రహదారులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకే రోజు జరిగాయి. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమాలలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని గడ్కరీ ప్రకటించడమే కాదు దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మూంజూరు చేశామని వెల్లడించారు. ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని, గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా అడుగులు వేస్తున్న రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి వచ్చి బెంజి సర్కిల్ రెండో ఫై్లఓవర్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. తన గౌరవార్థం సీఎం ఇచ్చిన విందును స్వీకరించారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి విషయాల గురించి అక్కడ ఆయన రివ్యూ నిర్వహించారు. సీఎం జగన్ ప్రతిపాదనలన్నిటినీ ఆమోదిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో పోర్టులు, రోడ్లు, రైలు కనెక్టివిటీ అభివృద్ధి పరచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏకకాలంలో నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామన్నారు.
ఇందులో భాగంగా విద్యుత్, నీరు, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సూచనల మేరకు రూపొందించిన ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ పథకంతో దేశంలో రూ.1.10 లక్షల కోట్ల జీడీపీ పెరిగిందని చెప్పారు. దేశ అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన ఎంతటి కీలకమనడానికి ఈ పథకమే తార్కాణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోర్టుల ఆధారంగా ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని సూచించారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంపొందించడం ద్వారానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రం పట్లా వివక్ష లేదన్నారు. దేశం అంటే అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖకు ఏనాడూ నిధుల కొరత లేదన్నారు. గడ్కరీ ఇంకా ఏమన్నారంటే..
ఏపీకి ఆరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు
► దేశంలో నిర్మిస్తోన్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఆరు ఉన్నాయి. విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సరుకు రవాణాలో అత్యంత ముఖ్యమైనది. ఛత్తీస్‌గడ్, ఒడిశా, ఏపీలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 465 కి.మీ మేర రూ.16,102 కోట్లతో నిర్మిస్తున్నాం. 2024 చివరి నాటికి పూర్తి చేస్తాం.
► నాగ్‌పూర్ నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది. నా నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి మొదలవుతోంది కాబట్టి ఈ రహదారిపై నాకు ప్రత్యేక ఆసక్తి ఉంది. రూ.15 వేల కోట్లతో 405 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం.
► చిత్తూరు నుంచి తమిళనాడులోని తాచ్చూర్ వరకు 116 కి.మీ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టును 2024లో పూర్తి చేస్తాం.
► రూ.6 వేల కోట్లతో నిర్మిస్తున్న హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం.
► బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 262 కి.మీ మేర రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీ పరిధిలో రూ.5 వేల కోట్ల మేరకు రహదారి నిర్మిస్తాం. తద్వారా ఏపీకి తమిళనాడు, కర్ణాటకలతో మరింత మెరుగైన అనుసంధానం సాధ్యమవుతుంది.
► కర్నూలు–సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 318 కిలోమీటర్ల మేర రూ.420 కోట్లతో నిర్మిస్తాం. 2025 మార్చి నాటికి పూర్తి అవుతుంది.
సరుకు రవాణా వ్యయం తగ్గించాలి
► దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని బాగా తగ్గించాలి. వస్తువు ధరలో సరుకు రవాణా వ్యయం చైనాలో 8 శాతం నుంచి 10 శాతం, అమెరికా, యూరోపియన్ దేశాల్లో 12 శాతం ఉండగా, మన దేశంలో 16 శాతం నుంచి 18 శాతం వరకు ఉంది.
► దాంతో మన దేశంలో వస్తువుల ధరలు అధికంగా ఉంటుండటంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అందుకే దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని 8 శాతానికి తగ్గించాలని మా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఆరు శాతానికి కూడా తగ్గించేందుకు యత్నిస్తాం.
► దేశంలో యాక్సిస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ హైవేలతో ఇంధన వ్యయం తగ్గుతుంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం పూర్తి అయితే రహదారులపై వాహనాల వేగ పరిమితి పెంచుతాం.
బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి
► దేశంలో బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. డీజిల్ ట్రక్కుల స్థానంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు ప్రారంభించాలని నిర్ణయించాం. డీజిల్ స్థానంలో ఎల్‌ఎన్‌జీని ప్రోత్సహించాలి. డీజిల్ రూ.100 వ్యయం అయితే ఎల్‌ఎన్‌జీ రూ.40కు, సీఎన్‌జీ రూ.60కు వస్తోంది.
► గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై కసరత్తు చేస్తున్నాం. మురుగు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించాలి. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మురుగు నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి విక్రయం ద్వారా ఏటా రూ.325 కోట్లు ఆదాయం ఆర్జిస్తోంది.
► రూఫ్‌టాప్ సోలార్, విండ్ మిల్లులతో విద్యుత్ వ్యయం చాలా తగ్గుతుంది. ఎలక్ట్రోలైజర్లను గ్రీన్ హైడ్రోజన్‌గా పరిగణించవచ్చు. బియ్యం, చెరకు రసం, మోలాసిస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగాన్ని ఇంధన, విద్యుత్ రంగాల దిశగా మళ్లించాలి. పెట్రోల్, డీజిల్ రెండింటితోనూ పనిచేసే ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను ప్రోత్సహించాలి.
గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా ఏపీ
► దేశానికి ఉపయోగపడేలా తక్కువ వ్యయం, కాలుష్య రహిత దేశీయ ఇంధనంగా ఇథనాల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. మిగులు బియ్యం నిల్వలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అందుకు గ్రోత్ సెంటర్‌గా మారాలి. బయో ఇంధనం, గ్రీన్ ఇంధనం దేశానికి తక్షణ అవసరం.
► ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. రోప్‌వే, కేబుల్ వే వంటివి హిమాచల్‌ప్రదేశ్‌లో 16 ప్రాజెక్టులు, ఉత్తరాఖండ్‌లో 15 ప్రాజెక్టులు ఇచ్చాం. ఆంధ్ర ప్రదేశ్‌లో ఏమైనా ఈ తరహా ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే ఆమోదిస్తాం.
బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్–2 ప్రారంభం
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి గురువారం జాతికి అంకితం చేశారు. సాయంత్రం 3.40 గంటలకు వారు బెంజ్‌సర్కిల్ రెండో ఫ్లైఓవర్ వద్దకు వచ్చారు. ఈ ఫ్లైఓవర్‌పై శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. కాగా, బెంజ్ సర్కిల్‌కు తూర్పు వైపున ఇదివరకే మొదటి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇప్పుడు పడమర వైపున రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఈ వంతెనను జ్యోతిమహల్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2.47 కిలోమీటర్ల మేర మూడు వరసల్లో ఏడాదిలోనే (గడువుకు ఆరు నెలల ముందే) నిర్మించారు. ఇందుకోసం రూ.96 కోట్లు వెచ్చించారు. గడువుకు ముందే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, నిర్మాణ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ అభినందించారు.
దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శంకరనారాయణలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు మహా గణపతి ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామని చెప్పారు. కొన్ని పనులకు ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని, ఆయా పనులకు అంచనాలు తయారు చేస్తున్నారన్నారు. మరికొన్ని పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో ఎయిర్‌పోర్ట్‌లన్నింటికీ రోడ్లను అనుసంధానం చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. విశాఖపట్నంకు కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. ముంబైలో నిర్మిస్తున్న కోస్టల్ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాక, వైజాగ్ కారిడార్‌కు ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. అంతకు ముందు వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కేశినేని నాని, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో దుర్గగుడి ఘాట్‌రోడ్డు పై నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రులు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దేశ వ్యాప్తంగా కేంద్రం చేపడుతున్న పలు అభివృద్ధి అంశాలను పార్టీ శ్రేణులకు వివరించారు. పలువురు పార్టీ కార్యకర్తలు గడ్కరీకి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment