సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కో ప్లాంట్ల విద్యుత్ సామర్థ్యం తగ్గించి, ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేస్తోంది. యూనిట్‌కు ఏకంగా రూ.6.20 చెల్లిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య రూ.21 కోట్ల విలువైన 35.11 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. కేవలం తమవారి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు 15 రోజులుగా సాగుతున్న ఈ తంతులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆంక్షలు విధించింది. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీకి చెందిన ఖమ్మం మాజీ ఎంపీ ఒకరు, మరో రాజకీయ ప్రముఖుడు.. ఈ ఇద్దరికి సంబంధించిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందం మేరకే జెన్‌కో ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గించి, బహిరంగ మార్కెట్లో అధిక ధర వెచ్చించి విద్యుత్ కొనుగోళ్లకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
యూనిట్ రూ.4కే జెన్‌కో విద్యుత్
జెన్‌కో ప్లాంట్ల నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.4కే లభిస్తుంది. కానీ ఈ ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్‌కు ఏకంగా రూ.6.20 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో మరే ఇతర రాష్ట్రాల పోటీ లేకున్నా అంత రేటు పెట్టి కొనుగోలు చేయడంపై విద్యుత్‌రంగ వర్గాలనే విస్మయ పరుస్తోంది. విద్యుత్ సంస్థల గణాంకాలు పరిశీలిస్తే.. ఈ నెల 7వ తేదీ మొదలు 11 రోజుల్లో రూ.21,76,82,000 వ్యయం కాగల విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు లెక్కతేలింది.
కొనాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 175 నుంచి 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గత నాలుగేళ్ళుగా అటు ఇటూగా ఇదేవిధమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ డిమాండ్‌కు తగ్గ విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులో ఉంది. ఎన్టీపీసీ (ఇబ్రహీంపట్నం), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ–ముద్దనూరు), దామోదరం సంజీవ య్య థర్మల్ (కృష్ణపట్నం) విద్యుత్ కేంద్రాలకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అంటే రోజుకు 120 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. ఈ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4 లోపే ఉంటుంది. దీనికితోడు 1,797 మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది. ప్రస్తుతం నీళ్ళు లేవనుకున్నా మాచ్‌ఖండ్, సీలేరు నుంచైనా రోజుకు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే అవకాశం ఉంది.
కేంద్ర విద్యుత్ వాటా 52 మిలియన్ యూనిట్లు అందుతుంది. ఇవి కాకుండా పీపీఏలున్న స్వతంత్ర విద్యుత్ సంస్థలు (ఐపీపీలు) 10 ఎంయూలు, పవన విద్యుత్ 13 ఎంయూలు, సౌరవిద్యుత్ 10 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో విద్యుత్ లభ్యత 225 మిలియన్ యూనిట్లు ఉంటుంది. డిమాండ్ (185 ఎంయూ) కన్నా రోజుకు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉండే వీలుంది. జెన్‌కో ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే మిగులు సాధ్యమేనని విద్యుత్ సంస్థలే ఏపీఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో (ఏఆర్‌ఆర్) పేర్కొన్నాయి. అయినప్పటికీ, అవసరం లేకపోయినా ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా జెన్‌కో ఉత్పత్తి తగ్గిందని, ఆర్టీపీపీ కొత్త ప్లాంట్‌కు బొగ్గు లింకేజీ ప్రక్రియ పూర్తవ్వలేదని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. అయితే బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కోల్ ఇండియా చెబుతుండటం గమనార్హం. దీన్నిబట్టి. ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు గాను ఉద్దేశపూర్వకంగానే జెన్‌కో ఉత్పత్తి తగ్గిస్తున్నారని స్పష్టమవుతోంది.
అవసరం లేకున్నా విద్యుత్ కొనుగోళ్లు!
Published Thu, May 24 2018 4:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment