ఏపీ రాష్ట్రం గుండా 6 నూతన ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణం  | Construction Of 6 New Express Highways Through AP State | Sakshi
Sakshi News home page

ఏపీ రాష్ట్రం గుండా 6 నూతన ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణం 

Published Fri, Jan 7 2022 11:12 AM | Last Updated on Fri, Jan 7 2022 8:42 PM

Construction Of 6 New Express Highways Through AP State - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణంలో ఏపీ రాష్ట్రానికి కేంద్రం పెద్దపీట వేసింది. రాష్ట్రానికి నూతన ఎక్స్‌ప్రెస్‌ హైవేలను కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రం గుండా మరో 6 నూతన ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ప్రధానంగా పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు ఉన్న మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తూ ఎక్ర్‌ప్రెస్‌ హైవేలు నిర్మించనున్నారు. 

రాష్ట్రంలో 378 కిలోమీటర్లు 
పారిశ్రామిక ప్రోత్సాహం, సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దేశంలో  22 గ్రీన్‌ ఫీల్డ్‌/ఎక్ర్‌ప్రెస్‌ హైవేలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఆరు రాష్ట్రం గుండా వెళ్తాయి. దేశం మొత్తం మీద 2,157 కి.మీ. మేర కేంద్ర ప్రభుత్వం ఎక్ర్‌ప్రెస్‌ హైవేలు నిర్మించనుంది. వాటిలో రాష్ట్ర పరిధిలో 378 కి.మీ.నిర్మిస్తారు. ఈ రహదారులకు రూ.15,876 కోట్లతో ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది.

ఆరు ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ఇవీ.. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేను 272 కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో 92 కి.మీ. రాష్ట్రంలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల గుండా వెళ్తుంది. రూ.3,864 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. 

చిత్తూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేను 125 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇది రాష్ట్రంలో 75 కి.మీ. నిడివి ఉంటుంది. రూ.3,150 కోట్లతో నిర్మించే ఈ హైవేను 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు.  

రాయ్‌పూర్‌ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ హైవే 464 కి.మీ. ఉంటుంది. రెండు పోర్టులు, రెండు స్టీల్‌ ప్లాంట్లు, నాల్కో వంటి ప్రముఖ భారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ఈ హైవే దేశంలోనే లాజిస్టిక్స్‌ రంగంలో కీలకం కానుంది. రాష్ట్రంలో 100 కి.మీ.మేర దీనిని నిర్మిస్తారు. మొత్తం రూ.4,200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు. 

విజయవాడ –నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను 457 కి.మీ.మేర నిర్మిస్తారు. రాష్ట్రంలో 29 కి.మీ. మేర దీని నిడివి ఉంటుంది. రూ.1,218 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు.

కర్నూలు – షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను 318 కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో రాష్ట్రం గుండా 10 కి.మీ. ఉంటుంది. రూ.420 కోట్ల ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు.  

హైదరాబాద్‌ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ హైవేను 521 కి.మీ. మేర నిర్మిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల గుండా సాగే ఈ రోడ్డు రాష్ట్రంలో 72 కి.మీ. ఉంటుంది. రూ.3,024 కోట్లతో  చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement