కృష్ణమ్మ కాంతులు | Telangana government to take center as Mega power projects krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కాంతులు

Published Wed, Dec 24 2014 1:37 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Telangana government to take center as Mega power projects krishna river

* మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా కృష్ణానది పరీవాహక ప్రాంతం
* నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు
* ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
* కృష్ణా తీరంలో 7,800 ఎకరాల అటవీ భూములు గుర్తింపు
* 7,600 మె.వా. ప్లాంట్ల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
* రూ. 55 వేల కోట్ల పెట్టుబడులు.. 30 వేల మందికి ఉపాధి
* కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్‌కు ఫోన్‌లో సమాచారం
* ప్రతిపాదనలిస్తే వారంలో అనుమతులిస్తామని మంత్రి హామీ

 
సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: భారీ స్థాయిలో విద్యుదుత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. రాష్ర్టం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను వీలైనంత త్వరగా అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగా నల్లగొండ జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. జిల్లాలోని దామరచర్ల మండలంలో ఎన్టీపీసీ, జెన్‌కో ఆధ్వర్యంలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
 
 ఇక్కడ అందుబాటులో ఉన్న విస్తారమైన అటవీ భూములను ఉపయోగించుకుని దాదాపు రూ. 55 వేల కోట్ల పెట్టుబడులతో 7,600 మెగావాట్ల సామర్థ్యం మేరకు విద్యుదు త్పత్తి కేంద్రాలను నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. కృష్ణా తీరంలోని దాదాపు 7,800 ఎకరాలను ఇందుకనువైనవిగా గుర్తించారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీ్‌శ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కలసి దామరచర్ల మండలంలోని రక్షిత అటవీ ప్రాంతంలో మంగళవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.
 
 మెగాపవర్ ప్రాజెక్టులు స్థాపించేందుకు ఈ స్థలం అనుకూలమైనదిగా నిర్ణయించారు. అక్కడే జిల్లా అధికారులతో గంట పాటు సమావేశమై సీఎం సమీక్ష జరిపారు. సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులతో మరోసారి భేటీ అయ్యారు. యుద్ధప్రాతిపదికన భూ సర్వే చేసి 10 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్)ను తయారు చేయాలని జెన్‌కో అధికారులనూ ఆదేశించారు. వచ్చే నెల తొలివారంలోనే ఢిల్లీ వెళ్లి ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తానని, ఇందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాష్ర్ట విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు దక్షిణ తెలంగాణ విద్యుత్ హబ్‌గా నల్లగొండ జిల్లా రూపుదిద్దుకోనుంది.
 
సానుకూలంగా స్పందించిన కేంద్రం
 సీఎం నిర్ణయం మేరకు దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్‌పూర్ ప్రాంతాల్లో జెన్‌కో అధ్వర్యంలో 5,200 మెగావాట్లు, ఎన్‌టీపీసీ అధ్వర్యంలో 2,400 మెగావాట్ల ప్రాజెక్టులు రానున్నాయి. అటు కృష్ణానదికి, ఇటు రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న అటవీ భూములు ఇందుకనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రిజర్వ్ ఫారెస్టు భూమి కావడంతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారు.  అటవీ భూమిని వినియోగించుకున్న మేర భూమిని మరోచోట అటవీ శాఖకు కేటాయిస్తామని చెప్పారు.
 
దీనికి కేంద్రమంత్రి  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వారంలోనే అనుమతులిప్పిస్తామన్నారు. దీంతో జనవరి మొదటి వారంలో తానే స్వయంగా ప్రతిపాదనలను ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం అన్ని నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే ప్రాంతంలో 7600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడం వల్ల నల్లగొండ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారీ పెట్టుబడుల వల్ల 20 నుంచి 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
 
లక్ష్యం మేరకు ప్రాజెక్టుల నిర్మాణం
 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ అధ్వర్యంలో తెలంగాణలో 4,000 మెగావాట్ల ప్లాంట్ ను కేంద్రం నిర్మించాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్ కోసం దామరచర్ల మండలంలోనే ఎన్టీపీసీకి స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించారు. టీ జెన్‌కో ఆధ్వర్యంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రాష్ర్టం ఇప్పటికే నిర్ణయించింది. అందులో 1,080 మెగావాట్ల ప్లాంట్ ను (270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూని ట్లు) ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో బీహెచ్‌ఈఎల్ నిర్మిస్తోంది. ఈ పనులు రెండేళ్లలో పూర్తవుతాయి. మరో 5,200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను జెన్‌కో ద్వారా నల్లగొండలోనే నెలకొల్పాలని కేసీఆర్ ఆదేశించారు. సీఎం సమీక్షలో సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement