జల జగడంపై జోక్యం!
ఇరు రాష్ట్రాల నీటి వివాదాల్లో తొలిసారి జోక్యం చేసుకోనున్న కేంద్రం
రెండు రాష్ట్రాల కార్యదర్శులు, ఈఎన్‌సీలను ఢిల్లీకి పిలిచిన
కేంద్ర జలవనరుల శాఖ
కృష్ణా బోర్డు, రాష్ట్ర అధికారులతో 18న ఉన్నతస్థాయి సమావేశం
బోర్డు పరిధిలో చేర్చాల్సిన ప్రాజెక్టులపై అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రభుత్వ సలహాదారు సమావేశం
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పరిధిలో నీటి వాటాలు, వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏడాదిగా తలెత్తిన జల వివాదాల విషయంలో తటస్థంగా వ్యవహరిస్తూ వచ్చిన కేంద్రం తొలిసారి ఇరు రాష్ట్రాల అధికారులతో ముఖాముఖి చర్చలు జరిపి, సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. కృష్ణా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, వాటాల అంశాలపై ఈ నెల 18న ఢిల్లీలో నిర్వహించే సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని, అనంతరం తదుపరి చర్యలకు దిగాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం అధికారులను ఢిల్లీకి పిలిచిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.
18న సమావేశం కీలకం..
ఈ నెల 18న ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ అధ్యక్షతన కృష్ణా బోర్డు చైర్మన్, సభ్యులతో పాటు ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఈఎన్‌సీలతో కలిపి ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి ఉన్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బోర్డు పరిధిలోకి ఏయే ప్రాజెక్టులను తేవాలి.. దానికి ప్రాతిపదిక ఎలా ఉంటుంది.. పరిధిలోకి తెచ్చాక బోర్డు చేసే పనేంటి తదితరాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కొరవడిన స్పష్టత..
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పర్యవేక్షణపై ఏడాదిగా అస్పష్టత కొనసాగుతోంది. గత ఏడాది నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల, శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి తదితరాలపై వివాదం రేగిన సమయంలో కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ వద్ద కూడా నీటి వినియోగాన్ని లెక్కగట్టాలని, నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండాలని కేంద్రాన్ని కోరింది.
బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేస్తేనే నియంత్రణలోకి తెచ్చుకోవడం సాధ్యమని, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించకుండా అది కుదరదని బోర్డు స్పష్టం చేసింది. ఇదే సమయంలో తెలంగాణ సైతం తన వాదనను బోర్డుకు, కేంద్ర జల వనరుల శాఖకు తెలియజేస్తూ వచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఎగువన పూర్తికాని ప్రాజెక్టులతో వినియోగించుకోలేని నీటిని రాష్ట్ర పరిధిలోని సాగర్ ప్రాజెక్టు పరిధిలో వినియోగించుకునే హక్కు రాష్ట్రానికి ఉందని వాదించింది.