Genco plants
-
‘థర్మల్’ ధగధగలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలో సీలేరు బేసిన్ జలవిద్యుత్ కేంద్రాలు గరిష్ట విద్యుత్ ఉత్పత్తి నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగన్నర నెలల్లో థర్మల్ యూనిట్లు తమ సత్తా చాటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 18 అర్ధరాత్రి వరకూ ఏపీ జెన్కో థర్మల్ యూనిట్లు 10,108.196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 12,994.987 మిలియన్ యూనిట్లు సరఫరా చేయడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం నాలుగన్నర నెలల స్వల్ప వ్యవధిలోనే 2,886.791 మిలియన్ యూనిట్ల అధిక ఉత్పిత్తి జరిగింది. గత ఏడాది ఆగస్టు 18న ఏపీ జెన్కో థర్మల్ విద్యుదుత్పత్తి 60.616 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదేరోజు ఉత్పత్తి 84.537 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. పెరిగిన పీఎల్ఎఫ్.. ఏపీ జెన్కో తన అనుబంధ సంస్థ ఏపీపీడీసీఎల్తో కలిపి మొత్తం మూడు ప్లాంట్లలో 5,810 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 18 వరకూ ఈ కేంద్రాలు మొత్తం సగటున 51.84 పీఎల్ఎఫ్ సాధించగా ఈ సంవత్సరం ఇదే కాలంలో 66.61 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ) పీఎల్ఎఫ్ 64.10 నుంచి 72.43 శాతానికి పెరిగింది. అలాగే, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్) పీఎల్ఎఫ్ 73.59 నుంచి 78.38 శాతానికి చేరింది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం పీఎల్ఎఫ్ 27.46 శాతం నుంచి 53.98 శాతానికి పెరిగింది. సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి.. నిజానికి.. వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు.. బొగ్గు తడిసి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. ఆర్టీపీపీ మూడో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. గత మే 8న ఏకంగా 224 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదు చేసింది. ఆర్టీపీపీ ఒకటో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. అదే మే 25న 219 మెగావాట్లు ఉత్పత్తి నమోదైంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ 6వ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 15న 219 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి జరిగింది. ఇక్కడే ఐదో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 24న 217 మెగావాట్లు ఉత్పత్తి సాధించింది. ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని.. థర్మల్ యూనిట్లలో విద్యుదుత్పత్తి పెంచడం ద్వారా ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో మా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలవల్లే ఏపీ జెన్కో ప్రగతిబాటలో పయనిస్తోంది. రాష్ట్ర అవసరాలను 45–50 శాతం వరకూ సమకూరుస్తోంది. రాష్ట్రానికి ఎక్కువ పరిమాణంలో బొగ్గు కేటాయించేలా సీఎం, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. అందువల్లే అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ రికార్డులు సాధిస్తున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
అవసరం లేకున్నా విద్యుత్ కొనుగోళ్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ జెన్కో ప్లాంట్ల విద్యుత్ సామర్థ్యం తగ్గించి, ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేస్తోంది. యూనిట్‌కు ఏకంగా రూ.6.20 చెల్లిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య రూ.21 కోట్ల విలువైన 35.11 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. కేవలం తమవారి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు 15 రోజులుగా సాగుతున్న ఈ తంతులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆంక్షలు విధించింది. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీకి చెందిన ఖమ్మం మాజీ ఎంపీ ఒకరు, మరో రాజకీయ ప్రముఖుడు.. ఈ ఇద్దరికి సంబంధించిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందం మేరకే జెన్కో ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గించి, బహిరంగ మార్కెట్లో అధిక ధర వెచ్చించి విద్యుత్ కొనుగోళ్లకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. యూనిట్ రూ.4కే జెన్కో విద్యుత్ జెన్కో ప్లాంట్ల నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.4కే లభిస్తుంది. కానీ ఈ ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్‌కు ఏకంగా రూ.6.20 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో మరే ఇతర రాష్ట్రాల పోటీ లేకున్నా అంత రేటు పెట్టి కొనుగోలు చేయడంపై విద్యుత్‌రంగ వర్గాలనే విస్మయ పరుస్తోంది. విద్యుత్ సంస్థల గణాంకాలు పరిశీలిస్తే.. ఈ నెల 7వ తేదీ మొదలు 11 రోజుల్లో రూ.21,76,82,000 వ్యయం కాగల విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు లెక్కతేలింది. కొనాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 175 నుంచి 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గత నాలుగేళ్ళుగా అటు ఇటూగా ఇదేవిధమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ డిమాండ్‌కు తగ్గ విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులో ఉంది. ఎన్టీపీసీ (ఇబ్రహీంపట్నం), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ–ముద్దనూరు), దామోదరం సంజీవ య్య థర్మల్ (కృష్ణపట్నం) విద్యుత్ కేంద్రాలకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అంటే రోజుకు 120 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. ఈ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4 లోపే ఉంటుంది. దీనికితోడు 1,797 మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది. ప్రస్తుతం నీళ్ళు లేవనుకున్నా మాచ్‌ఖండ్, సీలేరు నుంచైనా రోజుకు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే అవకాశం ఉంది. కేంద్ర విద్యుత్ వాటా 52 మిలియన్ యూనిట్లు అందుతుంది. ఇవి కాకుండా పీపీఏలున్న స్వతంత్ర విద్యుత్ సంస్థలు (ఐపీపీలు) 10 ఎంయూలు, పవన విద్యుత్ 13 ఎంయూలు, సౌరవిద్యుత్ 10 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో విద్యుత్ లభ్యత 225 మిలియన్ యూనిట్లు ఉంటుంది. డిమాండ్ (185 ఎంయూ) కన్నా రోజుకు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉండే వీలుంది. జెన్కో ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే మిగులు సాధ్యమేనని విద్యుత్ సంస్థలే ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో (ఏఆర్ఆర్) పేర్కొన్నాయి. అయినప్పటికీ, అవసరం లేకపోయినా ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా జెన్కో ఉత్పత్తి తగ్గిందని, ఆర్టీపీపీ కొత్త ప్లాంట్‌కు బొగ్గు లింకేజీ ప్రక్రియ పూర్తవ్వలేదని జెన్కో వర్గాలు చెబుతున్నాయి. అయితే బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కోల్ ఇండియా చెబుతుండటం గమనార్హం. దీన్నిబట్టి. ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు గాను ఉద్దేశపూర్వకంగానే జెన్కో ఉత్పత్తి తగ్గిస్తున్నారని స్పష్టమవుతోంది. -
పవర్ ‘పంచ్’
రూ.941 కోట్ల వడ్డన గృహ వినియోగం 200 యూనిట్లు దాటితే మోతే వచ్చే ఏప్రిల్ నుంచే కొత్త విద్యుత్ చార్జీలు చార్జీల పెంపునకు ఆమోదం తెలిపిన ఏపీఈఆర్సీ ప్రభుత్వం రూ. 3,186 కోట్ల సబ్సిడీయే ఇవ్వడంతో వినియోగదారులపై భారం.. సగటున 5% పెరగనున్న చార్జీలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారుల నడ్డి విరగనుంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రజలపై ఏకంగా రూ. 941 కోట్ల భారం పడనుంది. విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం పూర్తిగా భరించకుండా కోత పెట్టడంతో చార్జీలు పెరగనున్నాయి. సగటున ఐదు శాతం మేర చార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సోమవారం ఆమోదముద్ర వేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1,188 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించగా.. ఈఆర్సీ స్వల్పంగా రూ. 247 కోట్ల మేర తగ్గించి రూ.941 కోట్ల మేర చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. 200 వందల యూనిట్ల వరకు వినియోగంపై కొత్తగా ఎలాంటి భారం మోపలేదు. అంతకుమించి విద్యుత్‌ను వాడే గృహ వినియోగదారులు సహా వాణిజ్య, పారిశ్రామిక వర్గాలను దండుకునేలా చార్జీలను పెంచింది. మరోవైపు పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెట్టినప్పటికీ డిమాండ్ చార్జీల విషయంలో ఏమాత్రం సడలింపు ఇవ్వలేదు. జెన్కో ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల నష్టం వాటిల్లుతోందనే సూచనలను ఈఆర్సీ పట్టించుకోలేదు. ఇందులో కొంతమేరకే కోతపెట్టింది. 11 వేల మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ప్రభుత్వం చెబుతుంటే, అంత అవసరం లేదని నియంత్రణ మండలి భావించింది. అందులో 3,098 మిలియన్ యూనిట్లు మేర కోత విధించింది. ఈ రూపేణా కొనుగోలు విద్యుత్ భారాన్ని కొంతమేర తగ్గించే ప్రయత్నం చేసింది. సర్కారు సబ్సిడీ రూ.3,186 కోట్లే రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.25,515 కోట్లు అవసరమని ప్రతిపాదించాయి. అయితే ఈఆర్సీ దీన్ని రూ.22,329 కోట్లకు పరిమితం చేసింది. రూ. 7,716 కోట్ల మేర ఆర్థిక లోటు ఉందని.. డిస్కమ్‌లు గత నెలలో ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదికలో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 6,455 కోట్ల సబ్సిడీ వస్తుందని ఆశించిన డిస్కమ్‌లు.. మొత్తం లోటులో రూ.1,261 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం కేవలం రూ. 3,186 కోట్లు మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. పంపిణీ నష్టాలను నివారించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో డిస్కమ్‌లు రూ.1188 కోట్లకు తిరిగి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఇందులో రూ. 247 కోట్ల మేరకు తగ్గించడంతో పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 941 కోట్లను చార్జీల రూపంలో సమకూర్చుకోనున్నాయి. అయినప్పటికీ రూ. 3,589 కోట్ల మేర ఆర్థిక లోటు ఉండటంతో.. దీన్ని అధిగమించేందుకు 3,098 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు విద్యుత్‌ను తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మిగులు విద్యుత్ కోసం 11 వేల మిలియన్ యూనిట్ల కొనుగోలుకు స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. ఏపీఈఆర్సీ ఇందులో దాదాపు 3వేల మిలియన్ యూనిట్ల కొనుగోలును నిరాకరించినా, ఇంకా 8 వేల మిలియన్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ భారం రూ. 6 వేల కోట్ల పైచిలుకు ఉండే వీలుంది. పంచాయతీల్లో చీకట్లు: గ్రామ పంచాయతీలు ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. తాజాగా మరో రూ. 25 కోట్లమేర చార్జీల రూపంలో భారం మోపేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అదనపు భారం వల్ల పంచాయితీలకు సమస్యలు తప్పవంటున్నారు. అదే బాబు అదే పాలన మూడురోజుల కిందట విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బడ్జెట్ ప్రసంగాన్ని మీడియా ముందు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడానికి సన్నద్ధమవుతున్నారని అన్నారు. బాబులో ఏ మార్పూ రాలేదని ‘అదే బాబు అదే పాలన’ అని కూడా జగన్ విమర్శించారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. బడుగులకు ఊరట: ఈఆర్సీ చైర్మన్ విద్యుత్ చార్జీల పెంపులో 92 శాతం వినియోగదారులకు ఊరట కలిగించామని ఏపీఈఆర్సీ చైర్మన్ గ్రంథి భవానీ ప్రసాద్ తెలిపారు. ఉచిత విద్యుత్‌కు కత్తెర? నష్టాల భర్తీ కోసం విద్యుత్ వినియోగం తగ్గేలా చూడాలని, కొనుగోలు విద్యుత్‌కు కోత పెట్టాలని డిస్కమ్‌లకు ఏపీఈఆర్సీ సూచించింది. ఏకంగా 3,098 మిలియన్ యూనిట్ల మేరకు కోత విధించింది. దీంతో ఈ మేరకు ఎక్కడ కోత విధిస్తారనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమలు కొత్తగా వస్తాయని, వ్యవసాయ వినియోగం పెరుగుతుందని ఊహించి డిస్కమ్‌లు లెక్కించాయని ఏపీఈఆర్సీ భావించింది. పరిశ్రమలకు అవసరమైనప్పుడు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తామని చెప్పింది. నిరంతర విద్యుత్ పథకం అమలులో ఉంది కాబట్టి గృహ, వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ ఒక్కటే. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కసరత్తులో ఉంది. రైతులకు సోలార్ విద్యుత్ పంపుసెట్లను అందజేయాలని నిర్ణయించింది. కొత్త కనెక్షన్లు 2.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటే, 50 వేలకే పరిమితం చేసింది. వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు అమర్చే ఆలోచనలో ఉంది. దీన్నిబట్టి చూస్తే కోత పెట్టే విద్యుత్‌లో సింహభాగం వ్యవసాయ రంగం నుంచే ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఇప్పటికే 9 గంటల ఉచిత విద్యుత్ హామీకి తూట్లు పొడిచి 7 గంటలే ఇస్తున్నారు. అదీ ఎక్కువగా రైతు వినియోగించలేని అర్ధరాత్రి సమయంలో సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది సంస్కరణల పేరుతో 3 వేల మిలియన్ యూనిట్లు తగ్గిస్తామని ‘అందరికీ విద్యుత్’ డాక్యుమెంట్లో ప్రభుత్వమే వెల్లడించింది. ఇవన్నీ ఉచిత విద్యుత్‌కు కోత వేసే సూచనలేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలపై పరోక్ష వడ్డన పరిశ్రమలపై ఏకంగా రూ.600 కోట్ల మేర వడ్డనకు సర్కారు సిద్ధమైంది. డిమాండ్ చార్జీల రూపంలో ఈ మొత్తం వసూలు చేయాలన్న ప్రతిపాదనకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అయితే మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే డిమాండ్ చార్జీలున్నాయని (పరిశ్రమల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అదనంగా విధించే చార్జీలు) పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ విచారణ సందర్భంగా ఆఫ్ పీక్ అవర్స్‌లో చార్జీలు తగ్గించాలని, పీక్ అవర్స్‌లో పెంచుకున్నా ఫర్వాలేదని చెప్పారు. ఆఫ్ పీక్ అవర్స్‌లో తాము వాడకం పెంచుకోవడం వల్ల పీక్ అవర్స్‌లో లోడ్ పడకుండా ఉంటుందని సూచించారు. అయితే ఇవేవీ ఈఆర్సీ పరిగణనలోనికి తీసుకున్నట్టు లేదు. సీవోడీ చార్జీలను పెంచి పరిశ్రమలపై భారం మోపారు. పరిశ్రమలు రానట్టేనా? రాజధాని నిర్మాణం, కొత్త పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా వేశాయి. ప్రస్తుతం 54,884 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ లభ్యతను, ఈ ఏడాది 57,982 మిలియన్ యూనిట్లకు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. కానీ దీనికి ఏపీఈఆర్సీ ఒప్పుకోలేదు. ఇందులో 3 వేల మిలియన్ యూనిట్లకు పైగా కోత పెట్టింది. దీంతో పరిశ్రమలు రావడానికి అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలు వచ్చినప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాలని కమిషన్ సూచించింది. ముందస్తుగానే తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న సర్కారుకు ఈ ఆదేశం ఓ విధంగా షాక్ ఇచ్చినట్టే. అత్యధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు పరిశ్రమలు అంగీకరిస్తాయా? అనేది అనుమానమే. ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ రాయితీ హామీని ఇవ్వలేదు. కాబట్టి కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇది ఇబ్బందికరమేనని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పారు. పవర్‌లూమ్స్ దెబ్బ నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ రాయితీలు కల్పిస్తామన్నారు. కానీ ఇవేవీ అమలుకు నోచుకోలేదు. ఈ రంగానికి విద్యుత్ చార్జీల విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. -
మెగా పవర్ ప్రాజెక్ట్‌కు నిధులెలా?
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో మెగా పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మిగులు విద్యుత్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. దామరచర్ల మండలంలో ప్రతిపాదిత 7,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైతే తెలంగాణ మిగులు విద్యుత్‌గల రాష్ట్రంగా వెలుగొందుతుంది. టీ-జెన్కో అధ్వర్యంలోనే దామరచర్లలో 5,200 మెగావాట్ల భారీ ప్లాంట్ నిర్మాణం జరిగితే అది అద్భుతమే అవుతుందని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న జెన్కో ప్లాంట్ల సామర్థ్యమే 2282 మెగావాట్లు. ఇంతకు రెట్టింపు సామర్థ్యంతో అతి తక్కువ కాలంలోనే ప్లాంట్ల నిర్మాణం సాహసమే అవుతుందంటున్నారు. మూడేళ్ల వ్యవధిలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తామని.. ఐదేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జెన్కో ఇప్పటికే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మెగావాట్ల కేంద్రం, కొత్తగూడెం ప్రాజెక్టు ఏడో దశలో భాగంగా 800 మెగావాట్ల కొత్త యూనిట్ స్థాపనకు సన్నాహాలు ప్రారంభించింది. రెండేళ్ల వ్యవధిలోనే వీటిని నిర్మించాలని బీహెచ్ఈఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి కోసం భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు భూపాలపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రెండో దశ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుదు త్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పనులను చేపట్టే దశలోనే నల్లగొండలో మెగా ప్రాజెక్టు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త మలుపు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్తగూడెం, మణుగూరు ప్రాజెక్టులకు రూ.12,200 కోట్లు అవసరమని జెన్కో అంచనాలు వేసింది. కేంద్రం పరిధిలో ఉన్న ఎన్టీపీసీని మినహాయించినా జెన్కో అధ్వర్యంలో దామరచర్ల మండలంలో 5,200 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పుడున్న రేట్ల ప్రకారం దాదాపు రూ. 31,200 కోట్లు కావాలి. ఇంత భారీ బడ్జెట్‌ను ఎలా సమీకరిస్తారన్నదే అసలు ప్రశ్న. దీన్ని తక్కువ కాలంలో పూర్తి చేయడం కూడా పెద్ద సవాలే.