మెగా పవర్ ప్రాజెక్ట్‌కు నిధులెలా? | How to spare funds for Mega power projects ? | Sakshi
Sakshi News home page

మెగా పవర్ ప్రాజెక్ట్‌కు నిధులెలా?

Published Wed, Dec 24 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

How to spare funds for Mega power projects ?

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో మెగా పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మిగులు విద్యుత్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. దామరచర్ల మండలంలో ప్రతిపాదిత 7,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైతే తెలంగాణ మిగులు విద్యుత్‌గల రాష్ట్రంగా వెలుగొందుతుంది. టీ-జెన్‌కో అధ్వర్యంలోనే దామరచర్లలో 5,200 మెగావాట్ల భారీ ప్లాంట్ నిర్మాణం జరిగితే అది అద్భుతమే అవుతుందని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
  ప్రస్తుతమున్న జెన్‌కో ప్లాంట్ల సామర్థ్యమే 2282 మెగావాట్లు. ఇంతకు రెట్టింపు సామర్థ్యంతో అతి తక్కువ కాలంలోనే ప్లాంట్ల నిర్మాణం సాహసమే అవుతుందంటున్నారు. మూడేళ్ల వ్యవధిలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తామని.. ఐదేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జెన్‌కో ఇప్పటికే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మెగావాట్ల కేంద్రం, కొత్తగూడెం ప్రాజెక్టు ఏడో దశలో భాగంగా 800 మెగావాట్ల కొత్త యూనిట్ స్థాపనకు సన్నాహాలు ప్రారంభించింది. రెండేళ్ల వ్యవధిలోనే వీటిని నిర్మించాలని బీహెచ్‌ఈఎల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
 
 వీటి కోసం భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు భూపాలపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రెండో దశ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుదు త్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పనులను చేపట్టే దశలోనే నల్లగొండలో మెగా ప్రాజెక్టు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త మలుపు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్తగూడెం, మణుగూరు ప్రాజెక్టులకు రూ.12,200 కోట్లు అవసరమని జెన్‌కో అంచనాలు వేసింది. కేంద్రం పరిధిలో ఉన్న ఎన్టీపీసీని మినహాయించినా జెన్‌కో అధ్వర్యంలో దామరచర్ల మండలంలో 5,200 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పుడున్న రేట్ల ప్రకారం దాదాపు రూ. 31,200 కోట్లు కావాలి. ఇంత భారీ బడ్జెట్‌ను ఎలా సమీకరిస్తారన్నదే అసలు ప్రశ్న. దీన్ని తక్కువ కాలంలో పూర్తి చేయడం కూడా పెద్ద సవాలే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement