భేటీ ఢీ | For the first time, an all-party meeting | Sakshi
Sakshi News home page

భేటీ ఢీ

Published Mon, Dec 8 2014 11:56 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

భేటీ ఢీ - Sakshi

భేటీ ఢీ

స్లమ్‌ఫ్రీ సిటీ.. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు.. సాగర్  ప్రక్షాళన.. ఎక్స్‌ప్రెస్ హైవేలు.. కలల మెట్రో రైలు పరుగులు.. వేలకోట్లతో నాలాల అభివృద్ధి.. వినోదాల వినాయక్ సాగర్ నిర్మాణం... విశ్వనగరంగా హైదరాబాద్.. ఇలా ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తోంది.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ప్రకటనలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధికి సంబంధించి  మంగళవారం సీఎం సమక్షంలో తొలిసారిగా అఖిల పక్షం భేటీ  కాబోతోంది. ఢీ అంటే ఢీ అనేందుకు ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. అభివృద్ధికి అవసరమైన వేలకోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నలను సంధించనున్నాయి.
 
సిటీబ్యూరో: నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు  నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంపై నగరం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, శాసనసభా పక్ష నేతలు పాల్గొననున్న ఈ సమావేశంలో  మెట్రోరైలు అలైన్‌మెంట్‌లో మార్పులు,  పేదలకు భూముల క్రమబద్ధీకరణ, ఇందిరాపార్కులో ‘వినాయకసాగర్’ ఏర్పాటు  అంశాలపై ప్రధానంగా  చర్చ జరుగనున్నప్పటికీ, పేదల ఆహార భద్రత కార్డులు, సమగ్ర కుటుంబ సర్వే, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభవన్ ఏర్పాటు, స్లమ్‌ఫ్రీ సిటీ, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రక్రియ, సాగర్  చుట్టూ ఆకాశహార్మయాలు  తదితర  అంశాలు సైతం చర్చకు వచ్చే వీలుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రకటిస్తుండడం తెలిసిందే.  అందుకుగాను వెచ్చించనున్న నిధులు, స్మార్ట్‌సిటీ కోసం చేపట్టనున్న పథకాలు, నగరంలో చెరువుల సంరక్షణ  తదితర అంశాలు కూడా ప్రస్తావనకొచ్చే వీలుంది.  ఆయా అంశాలపై అఖిలపక్షంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో తొలి సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
మెట్రో ఆలైన్‌మెంట్‌పై స్పష్టత..


నగరంలో మూడు చోట్ల మెట్రో అలైన్‌మెంట్ మార్పులపై అఖిలపక్ష భేటీతో స్పష్టత రానుంది. సుల్తాన్‌బజార్,అసెంబ్లీ,పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే తాజా అలైన్‌మెంట్ ఖరారు చేస్తామని సీఎం శాసనసభలో ప్రకటించిన విషయం విదితమే. అలైన్‌మెంట్ మార్పు కారణంగా సుల్తాన్‌బజార్,అసెంబ్లీ ప్రాంతాల్లో దూరం స్వల్పంగా పెరగనుంది. పాతనగరంలో మాత్రం 3.2 కి.మీ మేర మెట్రో మార్గం పెరగనుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సైతం నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి చెల్లిస్తామని సీఎం గతంలో హామీఇచ్చిన విషయం విధితమే. కాగా ప్రధాన రహదారులపై మెట్రో పనులు జరిగేందుకు వీలుగా క్లిష్టంగా మారిన 283 ఆస్తుల సేకరణ ప్రక్రియను డిసెంబరు నెలాఖరులోగా పూర్తిచేయాలని గతంలో నిర్ణయించారు.  ఈ అంశాన్ని కూడా సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జూన్ నాటికి మూడు కారిడార్లలో 75 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలని సర్కార్ కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో తొలి అఖిల పక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
వినాయకసాగర్ .. సాగర్ ప్రక్షాళనపై నివేదిక

హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టడంతోపాటు ఇకపై సాగర్‌లో నిమజ్జనాలు చేయకుండా ఉండేందుకుగాను ఇందిరాపార్కులో ‘వినాయకసాగర్’ను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. ఇందిరాపార్కులో ఏర్పాటు చేసే చెరువుకు సంబంధించి, నిమజ్జనాల సందర్భంగా ఆయా ఏర్పాట్లు చేసేందుకు ఉన్న అవకాశాల గురించి అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు అందజేస్తారు. దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టనున్నారు. ఏడాదిలో ఒక నెల మాత్రమే నిమజ్జనం కార్యక్రమాలుంటాయి కనుక మిగతా 11 నెలలపాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు వాటర్‌స్పోర్ట్స్‌కు అవకాశాలపై చర్చిస్తారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేయాల్సిన రహదారులు, తదితరమైనవాటిపై చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఎంత పరిమాణం విస్తీర్ణంలో దేవుళ్ల విగ్రహాలను వదులుతున్నారు. విగ్రహాలను నీటిలో వేసేందుకు రోడ్డుపై ఎంత దూరాన్ని వినియోగిస్తున్నారు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిమజ్జనాలకు సంబంధించిన  చెరువు ఏర్పాటుకు  దాదాపు 10- 12 ఎకరాల స్థలం సరిపోతుందని ప్రాథమికంగా అంచనా.
 
భూముల క్రమబ ద్ధీకరణ ..

హైదరాబాద్‌లో  పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం  పరిధిలో  1074 ప్రాంతాలలో ( పార్శళ్లు)114.22 ఎకరాలు యూఎల్‌సీ భూములు తమ అధీనంలో ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ తాజాగా వెల్లడించింది. అదే విధంగా 30 ఏళ్ల కిందనే కబ్జాకు గురైన 1400 ఎకరాలలో 33,127 ఇళ్లు, భవనాలు, 200 ఎకరాల్లో 1927 వాణిజ్య సంస్థలు, 727 ఎకరాల్లో 1827 ప్రభుత్వ భవనాలు, రోడ్లు ఉన్నట్లు సర్కారుకు సమర్పించిన నివేదికలో అధికారులు పేర్కొన్నట్లు  తెలిసింది. వీటితో పాటు హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లోని మురికి వాడల్లో ఉన్న 3 లక్షల  ఇళ్లు, భవనాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో ఉన్నా 2 లక్షల ఇళ్లను క్రమబద్ధీకరించటం  ద్వారా రూ 6 వేల  నుంచి రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని  సమకూర్చుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎలాంటి వివాదం లేని ప్రభుత్వభూమి 20.56 ఎకరాలు ఉన్నట్లుగా  గుర్తించారు. వీటి అమ్మకాల ద్వారా సూమారుగా రూ. 1500 కోట్లు రావచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై అఖిలపక్షంలో వాడివేడి చర్చ జరిగే అవకాశముంది.

పేదల గృహనిర్మాణంలో ఏళ్ల తరబడి జరుగుతున్న జాప్యం, భూగర్భ డ్రైనేజీ, సమగ్రకుటుంబసర్వే(ఎస్‌కేఎస్)లో న మోదుకాని ఇళ్లు,  ఎస్‌కేఎస్‌తో అనుసంధానం కాకపోవడంతో నిలిచిపోయిన సామాజిక పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement