ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను మామూలు రహదారిలా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంగారెడ్డి–గజ్వేల్–చౌటుప్పల్–మాల్–కడ్తాల్–షాద్‌నగర్–చేవెళ్ల–కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పుతో 338 కిలో మీటర్ల పొడవుతో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం జరగాలన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని చెప్పారు.
ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడతానన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై సీఎస్ ఎస్.కె.జోషి, రోడ్లు–భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఇతర అధికారులతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం చర్చించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో ఫోన్లో మాట్లాడారు. ‘‘ముంబై–పుణే, అహ్మదాబాద్–వదోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కన్నా మన రీజనల్ రింగ్ రోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లకు వెళ్లే జంక్షన్లను బాగా అభివృద్ధి చేయండి. ఈ నాలుగు కూడళ్ల వద్ద ప్రభుత్వం 300 నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తోంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించండి.
పార్కింగ్, ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్‌లు, పార్కులు, పిల్లలు ఆడుకునే స్థలాలు, షాపింగ్ మాళ్లు, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయండి. మంచి రహదారులు, రహదారుల పక్కన అన్ని సౌకర్యాలున్న దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయండి’’ అని అధికారులకు సూచించారు. దేశంలోనే గొప్ప కాస్మొపాలిటిన్ నగరం హైదరాబాద్ అని, ఇక్కడి వాతావరణం, సామరస్య జీవనం వల్ల నగరం మరింతగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతున్నాయని, ఈ దృష్ట్యా ఇప్పుడున్న ఓఆర్‌ఆర్ భవిష్యత్ అవసరాలు తీర్చలేదని, అందుకే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప రహదారిగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment