సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలో సీలేరు బేసిన్ జలవిద్యుత్ కేంద్రాలు గరిష్ట విద్యుత్ ఉత్పత్తి నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగన్నర నెలల్లో థర్మల్ యూనిట్లు తమ సత్తా చాటాయి.
2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 18 అర్ధరాత్రి వరకూ ఏపీ జెన్‌కో థర్మల్ యూనిట్లు 10,108.196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 12,994.987 మిలియన్ యూనిట్లు సరఫరా చేయడం విశేషం.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం నాలుగన్నర నెలల స్వల్ప వ్యవధిలోనే 2,886.791 మిలియన్ యూనిట్ల అధిక ఉత్పిత్తి జరిగింది. గత ఏడాది ఆగస్టు 18న ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుదుత్పత్తి 60.616 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదేరోజు ఉత్పత్తి 84.537 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
పెరిగిన పీఎల్‌ఎఫ్..
ఏపీ జెన్‌కో తన అనుబంధ సంస్థ ఏపీపీడీసీఎల్‌తో కలిపి మొత్తం మూడు ప్లాంట్లలో 5,810 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది.
గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 18 వరకూ ఈ కేంద్రాలు మొత్తం సగటున 51.84 పీఎల్‌ఎఫ్ సాధించగా ఈ సంవత్సరం ఇదే కాలంలో 66.61 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ) పీఎల్‌ఎఫ్ 64.10 నుంచి 72.43 శాతానికి పెరిగింది.
అలాగే, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్‌టీటీపీఎస్) పీఎల్‌ఎఫ్ 73.59 నుంచి 78.38 శాతానికి చేరింది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం పీఎల్‌ఎఫ్ 27.46 శాతం నుంచి 53.98 శాతానికి పెరిగింది.
సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి..
నిజానికి.. వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు.. బొగ్గు తడిసి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్‌కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. ఆర్టీపీపీ మూడో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. గత మే 8న ఏకంగా 224 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదు చేసింది.
ఆర్టీపీపీ ఒకటో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. అదే మే 25న 219 మెగావాట్లు ఉత్పత్తి నమోదైంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ 6వ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 15న 219 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి జరిగింది. ఇక్కడే ఐదో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 24న 217 మెగావాట్లు ఉత్పత్తి సాధించింది.
ఏపీ జెన్‌కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని..
థర్మల్ యూనిట్లలో విద్యుదుత్పత్తి పెంచడం ద్వారా ఏపీ జెన్‌కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో మా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలవల్లే ఏపీ జెన్‌కో ప్రగతిబాటలో పయనిస్తోంది.
రాష్ట్ర అవసరాలను 45–50 శాతం వరకూ సమకూరుస్తోంది. రాష్ట్రానికి ఎక్కువ పరిమాణంలో బొగ్గు కేటాయించేలా సీఎం, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. అందువల్లే అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ రికార్డులు సాధిస్తున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీ జెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment