. బీసీఎన్ 2 లక్షల మంది వినియోగదారులకు బ్రాడ్ బ్యాండ్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. ఇకపై కూడా మిగిలిన సంస్థలకన్నా బీసీఎన్ తక్కువ ధరలకే ఛానళ్లను అందిస్తుందన్నారు. ఛానల్ సెట్ టాప్ బాక్స్‌పై 18 శాతం జీఎస్టీని కేంద్రం తగ్గించాలని కోరారు. ఈ ట్యాక్స్ వల్ల ఒక్కో వినియోగదారునిపై రూ.100ల ట్యాక్స్ భారం పడుతుందని, 130 రూ.ల మినిమమ్ ఛార్జీ తర్వాత వినియోగదారుడు కావాల్సిన చానల్స్‌కి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. -
మార్చి దాకా పొడిగింపు..
న్యూఢిల్లీ: కొత్త బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సేవల విధానం కింద టీవీ వీక్షకులు తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మార్చి 31 దాకా పొడిగించింది. ఒకవేళ కస్టమర్లు నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంచుకోని పక్షంలో సముచితమైన ప్లాన్‌ను (బెస్ట్ ఫిట్ ప్లాన్) వారికి అందించాలని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్స్ (డీపీవో– కేబుల్ ఆపరేటర్లు)కు సూచించింది. ఆయా కస్టమర్ల వినియోగ ధోరణి, భాషల ప్రాధాన్యం, పాపులర్ చానల్స్ తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ‘ఇప్పటిదాకా చానళ్లను ఎంచుకోని సబ్స్క్రయిబర్స్ని ఉద్దేశించి గడువును మార్చి 31 దాకా పొడిగించాం. అప్పటిదాకా డీపీవోలు అమలు చేసే బెస్ట్ ఫిట్ ప్లాన్‌ను గడువులోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. తాము ఎంపిక చేసుకున్న చానల్స్‌ను డీపీవోకి తెలియజేస్తే 72 గంటల్లో తదనుగుణంగా ప్లాన్‌ను మార్చడం జరుగుతుంది‘ అని ట్రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు మారినంత మాత్రాన ప్రత్యేకంగా లాకిన్ వ్యవధి ఏమీ ఉండదని, మార్చి 31లోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త బ్రాడ్‌కాస్టింగ్ విధానం గతేడాది డిసెంబర్ 29నే అమల్లోకి వచ్చినప్పటికీ.. టీవీ వీక్షకులు నచ్చిన చానల్స్‌ను ఎంపిక చేసుకునేందుకు జనవరి 31దాకా ట్రాయ్ గడువిచ్చింది. తాజాగా దాన్నే పొడిగించింది. 65 శాతం ఎంపిక పూర్తి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ కనెక్షన్లు, 6.7 కోట్ల డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. ఇప్పటికే కేబుల్ యూజర్లు 65% మంది, డీటీహెచ్ కస్టమర్లు 35% తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు ట్రాయ్ పేర్కొంది. కొత్త విధానంతో సబ్‌స్క్రయిబర్స్ కోరుకునే చానల్స్‌కే చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుందని తెలిపింది. నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంపిక చేసుకోని వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బెస్ట్ ఫిట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వివరించింది. కస్టమరు తనకు కావాల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకునే దాకా లేదా బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు బదిలీ అయ్యే దాకా పాత పథకమే కొనసాగుతుందని ట్రాయ్ పేర్కొంది. -
డీటీహెచ్, కేబుల్ నెట్వ ర్క్స్‌లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు?
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సర్వీసులతోపాటు డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్స్ విభాగాల్లో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పరిమితిని 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కేబుల్ నెట్వర్క్స్, డీటీహెచ్, మొబైల్ టీవీ, హెచ్ఐటీఎస్, టెలిపోర్ట్స్లలో 74 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతానికి పెంపు ప్రతిపాదనలను మంత్రిత్వ కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. న్యూస్, కరెంట్ అఫైర్స్ టీవీ చానల్స్ విషయంలో ప్రస్తుతం ఉన్న 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలనే చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను 2013లో ట్రాయ్ రూపొందించింది.