జూన్ 2 వరకూ ఆగండి
- విద్యుత్ చార్జీలపై అప్పుడే నిర్ణయం వద్దు
- నేడు ఈఆర్‌సీకి లేఖ రాయనున్న ప్రభుత్వం
- రెండు రాష్ట్రాలకు వేర్వేరు చార్జీలు నిర్ణయించాల్సిందేనా?
- అదే జరిగితే చార్జీల వ్యవహారం మళ్లీ మొదటికే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలపై నిర్ణయం వెలువరించేందుకు జూన్ 2 వరకూ ఆగాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కి ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఈ మేరకు సోమవారం ఈఆర్‌సీకి ఇంధనశాఖ లేఖ రాయనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ చార్జీలపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త ప్రభుత్వాలు వచ్చే వరకూ వేచిచూడాలని ఈఆర్‌సీని కోరనుంది. ఫలి తంగా విద్యుత్ చార్జీల వ్యవహారం జూన్ 2 వరకూ నిలిచిపోనుంది. అయితే, ఇది కాస్తా కొత్త గందరగోళానికి దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి. దీంతో రెండు వేర్వేరు విద్యుత్ చార్జీలను ప్రకటించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు.
ఇదే జరి గితే.. మళ్లీ కొత్తగా చార్జీల పెంపునకు విద్యుత్ సంస్థ ల నుంచి ప్రతిపాదనలు తీసుకుని ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించిన అనంతరమే చార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మూడు నెలలు పడుతుంది. దీంతో చార్జీల వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చినట్టు అవుతుంది. వాస్తవానికి 2014 -15 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ టారిఫ్ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
ఎన్నికలు ముగిసిన తర్వాత విద్యుత్ చార్జీలపై ఆదేశాలు జారీచేయవచ్చునని ఈఆర్‌సీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈఆర్‌సీ మరోసారి ప్రభుత్వ అనుమతిని కోరింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నందువల్ల జూన్ 2న కొత్త ప్రభుత్వాలు వచ్చాకే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఈఆర్‌సీకి స్పష్టంచేయాలని సర్కారు నిర్ణయించింది.
ఈఆర్‌సీనే వద్దంటే...!
ప్రస్తుతం ఉన్న ఈఆర్‌సీ రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే కొనసాగనుంది. ఆరు నెలల తర్వాత రెండు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఈఆర్‌సీలు ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈఆర్‌సీ తమ రాష్ట్రానికి విద్యుత్ చార్జీలు నిర్ణయించకూడదని... తెలంగాణ ఈఆర్‌సీ ఏర్పడిన తర్వాత నిర్ణయించుకుంటామని ఎవరైనా అభ్యంతరాలు లెవనెత్తితే ఈ ప్రక్రియ కాస్తా మరో కొత్త సమస్యకు దారితీయనుంది.
ఇప్పటికే ఈఆర్‌సీ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఈఆర్‌సీ నిర్ణయాన్ని ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే వ్యతిరేకిస్తే.. జూన్ 2 తర్వాత మరో ఆరు నెలల పాటు విద్యుత్ చార్జీల వ్యవహారం అలాగే నిలిచిపోతుంది. అయితే, ప్రభుత్వం వ్యతిరేకించినా.. చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఈఆర్‌సీ సుమోటాగా చార్జీలను నిర్ణయిస్తే అది కాస్తా మరో కొత్త చర్చకు, గందరగోళానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.