రూ.14వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు శ్రీకారం
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 35 జాతీయ రహదారులు సైతం ప్రారంభం
దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు కూడా..
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఏపీ ప్రభుత్వం అద్భుతమైన సహకారం అందిస్తోందని కితాబు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రూ.14వేల కోట్లతో చేపట్టే బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా రూ.లక్ష కోట్లతో నిర్మించే 112 జాతీయ రహదారులకు కూడా ప్రధాని ఈ సందర్భంగా హర్యానాలోని గురుగామ్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 35 జాతీయ రహదారులను కూడా ఆయన ప్రారంభించారు. మొత్తం రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ.మేర ఈ జాతీయ రహదారులను రాష్ట్రంలో నిర్మించారు. ఇక బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనులను 14 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయతో పాటు, ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఇవి దోహదం చేయనున్నాయి.
యూపీ తర్వాత ఏపీకే ఎక్కువ ప్రాజెక్టులు : మోదీ
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అద్భుతమైన సహకారం అందిస్తోందని ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే దేశంలో ఉత్తరప్రదేశ్ తరువాత ఏపీలోనే అత్యధికంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. విజయవాడ–బెంగళూరు ఎకనామిక్ కారిడార్‌తోపాటు అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పారిశ్రామికాభివృద్ధి కూడా సాధ్యపడుతుందన్నారు.
విజయవాడ ఈస్ట్ బైపాస్, భోగాపురం ప్రాజెక్టులను త్వరగా చేపట్టండి..
రాష్ట్రాభివృద్ధికి కీలకమైన విజయవాడ ఈస్ట్ బైపాస్, విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రహదారుల నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని కోరింది. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment