100 రోజులూ.. నిండా మోసమే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ‘ఓటు’ దాటాక తగలేసిన చంద్రబాబు.. పూటకో మాట.. రోజుకో విధానం తో ప్రజలను ఏమార్చుతున్నారు. వంద రో జులుగా ఇదే కథ. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలుచేయని చంద్రబాబు.. ఈనెల 4న జిల్లాపై వరాల వర్షం కురిపించడం గమనార్హం. చంద్రబాబు వంద రోజుల పాలనను ఒక్కసారి విశ్లేషిస్తే.. 2004, 2009 ఎన్నికల్లో ఓటమితో చిక్కిశల్యమైన టీడీపీని అధికారంలోకి తేవడం కోసం బాబు హామీల వర్షం కురిపించారు. అధికారమే లక్ష్యంగా అక్టోబరు 2, 2012న హిందూపురం నుంచి చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ హామీలపై హామీలు ఇచ్చేశారు.
పంట రుణాల మాఫీ,డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నెలనెలా నిరుద్యోగులకు రూ.2 వేల భృతి, వృద్ధాప్య పెన్షన్ రూ.వెయ్యికి పెంపు, సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇళ్లకు 24 గంటల విద్యుత్ సరఫరా వంటి హామీలు ప్రధానమైనవి. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలును విస్మరించారు. జూన్ 8న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడమే అందుకు తార్కాణం. టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టిన పంట, డ్వాక్రా రుణాల మాఫీని చంద్రబాబు నీరుగార్చారు. జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.11,180.25 కోట్లపే బకాయిపడ్డారు. 61,711 స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని 6.45 లక్షల మంది మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు.
చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పంట రుణాలు, డ్వాక్రా రుణాల రూపంలో ఒక్క మన జిల్లాలోనే రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. ఇందుకు చంద్రబాబు షరతులు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ పదిన ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 31)ను జారీచేశారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తేల్చిచెబుతూ ఈనెల 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 164)ను జారీచేశారు. ఆ తర్వాత రుణ మాఫీకి జారీచేసిన మార్గదర్శకాల్లో డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని.. సంఘానికి రూ.లక్ష ప్రోత్సాహం ఇస్తామని మాట మార్చారు. కానీ.. ఆ మేరకు కూడా రుణ మాఫీని వర్తింపజేయకపోవడం గమనార్హం. ఇంటికో ఉద్యోగం.. రూ.రెండు వేల నిరుద్యోగ భృతి హామీలపై అతీగతీ లేదు. సేద్యానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వగలమని తేల్చిచెప్పారు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వంద రోజుల పాలనలో చంద్రబాబు అమలుచేయలేకపోయారు.
పాత హామీలను పక్కన పెట్టి..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగకుండా రోజుకో కొత్త హామీని ఇస్తూ చంద్రబాబు ఏమార్చేయత్నం చేస్తున్నారు. జూన్ 16న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్శిటీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. జూన్ 24న తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని.. కుప్పంలో విమానాశ్రయం, తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఈనెల 4న శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో మాత్రం సెంట్రల్ వర్శిటీని అనంతపురంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఐటీఐఆర్ కాదు.. ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు.
ఇటీవల ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) చైర్మన్ అలోక్ సిన్హా కుప్పంలో పర్యటించి.. ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. ఈనెల 4న చంద్రబాబు చేసిన ప్రకటన తద్భిన్నంగా ఉంది. కుప్పంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ.. శాసనసభలో ఇచ్చిన హామీలకు పొంతన కుదరకపోవడంతో వాటి అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉన్న వాటికే నిధుల్లేవంటూ..
పాత హామీల అమలుకే నిధుల్లేవని చెబుతోన్న చంద్రబాబు.. ఈ నెల 4న శాసనసభలో ఇచ్చిన హామీల అమలుకు నిధులెక్కడి నుంచి తెస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేయాలంటే కనీసం రూ.4,500 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. కుప్పంలో విమానాశ్రయం ఏ ర్పాటుకు కనిష్టంగా రూ.300 కోట్ల అవసరమని ఐఐఏ అధికారు లు స్పష్టీకరిస్తున్నారు. తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి కనీసం రూ.ఐదు వేల కోట్లు.. మెట్రో రైలుకు రూ.1,200 కోట్లు అవసరం అవుతాయని అధికారవర్గాల అంచనా. తిరుపతి సమీపంలో ఐఐటీ ఏర్పాటుకు రూ.500 కోట్లు అవసరం. ఈ నిధులను కేంద్రం ఇస్తుంది. ఏర్పేడు మండలంలో ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు రూ.450 కోట్లు అవసరం అవుతాయి. ఆ నిధులను కూడా కేంద్రమే మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
ఇక ఏర్పేడులో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్(ఎన్‌ఐఎమ్‌జెడ్) ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.వెయ్యి కోట్లకుపైగా వెచ్చించాల్సి ఉంటుందని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. జిల్లాలో హార్టికల్చర్ జోన్.. ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీల అమలుకు రూ.250 కోట్లు, హార్టికల్చర్ జోన్ ఏర్పాటుకు రూ.వంద కోట్లు, ఫుడ్ పార్క్‌కు రూ.వంద కోట్లు, తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధికి రూ.వంద కోట్లు అవసరం అవుతాయి.
ఈ హామీల అమలుకు కనిష్టంగా రూ.13,500 కోట్లు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ నిధులను ఎక్కడి నుంచి తెస్తారన్నది అంతుచిక్కడం లేదు. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వరముఖి-సోమశిల లింక్ కెనాల్ ప్రాజెక్టులను పూర్తిచేయడంపై వంద రోజుల్లో చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం.