
సాక్షి, పశ్చిమ గోదావరి: ట్రాయ్ కస్టమర్ ఛాయస్ కింద తెస్తున్న నూతన పాలసీతో వినియోగదారునిపై పెనుభారం పడనుందని భీమవరం కేబుల్ నెట్ వర్క్(బీసీఎన్) ఛైర్మన్ శ్రీనివాసరాజు, ఎమ్.డి. గోపాలరాజు తెలిపారు. గురువారం భీమవరం కేబుల్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో ఎమ్.ఎస్.ఓలు కాసాని కృష్ణ, సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. అన్ని చానళ్లను ఆస్వాదించటానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.250 కాస్తా రూ.1200లకు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ట్రాయ్ నేటితో ముగియాల్సిన పాత పాలసీని, మార్చి 31 వరకూ పొడిగించిందని వెల్లడించారు. మూడు నెలల్లో ఈ విధానం మార్పు చెందే అవకాశం ఉందన్నారు.
బీసీఎన్ కేబుల్ 30 ఏళ్లుగా కేబుల్ రంగంలో సేవలు అందిస్తోందని, ఎల్.సి.ఓలు ప్రజలపై భారం లేకుండా 30 ఏళ్లుగా కేబుల్ వ్యవస్థను నడిపారని పేర్కొన్నారు. బీసీఎన్ 2 లక్షల మంది వినియోగదారులకు బ్రాడ్ బ్యాండ్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. ఇకపై కూడా మిగిలిన సంస్థలకన్నా బీసీఎన్ తక్కువ ధరలకే ఛానళ్లను అందిస్తుందన్నారు. ఛానల్ సెట్ టాప్ బాక్స్‌పై 18 శాతం జీఎస్టీని కేంద్రం తగ్గించాలని కోరారు. ఈ ట్యాక్స్ వల్ల ఒక్కో వినియోగదారునిపై రూ.100ల ట్యాక్స్ భారం పడుతుందని, 130 రూ.ల మినిమమ్ ఛార్జీ తర్వాత వినియోగదారుడు కావాల్సిన చానల్స్‌కి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment