బాబూ.. ఇదేనా ప్రేమ..!
సాక్షి, ఏలూరు: ‘మీరు ఆలోచించారు. ఓట్లు వేసి టీడీపీని గెలిపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలు దక్కించుకోవడానికి ప్రధాన కారకులు మీరే. మహిళలూ.. మీ రుణం తీర్చుకోలేనిది. మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటా. మీరంతా ఆర్థిక స్వావలంబన సాధిం చేలా చేయూతనిస్తా’ అంటూ కొయ్యలగూడెంలో గతనెలలో నిర్వహించిన మహిళల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిపై అమిత ప్రేమ కురిపించారు. తాను అధికారంలోకి రావడానికి కారకులైన ఈ జిల్లా ఆడపడుచులపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని ముఖ్యమంత్రి ఆరోజు చెబుతుంటే నిజమనుకున్నమహిళలు ప్రభుత్వ తాజా చర్యల్ని చూసి ఘొల్లుమంటున్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒకరు చొప్పున మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉంటారు. వీరిలో కొందరు జిల్లాస్థాయి అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరిస్తుంటారు. ఈ విధంగా జిల్లాలో 46 మండలాలకు 46 మంది మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు. నాలుగేళ్లుగా వీరంతా ప్రభుత్వ పథకాలను స్వయం సహాయక సంఘాలకు చేరవేస్తున్నారు.
ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు సమాఖ్యల తరఫున రూ.62 లక్షలను రాజధాని నిర్మాణానికి విరాళంగా మహిళా సంఘాల ప్రతినిధులు అందజేశారు. అయితే వీరిని తొలగించాలని ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇది తెలిసిన మహిళలు మాపై ప్రేమ చూపించడమంటే ఇదేనా బాబూ? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విధి నిర్వహణలో ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని మహిళలకు సేవచేసేందుకే పనిచేస్తున్నామంటున్నారు. వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నా, వృత్తి పరంగా ఎవరు అధికారంలో ఉంటే వారికే అనుకూలంగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని, తమను తొలగించడం అన్యాయమని వేడుకుంటున్నారు. 2015 వరకు తాము అధ్యక్షులుగా కొనసాగేందుకు మండల, గ్రామ సమాఖ్యల్లో తీర్మానం చేశామని, అంతవరకు రద్దు యోచనను విరమించుకోవాలని సీఎంను కోరుతున్నారు. కాదని రద్దుచేస్తే న్యాయం కోసం పోరాటం చేయడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదంటున్నారు.
తొలగిస్తే పోరాటమే
ఎన్నో కష్టాలు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నాం. అధికారులు కూడా మాకు అన్యాయం చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆర్థికంగానూ ఆసరా అవుతున్నాం. అయినా మమ్మల్ని ఏడాది ముందే తొలగించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పోరాటం చేస్తాం.
- కె.ధనలక్ష్మి, పశ్చిమగోదావరి జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షురాలు
ఎన్నో అవమానాలు
మహిళా సమాఖ్యలు ఇటీవల కాలంలో ఎన్నో అవమానాలకు గురవుతున్నాయి. ఈ సమాఖ్య వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని అనడం భావ్యం కాదు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహాయపడతాం కాని పార్టీలను చూసి పనిచేయం. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని కోరుతున్నాం.
- బలే మరియమ్మ,
ఉండి మండల సమాఖ్య అధ్యక్షురాలు
న్యాయం చేయాలి
మహిళను లక్షాధికారులు చేస్తామంటున్న చంద్రబాబు నాయుడు సమాఖ్యలను రద్దు చేయడం అన్యాయం. సీఎం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి. మావల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాం. ఆరోపణలు ఉన్న వారిని తొలగిస్తే అభ్యంతరం లేదు. కానీ అందరినీ తీసేయడం భావ్యం కాదు.
- కారే పార్వతి, పశ్చిమగోదావరి జిల్లా సమాఖ్య కోశాధికారి