ఇతర నియంత్రణ సడలింపుల డిమాండ్
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs) కీలకమైన నియంత్రణ మార్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని సంప్రదించాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రుణ పరిమితిని రెట్టింపు చేయాలని, సహ-రుణాలలో (co-lending బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి వచ్చే రుణాలు) పాల్గొనడానికి అనుమతించాలని, పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో సడలింపులు కల్పించాలని కోరుతున్నాయి.
ప్రస్తుతం వినియోగదారులకు గరిష్టంగా ఇచ్చే రుణ పరిమితిని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు రెట్టింపు చేయాలని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆర్‌బీఐని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ పరిమితిని 2014లో నిర్ణయించారు. ఇది రెట్టింపు అయితే చిన్న వ్యాపారాలకు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు పెద్ద మొత్తంలో రుణాలు అందించేందుకు వీలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వ్యాపార పరిధిని పెంచుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
సెప్టెంబర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఇటీవల ఆర్‌బీఐని సంప్రదించాయి. ఈ సమావేశంలో వారి వ్యాపార వృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు ఎస్‌ఎఫ్‌బీలు తమ రుణ పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో మార్పులు కోరుతూ నిబంధనలను సులభతరం చేయాలని ఆర్‌బీఐని అభ్యర్థించాయి.
ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి సహ-రుణాలలో (co-lending) పాల్గొనడానికి ఎస్‌ఎఫ్‌బీలను అనుమతించాలని కోరుతున్నాయి. సహ-రుణాల ద్వారా విస్తృత స్థాయి కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇది వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ అభ్యర్థనలు బ్యాంకుల వృద్ధికి, ప్రస్తుత వ్యాపార నమూనా సామర్థ్యాన్ని పెంచడానికి, చిన్న తరహా వ్యాపారాలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి దోహదపడతాయని నమ్ముతున్నారు.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు


