సాక్షి, హైదరాబాద్: వాతావరణ సమతౌల్యం, భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటే అడవుల పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇకపై అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా చూడాలని, దీనికోసం అవసరమైతే సభా సంఘాన్ని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని పూడ్చాలంటే అడవుల పునరుజ్జీవం జరగాలని, ఇందుకు సమాజంలోని అన్ని పక్షాలు కలసి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. సోమవారం హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల సందేహాలు, విమర్శలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ‘‘ఇప్పటివరకు అటవీ భూములను గిరిజనులు, గొత్తికోయలు, మరొకరు ఆక్రమించారు. కానీ ఇకముందు అలా జరగకుండా చూడాలి. ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఆక్రమణకు గురైంది పోనిద్దాం. ఇకపై మాత్రం గజం భూమి కూడా ఆక్రమణ కావద్దు. దీనిపై అవసరమైతే సభా సంఘం వేయండి. ప్రతి నెలా సమీక్షించండి. అందరినీ కలుపుకొని అటవీ భూముల పరిరక్షణ చేపడదాం. దీనికి సభ మద్దతు తెలపాలని కోరుతున్నా..’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
విధ్వంస చరిత్ర విపక్షాలదే..
చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ విపక్షాలను టార్గెట్ చేశారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయలు అటవీ భూముల్లో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో విపక్షాలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ‘‘అటవీ చట్టాల మేరకు అటవీ భూమి ఎవరికీ దాఖలు కాదు. కేవలం ఆ భూముల్లో పండ్ల తోటలు పెంచి, వాటిపై వచ్చే ఫలసాయాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. భూపాలపల్లిలో గొత్తికోయలకు అన్యాయం జరిగిందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. నిజానికి వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా వచ్చినవాళ్లు. వారు రావడం, అడవిని నరకడం అలవాటుగా మారింది. విచక్షణా రహితంగా చెట్లు నరుకుతుంటే చూస్తూ కూర్చోలేం. ఇదేదో మహోద్యమం అన్నట్లు కమ్యూనిస్టులు జెండాలు పట్టి ఆందోళనలకు దిగారు. అడవులు దెబ్బతింటుంటే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సబబేనా..?’’అని ప్రశ్నించారు. గతంలో నర్సాపూర్ అడవుల్లో సినిమా షూటింగులు జరిగేవని, ఆ అడవులను చూస్తేనే భయం వేసేదని చెప్పారు. ఇప్పుడా అటవీ సంపద ఏదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాయం చేసిందా? అని ప్రశ్నించారు. 24 శాతం అటవీ భూమి అనేది కేవలం కాగితాలపైనే తప్ప వాస్తవంలో లేదని స్పష్టం చేశారు.
ప్రతి మొక్కకు.. ప్రతి ఖర్చుకు లెక్క
అటవీ భూముల బదలాయింపునకు సంబంధించి కేంద్రం వద్ద రూ.40 వేల కోట్ల నిధులు మురిగిపోతున్నాయని, అందులో రాష్ట్రానికి సంబంధించి రూ.1,500 కోట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో ‘కంపా’నిధులు విడుదల చేయాలని రెండు డజన్లసార్లు కేంద్రానికి లేఖ రాస్తే తనను పిచ్చోడిలా చూశారని.. చివరికి రూ.304 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 1980 నుంచి 2014 వరకు 34 ఏళ్లలో తెలంగాణలో కేవలం 3.17 కోట్ల చెట్లు మాత్రమే నాటారని.. 2004 నుంచి 2014 వరకు కేవలం రూ.130 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కేసీఆర్ తెలిపారు. అదే తాము గత మూడున్నరేళ్లలోనే రూ.2,008 కోట్లు ఖర్చు చేశామని.. 230 కోట్ల మొక్కలు నాటేందుకు సంకల్పించామని చెప్పారు. ఈ ఖర్చుపై నయాపైసా సహా లెక్కలను వారం రోజుల్లో సభ ముందు పెడతామని.. థర్డ్ పార్టీ నివేదిక, నరేగా, కంపా, రాష్ట్ర బడ్జెట్ నిధులన్నింటిపై వివరణ ఇస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటికే 4.29 కోట్ల మొక్కలు నాటామని, ఆ లెక్కలు సభ్యులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇక ఎంత ధనం సంపాదించినా బతికి ఉండగలిగే పరిస్థితులు ఉండాలని.. మొక్కలు నాటకపోతే ఎనిమిదేళ్లలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటడం ఖాయమని, మనుషులు పిట్టల్లా రాలుతారని వ్యాఖ్యానించారు. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే హరిత పందిరి వేయాల్సిందేనని.. హైదరాబాద్ చుట్టూ రాగి, వేప మొక్కలు నాటి హరిత వలయం ఏర్పాటు చేయాలని, జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసేలా మున్సిపల్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టేలా నిబంధనలు
హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇంటికి ఆరు మొక్కలు నాటేలా చూడాలని కోరుతున్నా.. పంచాయతీలు ఆ బాధ్యతను మోయడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామంలో, పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటడాన్ని సర్పంచులు, వీఆర్‌ఏలు, ఇతర అధికారులు సామాజిక బాధ్యతగా గుర్తించడం లేదన్నారు. స్థానిక సంస్థలు పనిచేయకుండా ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా ఫలితముండదని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు. ఈ దృష్ట్యా కొత్తగా కోయ, గూడెం, గోండు పల్లెలు సహా పలు శివారు గ్రామాలకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా పంచాయతీల పరిధిలో గ్రామానికో సొంత నర్సరీ పెట్టేలా, దాన్ని వారే నిర్వహించేలా ‘ఫర్మార్మ్ ఆర్ ఫెరిష్’చట్టాలను తెస్తామని తెలిపారు.
పొలాలకొస్తయ్.. వంటింట్లకొస్తాయ్..
చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కోతులు, అడవి పందుల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘గతంలో వన్యప్రాణులకు అవసరమైన మొర్రి, తొంకి, జీడి, ఈత పండ్లు అడవుల్లోనే దొరికేవి. కానీ వాటి ‘కిచెన్’ను ధ్వంసం చేసినం. ఇప్పుడవి వెనుకకు ఎట్ల పోతాయి. మన కిచెన్లకు వస్తయ్.. మన పొలాల్లోకి వస్తయ్. అడవుల్లో నీళ్లు లేక ఊళ్లోకొచ్చిన ఒక కోతి నల్లా తిప్పి నీళ్లు తాగుతుంటే.. మరో మంచి కోతి రేపటి నుంచి నీళ్లు దొరవేమోనని మూత బంజేస్తుంది. ఇలాంటివి ఫేస్‌బుక్కుల్లో జోకులు బాగా వస్తున్నాయ్..’’అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. కోతులు తిరిగి వెళ్లిపోవాలంటే అడవులు బాగా పెంచాల్సిన ఆవశ్యకత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు కూడా కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపుతామని మేనిఫెస్టోల్లో ప్రకటించాయని గుర్తుచేశారు.
అరుణమ్మా.. ఆ జోకులు మీ చరిత్రపైనే..!
హరితహారం అంశంపై తొలుత సభలో కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘డీకే అరుణ తమాషాగా మాట్లాడారు. ఉదయం మంత్రి పోయి మొక్క పెడతాడు. సాయంత్రం దాన్ని మేక తింటది. రాత్రికి మేకను మంత్రి తింటుండంటూ సోషల్ మీడియాలో జోకులొస్తున్నాయన్నారు. ఆ జోకులు వేస్తోంది మాపైన కాదు. మీ (కాంగ్రెస్) చరిత్ర పైన. మీ హయాంలో జరిగిన విధ్వంసంపైన..’’అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమని 14 రాష్ట్రాల్లో తిరిగిన కేంద్ర మాజీ పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీర్తించారని గుర్తు చేశారు. మరో మంత్రి హర్షవర్ధన్ సైతం దేశవ్యాప్తంగా నాటిన మొక్కల్లో 20 శాతం ఒక్క తెలంగాణలో నాటినట్లుగా పార్లమెంటులో చెప్పారని పేర్కొన్నారు.
నవ్వులే.. నవ్వులు..
హరితహారంపై మాట్లాడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో సభలో పలుమార్లు నవ్వులు విరిశాయి. అటవీ శాఖలో ఖాళీల భర్తీపై మాట్లాడుతూ ‘‘దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు రిక్రూట్ చేయని కారణంగా ఖాళీలున్నాయి’అని కేసీఆర్ పేర్కొనగా... వెంటనే జానారెడ్డి స్పందిస్తూ ‘మన ప్రభుత్వాలు చేయని కారణంగా..’అన్నారు. దీంతో సీఎం సహా సభ్యులంతా గొల్లుమన్నారు. దీనిపై కేసీఆర్ సెటైర్ వేస్తూ.. ‘‘అవును.. మన ప్రభుత్వాలే. జానా గారూ అప్పుడు టీడీపీలో ఉన్నారు. నేనూ ఉన్నాను. జీవన్‌రెడ్డి అంతే. 1983లో నేను ఓడిపోయా.. కానీ జీవన్‌రెడ్డి గెలిచి మంత్రి అయ్యారు..’’అని వ్యాఖ్యానించారు. ఇక అధికారపక్ష ప్రతి విమర్శలపై జానా స్పందిస్తూ.. ‘నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన చట్టం) కార్యక్రమాన్ని కాంగ్రెస్ తెచ్చింది. చరిత్ర మరిచిపోవద్దు.’అని సూచించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘నరేగా తెచ్చింది కాంగ్రెస్సే.. అదో చరిత్ర. 1945 నుంచి అడవుల విధ్వంసం జరిగింది.. ఇదీ చరిత్రే..’’అని చురకలు వేయడంతో మళ్లీ నవ్వులు విరిశాయి. ఇక సీఎం సుదీర్ఘంగా మాట్లాడుతుండటంతో సమయం మూడు గంటలు దాటింది. ఆ సమయంలో జానారెడ్డి, అక్బరుద్దీన్‌తో మాట్లాడుతున్నారు. దీన్ని చూసిన సీఎం కేసీఆర్.. ‘భోజన సమయం అయిందని జానా చెబుతున్నట్లున్నారు. నేనూ కూడా ఉదయం మూడే ఇడ్లీలు తిన్నా..’’అనడంతో సభ్యులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment