Express Highways
-
కొత్త చరిత్రకు 'దారులు'
ఆంధ్రప్రదేశ్ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకే రోజు జరిగాయి. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమాలలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని గడ్కరీ ప్రకటించడమే కాదు దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మూంజూరు చేశామని వెల్లడించారు. ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని, గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా అడుగులు వేస్తున్న రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి వచ్చి బెంజి సర్కిల్ రెండో ఫై్లఓవర్ను ప్రారంభించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. తన గౌరవార్థం సీఎం ఇచ్చిన విందును స్వీకరించారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి విషయాల గురించి అక్కడ ఆయన రివ్యూ నిర్వహించారు. సీఎం జగన్ ప్రతిపాదనలన్నిటినీ ఆమోదిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో పోర్టులు, రోడ్లు, రైలు కనెక్టివిటీ అభివృద్ధి పరచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏకకాలంలో నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఇందులో భాగంగా విద్యుత్, నీరు, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సూచనల మేరకు రూపొందించిన ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ పథకంతో దేశంలో రూ.1.10 లక్షల కోట్ల జీడీపీ పెరిగిందని చెప్పారు. దేశ అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన ఎంతటి కీలకమనడానికి ఈ పథకమే తార్కాణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోర్టుల ఆధారంగా ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని సూచించారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంపొందించడం ద్వారానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రం పట్లా వివక్ష లేదన్నారు. దేశం అంటే అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖకు ఏనాడూ నిధుల కొరత లేదన్నారు. గడ్కరీ ఇంకా ఏమన్నారంటే.. ఏపీకి ఆరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు ► దేశంలో నిర్మిస్తోన్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఆరు ఉన్నాయి. విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సరుకు రవాణాలో అత్యంత ముఖ్యమైనది. ఛత్తీస్గడ్, ఒడిశా, ఏపీలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 465 కి.మీ మేర రూ.16,102 కోట్లతో నిర్మిస్తున్నాం. 2024 చివరి నాటికి పూర్తి చేస్తాం. ► నాగ్‌పూర్ నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది. నా నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి మొదలవుతోంది కాబట్టి ఈ రహదారిపై నాకు ప్రత్యేక ఆసక్తి ఉంది. రూ.15 వేల కోట్లతో 405 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం. ► చిత్తూరు నుంచి తమిళనాడులోని తాచ్చూర్ వరకు 116 కి.మీ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టును 2024లో పూర్తి చేస్తాం. ► రూ.6 వేల కోట్లతో నిర్మిస్తున్న హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం. ► బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 262 కి.మీ మేర రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీ పరిధిలో రూ.5 వేల కోట్ల మేరకు రహదారి నిర్మిస్తాం. తద్వారా ఏపీకి తమిళనాడు, కర్ణాటకలతో మరింత మెరుగైన అనుసంధానం సాధ్యమవుతుంది. ► కర్నూలు–సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 318 కిలోమీటర్ల మేర రూ.420 కోట్లతో నిర్మిస్తాం. 2025 మార్చి నాటికి పూర్తి అవుతుంది. సరుకు రవాణా వ్యయం తగ్గించాలి ► దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని బాగా తగ్గించాలి. వస్తువు ధరలో సరుకు రవాణా వ్యయం చైనాలో 8 శాతం నుంచి 10 శాతం, అమెరికా, యూరోపియన్ దేశాల్లో 12 శాతం ఉండగా, మన దేశంలో 16 శాతం నుంచి 18 శాతం వరకు ఉంది. ► దాంతో మన దేశంలో వస్తువుల ధరలు అధికంగా ఉంటుండటంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అందుకే దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని 8 శాతానికి తగ్గించాలని మా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఆరు శాతానికి కూడా తగ్గించేందుకు యత్నిస్తాం. ► దేశంలో యాక్సిస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ హైవేలతో ఇంధన వ్యయం తగ్గుతుంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం పూర్తి అయితే రహదారులపై వాహనాల వేగ పరిమితి పెంచుతాం. బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి ► దేశంలో బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. డీజిల్ ట్రక్కుల స్థానంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు ప్రారంభించాలని నిర్ణయించాం. డీజిల్ స్థానంలో ఎల్ఎన్జీని ప్రోత్సహించాలి. డీజిల్ రూ.100 వ్యయం అయితే ఎల్ఎన్జీ రూ.40కు, సీఎన్జీ రూ.60కు వస్తోంది. ► గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై కసరత్తు చేస్తున్నాం. మురుగు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించాలి. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మురుగు నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి విక్రయం ద్వారా ఏటా రూ.325 కోట్లు ఆదాయం ఆర్జిస్తోంది. ► రూఫ్‌టాప్ సోలార్, విండ్ మిల్లులతో విద్యుత్ వ్యయం చాలా తగ్గుతుంది. ఎలక్ట్రోలైజర్లను గ్రీన్ హైడ్రోజన్‌గా పరిగణించవచ్చు. బియ్యం, చెరకు రసం, మోలాసిస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగాన్ని ఇంధన, విద్యుత్ రంగాల దిశగా మళ్లించాలి. పెట్రోల్, డీజిల్ రెండింటితోనూ పనిచేసే ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను ప్రోత్సహించాలి. గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా ఏపీ ► దేశానికి ఉపయోగపడేలా తక్కువ వ్యయం, కాలుష్య రహిత దేశీయ ఇంధనంగా ఇథనాల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. మిగులు బియ్యం నిల్వలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అందుకు గ్రోత్ సెంటర్‌గా మారాలి. బయో ఇంధనం, గ్రీన్ ఇంధనం దేశానికి తక్షణ అవసరం. ► ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. రోప్‌వే, కేబుల్ వే వంటివి హిమాచల్‌ప్రదేశ్‌లో 16 ప్రాజెక్టులు, ఉత్తరాఖండ్‌లో 15 ప్రాజెక్టులు ఇచ్చాం. ఆంధ్ర ప్రదేశ్‌లో ఏమైనా ఈ తరహా ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే ఆమోదిస్తాం. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్–2 ప్రారంభం సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి గురువారం జాతికి అంకితం చేశారు. సాయంత్రం 3.40 గంటలకు వారు బెంజ్‌సర్కిల్ రెండో ఫ్లైఓవర్ వద్దకు వచ్చారు. ఈ ఫ్లైఓవర్‌పై శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. కాగా, బెంజ్ సర్కిల్‌కు తూర్పు వైపున ఇదివరకే మొదటి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇప్పుడు పడమర వైపున రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఈ వంతెనను జ్యోతిమహల్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2.47 కిలోమీటర్ల మేర మూడు వరసల్లో ఏడాదిలోనే (గడువుకు ఆరు నెలల ముందే) నిర్మించారు. ఇందుకోసం రూ.96 కోట్లు వెచ్చించారు. గడువుకు ముందే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, నిర్మాణ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ అభినందించారు. దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శంకరనారాయణలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు మహా గణపతి ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామని చెప్పారు. కొన్ని పనులకు ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని, ఆయా పనులకు అంచనాలు తయారు చేస్తున్నారన్నారు. మరికొన్ని పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లన్నింటికీ రోడ్లను అనుసంధానం చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. విశాఖపట్నంకు కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. ముంబైలో నిర్మిస్తున్న కోస్టల్ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాక, వైజాగ్ కారిడార్‌కు ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. అంతకు ముందు వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కేశినేని నాని, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో దుర్గగుడి ఘాట్‌రోడ్డు పై నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రులు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దేశ వ్యాప్తంగా కేంద్రం చేపడుతున్న పలు అభివృద్ధి అంశాలను పార్టీ శ్రేణులకు వివరించారు. పలువురు పార్టీ కార్యకర్తలు గడ్కరీకి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ రాష్ట్రం గుండా 6 నూతన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం
సాక్షి, అమరావతి: దేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంలో ఏపీ రాష్ట్రానికి కేంద్రం పెద్దపీట వేసింది. రాష్ట్రానికి నూతన ఎక్స్‌ప్రెస్ హైవేలను కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రం గుండా మరో 6 నూతన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ప్రధానంగా పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు ఉన్న మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తూ ఎక్ర్‌ప్రెస్ హైవేలు నిర్మించనున్నారు. రాష్ట్రంలో 378 కిలోమీటర్లు పారిశ్రామిక ప్రోత్సాహం, సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దేశంలో 22 గ్రీన్ ఫీల్డ్/ఎక్ర్‌ప్రెస్ హైవేలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఆరు రాష్ట్రం గుండా వెళ్తాయి. దేశం మొత్తం మీద 2,157 కి.మీ. మేర కేంద్ర ప్రభుత్వం ఎక్ర్‌ప్రెస్ హైవేలు నిర్మించనుంది. వాటిలో రాష్ట్ర పరిధిలో 378 కి.మీ.నిర్మిస్తారు. ఈ రహదారులకు రూ.15,876 కోట్లతో ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. ఆరు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఇవీ.. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 272 కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో 92 కి.మీ. రాష్ట్రంలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల గుండా వెళ్తుంది. రూ.3,864 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. చిత్తూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 125 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇది రాష్ట్రంలో 75 కి.మీ. నిడివి ఉంటుంది. రూ.3,150 కోట్లతో నిర్మించే ఈ హైవేను 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. రాయ్‌పూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే 464 కి.మీ. ఉంటుంది. రెండు పోర్టులు, రెండు స్టీల్ ప్లాంట్లు, నాల్కో వంటి ప్రముఖ భారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ఈ హైవే దేశంలోనే లాజిస్టిక్స్ రంగంలో కీలకం కానుంది. రాష్ట్రంలో 100 కి.మీ.మేర దీనిని నిర్మిస్తారు. మొత్తం రూ.4,200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. విజయవాడ –నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 457 కి.మీ.మేర నిర్మిస్తారు. రాష్ట్రంలో 29 కి.మీ. మేర దీని నిడివి ఉంటుంది. రూ.1,218 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు. కర్నూలు – షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 318 కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో రాష్ట్రం గుండా 10 కి.మీ. ఉంటుంది. రూ.420 కోట్ల ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు. హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 521 కి.మీ. మేర నిర్మిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల గుండా సాగే ఈ రోడ్డు రాష్ట్రంలో 72 కి.మీ. ఉంటుంది. రూ.3,024 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు. -
సిటీ చుట్టూ సూపర్ హైవే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మామూలు రహదారిలా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంగారెడ్డి–గజ్వేల్–చౌటుప్పల్–మాల్–కడ్తాల్–షాద్‌నగర్–చేవెళ్ల–కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పుతో 338 కిలో మీటర్ల పొడవుతో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడతానన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై సీఎస్ ఎస్.కె.జోషి, రోడ్లు–భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఇతర అధికారులతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం చర్చించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడారు. ‘‘ముంబై–పుణే, అహ్మదాబాద్–వదోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కన్నా మన రీజనల్ రింగ్ రోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లకు వెళ్లే జంక్షన్లను బాగా అభివృద్ధి చేయండి. ఈ నాలుగు కూడళ్ల వద్ద ప్రభుత్వం 300 నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తోంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించండి. పార్కింగ్, ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్‌లు, పార్కులు, పిల్లలు ఆడుకునే స్థలాలు, షాపింగ్ మాళ్లు, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయండి. మంచి రహదారులు, రహదారుల పక్కన అన్ని సౌకర్యాలున్న దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయండి’’ అని అధికారులకు సూచించారు. దేశంలోనే గొప్ప కాస్మొపాలిటిన్ నగరం హైదరాబాద్ అని, ఇక్కడి వాతావరణం, సామరస్య జీవనం వల్ల నగరం మరింతగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతున్నాయని, ఈ దృష్ట్యా ఇప్పుడున్న ఓఆర్ఆర్ భవిష్యత్ అవసరాలు తీర్చలేదని, అందుకే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప రహదారిగా ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నామని వెల్లడించారు. -
భేటీ ఢీ
స్లమ్‌ఫ్రీ సిటీ.. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు.. సాగర్ ప్రక్షాళన.. ఎక్స్‌ప్రెస్ హైవేలు.. కలల మెట్రో రైలు పరుగులు.. వేలకోట్లతో నాలాల అభివృద్ధి.. వినోదాల వినాయక్ సాగర్ నిర్మాణం... విశ్వనగరంగా హైదరాబాద్.. ఇలా ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తోంది.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ప్రకటనలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధికి సంబంధించి మంగళవారం సీఎం సమక్షంలో తొలిసారిగా అఖిల పక్షం భేటీ కాబోతోంది. ఢీ అంటే ఢీ అనేందుకు ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. అభివృద్ధికి అవసరమైన వేలకోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నలను సంధించనున్నాయి. సిటీబ్యూరో: నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంపై నగరం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, శాసనసభా పక్ష నేతలు పాల్గొననున్న ఈ సమావేశంలో మెట్రోరైలు అలైన్మెంట్లో మార్పులు, పేదలకు భూముల క్రమబద్ధీకరణ, ఇందిరాపార్కులో ‘వినాయకసాగర్’ ఏర్పాటు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనున్నప్పటికీ, పేదల ఆహార భద్రత కార్డులు, సమగ్ర కుటుంబ సర్వే, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభవన్ ఏర్పాటు, స్లమ్‌ఫ్రీ సిటీ, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రక్రియ, సాగర్ చుట్టూ ఆకాశహార్మయాలు తదితర అంశాలు సైతం చర్చకు వచ్చే వీలుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రకటిస్తుండడం తెలిసిందే. అందుకుగాను వెచ్చించనున్న నిధులు, స్మార్ట్‌సిటీ కోసం చేపట్టనున్న పథకాలు, నగరంలో చెరువుల సంరక్షణ తదితర అంశాలు కూడా ప్రస్తావనకొచ్చే వీలుంది. ఆయా అంశాలపై అఖిలపక్షంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో తొలి సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మెట్రో ఆలైన్మెంట్పై స్పష్టత.. నగరంలో మూడు చోట్ల మెట్రో అలైన్మెంట్ మార్పులపై అఖిలపక్ష భేటీతో స్పష్టత రానుంది. సుల్తాన్‌బజార్,అసెంబ్లీ,పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ మార్పుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే తాజా అలైన్మెంట్ ఖరారు చేస్తామని సీఎం శాసనసభలో ప్రకటించిన విషయం విదితమే. అలైన్మెంట్ మార్పు కారణంగా సుల్తాన్‌బజార్,అసెంబ్లీ ప్రాంతాల్లో దూరం స్వల్పంగా పెరగనుంది. పాతనగరంలో మాత్రం 3.2 కి.మీ మేర మెట్రో మార్గం పెరగనుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సైతం నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి చెల్లిస్తామని సీఎం గతంలో హామీఇచ్చిన విషయం విధితమే. కాగా ప్రధాన రహదారులపై మెట్రో పనులు జరిగేందుకు వీలుగా క్లిష్టంగా మారిన 283 ఆస్తుల సేకరణ ప్రక్రియను డిసెంబరు నెలాఖరులోగా పూర్తిచేయాలని గతంలో నిర్ణయించారు. ఈ అంశాన్ని కూడా సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జూన్ నాటికి మూడు కారిడార్లలో 75 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలని సర్కార్ కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో తొలి అఖిల పక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వినాయకసాగర్ .. సాగర్ ప్రక్షాళనపై నివేదిక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టడంతోపాటు ఇకపై సాగర్‌లో నిమజ్జనాలు చేయకుండా ఉండేందుకుగాను ఇందిరాపార్కులో ‘వినాయకసాగర్’ను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. ఇందిరాపార్కులో ఏర్పాటు చేసే చెరువుకు సంబంధించి, నిమజ్జనాల సందర్భంగా ఆయా ఏర్పాట్లు చేసేందుకు ఉన్న అవకాశాల గురించి అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు అందజేస్తారు. దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టనున్నారు. ఏడాదిలో ఒక నెల మాత్రమే నిమజ్జనం కార్యక్రమాలుంటాయి కనుక మిగతా 11 నెలలపాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు వాటర్‌స్పోర్ట్స్‌కు అవకాశాలపై చర్చిస్తారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేయాల్సిన రహదారులు, తదితరమైనవాటిపై చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఎంత పరిమాణం విస్తీర్ణంలో దేవుళ్ల విగ్రహాలను వదులుతున్నారు. విగ్రహాలను నీటిలో వేసేందుకు రోడ్డుపై ఎంత దూరాన్ని వినియోగిస్తున్నారు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిమజ్జనాలకు సంబంధించిన చెరువు ఏర్పాటుకు దాదాపు 10- 12 ఎకరాల స్థలం సరిపోతుందని ప్రాథమికంగా అంచనా. భూముల క్రమబ ద్ధీకరణ .. హైదరాబాద్‌లో పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం పరిధిలో 1074 ప్రాంతాలలో ( పార్శళ్లు)114.22 ఎకరాలు యూఎల్సీ భూములు తమ అధీనంలో ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ తాజాగా వెల్లడించింది. అదే విధంగా 30 ఏళ్ల కిందనే కబ్జాకు గురైన 1400 ఎకరాలలో 33,127 ఇళ్లు, భవనాలు, 200 ఎకరాల్లో 1927 వాణిజ్య సంస్థలు, 727 ఎకరాల్లో 1827 ప్రభుత్వ భవనాలు, రోడ్లు ఉన్నట్లు సర్కారుకు సమర్పించిన నివేదికలో అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. వీటితో పాటు హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లోని మురికి వాడల్లో ఉన్న 3 లక్షల ఇళ్లు, భవనాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో ఉన్నా 2 లక్షల ఇళ్లను క్రమబద్ధీకరించటం ద్వారా రూ 6 వేల నుంచి రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎలాంటి వివాదం లేని ప్రభుత్వభూమి 20.56 ఎకరాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీటి అమ్మకాల ద్వారా సూమారుగా రూ. 1500 కోట్లు రావచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై అఖిలపక్షంలో వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. పేదల గృహనిర్మాణంలో ఏళ్ల తరబడి జరుగుతున్న జాప్యం, భూగర్భ డ్రైనేజీ, సమగ్రకుటుంబసర్వే(ఎస్కేఎస్)లో న మోదుకాని ఇళ్లు, ఎస్‌కేఎస్‌తో అనుసంధానం కాకపోవడంతో నిలిచిపోయిన సామాజిక పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. -
ఆకాశవీధిలో...
ట్రాఫిక్కష్టాలకు చెక్ నగరంలో 4 ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు జిల్లా రహదారులతో అనుసంధానం సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల మెరుగుదలలో భాగంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలో ప్రవేశించే నాలుగు ప్రధాన రోడ్లను ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే మార్గాలను పీవీ ఎక్స్‌ప్రెస్ హై వే తరహాలో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నగరంలోని కీలకమైన ప్రధాన కూడ లికి చేరేవరకు ఆయా మార్గాలను ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే (వంతెన)లుగా అభివృద్ధి చేస్తే నగరంలోని ప్రధాన ప్రాంతాలకు త్వరితగతిన చేరుకోవడానికి సులభతరం అవుతుందని సీఎం భావిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాహానాలు ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్ల పైనుంచి ప్రయాణించడం వల్ల కింద ట్రాఫిక్ యథావిధిగానే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హై వేల నిర్మాణం వల్ల నగర శివార్లలో ట్రాఫిక్ ఇబ్బందులకు కూడా ఓ పరిష్కార మార్గంగా ఇవి దోహదపడతాయని సీఎం అం చనా వేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని రోడ్లు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లా కేంద్రాల నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు గంటన్నర వ్యవధిలోనే చేరుకున్నప్పటికీ అక్కడినుంచి నగరంలోకి ప్రవేశించడానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. దీనివల్ల జిలాల్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులే గాకుండా శివారు ప్రాంత ప్రజలు కూడా ట్రాఫిక్ సమస్యతో నానా ఇబ్బం దులు పడుతున్నారు. దీనికి పరిష్కార మార్గంగా జిల్లా కేం ద్రాల రహదారులకు అనుసంధానంగా నగరంలో నాలుగు ఎక్స్‌ప్రెస్ హై వేలను నిర్మిం చనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ఎక్స్‌ప్రెస్ హై వేల అభివృద్ధిని చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు బహుళ అంతస్థుల పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సీఎం భావిస్తున్నారు. ఎలివేటెడ్ మార్గాలివే. వరంగల్ నుంచి వచ్చే వారి కోసం: ఘట్కేసర్ వద్దనున్న ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్డు వరకు. కరీంనగర్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం: శామీర్‌పేట్ వద్ద ఓఆర్ఆర్ నుంచి జూబ్లీబస్ స్టేషన్ వరకు. బోధన్, మెదక్ నుంచి వచ్చే వారి కోసం: దుండిగల్ ఓఆర్ఆర్ నుంచి సికింద్రాబాద్ ప్యారడైజ్ వరకు. నల్గొండ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం: పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వరకు. -
ప్రమాదాల నివారణకు ఎక్స్ ప్రెస్ హైవేలు అవసరం: కేసీఆర్
హైదరాబాద్: జాతీయ రహదారులపై ప్రమాదాలను అరికట్టేందుకు ఎక్స్‌ప్రెస్ హైవేల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) దృష్టి సారించారు. తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖపై అధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి అన్నిజాతీయ, రాష్ట్ర హైవేలకు అనుసంధానం చేసే విధంగా ఎక్స్‌ప్రెస్ హైవేల అవసరం ఉందని అధికారులతో కేసీఆర్ అన్నట్టు సమాచారం. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఎంతో అవసరమని అధికారులకు కేసీఆర్ సూచించారు.