పవర్ ‘పంచ్’
- రూ.941 కోట్ల వడ్డన
- గృహ వినియోగం 200 యూనిట్లు దాటితే మోతే
- వచ్చే ఏప్రిల్ నుంచే కొత్త విద్యుత్ చార్జీలు
- చార్జీల పెంపునకు ఆమోదం తెలిపిన ఏపీఈఆర్సీ
- ప్రభుత్వం రూ. 3,186 కోట్ల సబ్సిడీయే ఇవ్వడంతో
- వినియోగదారులపై భారం.. సగటున 5% పెరగనున్న చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారుల నడ్డి విరగనుంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రజలపై ఏకంగా రూ. 941 కోట్ల భారం పడనుంది. విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం పూర్తిగా భరించకుండా కోత పెట్టడంతో చార్జీలు పెరగనున్నాయి. సగటున ఐదు శాతం మేర చార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సోమవారం ఆమోదముద్ర వేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1,188 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించగా.. ఈఆర్సీ స్వల్పంగా రూ. 247 కోట్ల మేర తగ్గించి రూ.941 కోట్ల మేర చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది.
200 వందల యూనిట్ల వరకు వినియోగంపై కొత్తగా ఎలాంటి భారం మోపలేదు. అంతకుమించి విద్యుత్‌ను వాడే గృహ వినియోగదారులు సహా వాణిజ్య, పారిశ్రామిక వర్గాలను దండుకునేలా చార్జీలను పెంచింది. మరోవైపు పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెట్టినప్పటికీ డిమాండ్ చార్జీల విషయంలో ఏమాత్రం సడలింపు ఇవ్వలేదు. జెన్‌కో ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల నష్టం వాటిల్లుతోందనే సూచనలను ఈఆర్సీ పట్టించుకోలేదు. ఇందులో కొంతమేరకే కోతపెట్టింది. 11 వేల మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ప్రభుత్వం చెబుతుంటే, అంత అవసరం లేదని నియంత్రణ మండలి భావించింది. అందులో 3,098 మిలియన్ యూనిట్లు మేర కోత విధించింది. ఈ రూపేణా కొనుగోలు విద్యుత్ భారాన్ని కొంతమేర తగ్గించే ప్రయత్నం చేసింది.
సర్కారు సబ్సిడీ రూ.3,186 కోట్లే
రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.25,515 కోట్లు అవసరమని ప్రతిపాదించాయి. అయితే ఈఆర్సీ దీన్ని రూ.22,329 కోట్లకు పరిమితం చేసింది. రూ. 7,716 కోట్ల మేర ఆర్థిక లోటు ఉందని.. డిస్కమ్‌లు గత నెలలో ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదికలో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 6,455 కోట్ల సబ్సిడీ వస్తుందని ఆశించిన డిస్కమ్‌లు.. మొత్తం లోటులో రూ.1,261 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం కేవలం రూ. 3,186 కోట్లు మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. పంపిణీ నష్టాలను నివారించుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో డిస్కమ్‌లు రూ.1188 కోట్లకు తిరిగి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఇందులో రూ. 247 కోట్ల మేరకు తగ్గించడంతో పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 941 కోట్లను చార్జీల రూపంలో సమకూర్చుకోనున్నాయి. అయినప్పటికీ రూ. 3,589 కోట్ల మేర ఆర్థిక లోటు ఉండటంతో.. దీన్ని అధిగమించేందుకు 3,098 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు విద్యుత్‌ను తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మిగులు విద్యుత్ కోసం 11 వేల మిలియన్ యూనిట్ల కొనుగోలుకు స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. ఏపీఈఆర్‌సీ ఇందులో దాదాపు 3వేల మిలియన్ యూనిట్ల కొనుగోలును నిరాకరించినా, ఇంకా 8 వేల మిలియన్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ భారం రూ. 6 వేల కోట్ల పైచిలుకు ఉండే వీలుంది.
పంచాయతీల్లో చీకట్లు: గ్రామ పంచాయతీలు ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. తాజాగా మరో రూ. 25 కోట్లమేర చార్జీల రూపంలో భారం మోపేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అదనపు భారం వల్ల పంచాయితీలకు సమస్యలు తప్పవంటున్నారు.
అదే బాబు అదే పాలన
మూడురోజుల కిందట విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన బడ్జెట్ ప్రసంగాన్ని మీడియా ముందు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడానికి సన్నద్ధమవుతున్నారని అన్నారు. బాబులో ఏ మార్పూ రాలేదని ‘అదే బాబు అదే పాలన’ అని కూడా జగన్ విమర్శించారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.
బడుగులకు ఊరట: ఈఆర్సీ చైర్మన్
విద్యుత్ చార్జీల పెంపులో 92 శాతం వినియోగదారులకు ఊరట కలిగించామని ఏపీఈఆర్‌సీ చైర్మన్ గ్రంథి భవానీ ప్రసాద్ తెలిపారు.
ఉచిత విద్యుత్‌కు కత్తెర?
నష్టాల భర్తీ కోసం విద్యుత్ వినియోగం తగ్గేలా చూడాలని, కొనుగోలు విద్యుత్‌కు కోత పెట్టాలని డిస్కమ్‌లకు ఏపీఈఆర్‌సీ సూచించింది. ఏకంగా 3,098 మిలియన్ యూనిట్ల మేరకు కోత విధించింది. దీంతో ఈ మేరకు ఎక్కడ కోత విధిస్తారనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమలు కొత్తగా వస్తాయని, వ్యవసాయ వినియోగం పెరుగుతుందని ఊహించి డిస్కమ్‌లు లెక్కించాయని ఏపీఈఆర్‌సీ భావించింది. పరిశ్రమలకు అవసరమైనప్పుడు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తామని చెప్పింది. నిరంతర విద్యుత్ పథకం అమలులో ఉంది కాబట్టి గృహ, వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ ఒక్కటే. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కసరత్తులో ఉంది. రైతులకు సోలార్ విద్యుత్ పంపుసెట్లను అందజేయాలని నిర్ణయించింది. కొత్త కనెక్షన్లు 2.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటే, 50 వేలకే పరిమితం చేసింది. వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు అమర్చే ఆలోచనలో ఉంది. దీన్నిబట్టి చూస్తే కోత పెట్టే విద్యుత్‌లో సింహభాగం వ్యవసాయ రంగం నుంచే ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఇప్పటికే 9 గంటల ఉచిత విద్యుత్ హామీకి తూట్లు పొడిచి 7 గంటలే ఇస్తున్నారు. అదీ ఎక్కువగా రైతు వినియోగించలేని అర్ధరాత్రి సమయంలో సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది సంస్కరణల పేరుతో 3 వేల మిలియన్ యూనిట్లు తగ్గిస్తామని ‘అందరికీ విద్యుత్’ డాక్యుమెంట్‌లో ప్రభుత్వమే వెల్లడించింది. ఇవన్నీ ఉచిత విద్యుత్‌కు కోత వేసే సూచనలేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిశ్రమలపై పరోక్ష వడ్డన
పరిశ్రమలపై ఏకంగా రూ.600 కోట్ల మేర వడ్డనకు సర్కారు సిద్ధమైంది. డిమాండ్ చార్జీల రూపంలో ఈ మొత్తం వసూలు చేయాలన్న ప్రతిపాదనకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అయితే మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే డిమాండ్ చార్జీలున్నాయని (పరిశ్రమల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అదనంగా విధించే చార్జీలు) పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ విచారణ సందర్భంగా ఆఫ్ పీక్ అవర్స్‌లో చార్జీలు తగ్గించాలని, పీక్ అవర్స్‌లో పెంచుకున్నా ఫర్వాలేదని చెప్పారు. ఆఫ్ పీక్ అవర్స్‌లో తాము వాడకం పెంచుకోవడం వల్ల పీక్ అవర్స్‌లో లోడ్ పడకుండా ఉంటుందని సూచించారు. అయితే ఇవేవీ ఈఆర్సీ పరిగణనలోనికి తీసుకున్నట్టు లేదు. సీవోడీ చార్జీలను పెంచి పరిశ్రమలపై భారం మోపారు.
పరిశ్రమలు రానట్టేనా?
రాజధాని నిర్మాణం, కొత్త పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా వేశాయి. ప్రస్తుతం 54,884 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ లభ్యతను, ఈ ఏడాది 57,982 మిలియన్ యూనిట్లకు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. కానీ దీనికి ఏపీఈఆర్‌సీ ఒప్పుకోలేదు. ఇందులో 3 వేల మిలియన్ యూనిట్లకు పైగా కోత పెట్టింది. దీంతో పరిశ్రమలు రావడానికి అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలు వచ్చినప్పుడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేయాలని కమిషన్ సూచించింది. ముందస్తుగానే తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న సర్కారుకు ఈ ఆదేశం ఓ విధంగా షాక్ ఇచ్చినట్టే. అత్యధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు పరిశ్రమలు అంగీకరిస్తాయా? అనేది అనుమానమే. ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ రాయితీ హామీని ఇవ్వలేదు. కాబట్టి కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇది ఇబ్బందికరమేనని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పారు. పవర్‌లూమ్స్ దెబ్బ నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ రాయితీలు కల్పిస్తామన్నారు. కానీ ఇవేవీ అమలుకు నోచుకోలేదు. ఈ రంగానికి విద్యుత్ చార్జీల విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు.