గత ఏడాది చార్జీలు కొత్తవాటితో కలిపి వసూలు
ఏపీఈఆర్‌సీ రెగ్యులేషన్‌లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ఇక నుంచి ‘డబుల్ షాక్’ తగలనుంది. పాత ఏడాదిలో వసూలు చేయాల్సిన మొత్తం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయాల్సిన మొత్తం చార్జీలను కలిపి ఒకేసారి వినియోగదారుడు నుంచి రాబట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) రెగ్యులేషన్-2005లో మార్పులు చేయనున్నారు. ఈ మార్పులపై అభిప్రాయాలను 15వ తేదీలోగా సమర్పించాలని ఈఆర్‌సీ కోరింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ప్రతి ఏటా నవంబర్ ఆఖరున ఈఆర్‌సీకి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పిస్తాయి. అయితే, ఇవి ముందస్తుగా వేసిన అంచనాలు కావడంతో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. అంటే గ్యాసు, బొగ్గు ధరలు పెరగడం, కొత్త పన్నులు పడటం మొదలైన కారణాల వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.
ఈ తేడా మొత్తాన్ని గతంలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేవారు. అయితే, సర్దుబాటు చార్జీలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీనిని ఈఆర్‌సీ రద్దుచేసింది. అయితే, ఈ తేడా మొత్తాన్ని తాజా విధానంలో గతేడాది చార్జీలను మరుసటి ఏడాదిలోనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఇదే విధానంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 2 వేల కోట్ల మేరకు సర్దుబాటు చార్జీలను 2014-15 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు డిస్కంలు ఇప్పటికే సిద్ధపడ్డాయి. ఇందుకు అనుగుణంగా ఈఆర్‌సీ రెగ్యులేషన్‌లో కూడా మార్పులు రానుండటంతో డిస్కంలకు పంట పండనుంది. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీలను వసూలు చేయమన్న ప్రభుత్వ విధానానికి ఇది విరుద్ధంగా ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో రూపంలో మూడు నెలలకు ఒకసారి వసూలు చేయాల్సిన సర్దుబాటు చార్జీలను ఒకేసారి ఏడాదికి ఒకసారి వసూలు చేయడమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
వినియోగదారులకు ‘డబుల్ షాక్’!
Published Wed, Dec 25 2013 12:30 AM | Last Updated on Sat, Jun 2 2018 5:07 PM
Advertisement
Advertisement