Regulatory
-
అతిజాగ్రత్తతో వృద్ధికి ఆటంకం
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్‌హెచ్‌సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ: భారీ జరిమానా
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు , మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలు రుజువు కావడంతో ద్రవ్య పెనాల్టీ విధించబడుతుందని నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంటూ నాలుగు సహకార బ్యాంకులపై ద్రవ్య పెనాల్టీలను విధించింది. వీటిలో మూడు బ్యాంకులు గుజరాత్‌కు చెందినవి కాగా, మరొకటి మహారాష్ట్రకు చెందింది. గుజరాత్‌కు చెందిన లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై అత్యధికంగా రూ.5 లక్షల జరిమానా విధించింది. ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గుర్తించి గుజరాత్, వడోదరలోని లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అలాగే పలు రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్ల రీపేమెంట్‌పై కస్టమర్లకు వడ్డీ సైతం చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే గుజరాత్, మెహసానలోని ద కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ మెహసాన లిమిటెడ్ పై రూ. 3.50 లక్షల పెనాట్లీ వేసింది ఆర్బీఐ. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు ఇచ్చే లోన్లపై ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ను ఈ బ్యాంక్ అతిక్రమించినట్లు గుర్తించింది. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం అతిక్రమించినట్లు తెలిపింది. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) దీంతోపాటు గుజరాత్ ద హర్జి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 3 లక్షల మానిటరీ పెనాల్టీ విధించింది. ఆర్బీఐ సమాచారం ప్రకారం CRR నిర్వహణ, ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ విషయంలో నిబంధనలను పాటించలేదు. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం ఉల్లంఘించింది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) డిపాజిట్ అకౌంట్ల నిర్వహణలో లోపాలు, నిలిచిపోయిన ఖాతాల వార్షిక సమీక్ష వైఫల్యం లాంటి కారణాలతో మహారాష్ట్ర, ముంబైకి చెందిన ద నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై రూ. 1 లక్ష మానిటరీ పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్. డి విఫలమవడం వంటి కారణాలతో ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
సెబీ మాదిరిగా..ఈ - కామర్స్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి..సీఏఐటీ డిమాండ్
న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెబీ, ఆర్బీఐ మాదిరిగా ఈ–కామర్స్ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్ పాలసీ–2018 ప్రెస్ నోట్–2 స్థానంలో కొత్త ప్రెస్ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది. -
ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. టెల్కోల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ సేవలు అందిస్తున్నందున అవి నేరుగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. టెలికం బిల్లు ముసాయిదాలో ఓటీటీ కమ్యూనికేషన్స్ సేవలకు సంబంధించిన నిర్వచనం విషయంలో తాము ఈ మేరకు సిఫార్సులు చేసినట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. టెల్కోలకు ఓటీటీ సంస్థలు పరిహారం చెల్లించే అంశానికి సంబంధించి.. ఆదాయంలో వాటాల విధానాన్ని పరిశీలించవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఇతర ఓటీటీలకు (అన్ని కేటగిరీలు) కూడా డేటా వినియోగం ఆధారిత ఆదాయ పంపకం సూత్రాన్ని వర్తింప చేయవచ్చని కొచర్ చెప్పారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో అమెజాన్ ఇండియాతో పోటీ పడుతూ ఆహార సంబంధిత వ్యాపార ప్రణాళికలకు ఫ్లిప్‌కార్ట్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించాలన్న ఫ్లిప్‌కార్ట్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదిత ప్రణాళిక నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నియంత్రణ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) తెలిపింది. మరోవైపు ఈ పరిణామంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఆధారంగా నడిచే మార్కెట్ దేశ రైతులు భారీ ప్రయోజనాన్ని సమకూరుస్తుందన్నారు.సప్లయ్ చెయిన్ సామర్థ్యం పెంపు, పారదర్శకతతో దేశ రైతులకు,ఆహార ప్రాసెసింగ్ రంగానికి గణనీయమైన విలువను చేకూరుస్తుందని నమ్ముతున్నామన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు, వ్యవసాయంలో కీలక మార్పులకు దోహపడుతుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెజాన్ 2017లో భారతదేశంలో ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారం కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. కాగా దేశం పెరుగుతున్న ఆహార రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికను గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించిన, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఈ కొత్త వెంచర్లో 258 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో కిరాణా విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది. కఠిన ఆంక్షలతో ఇంటికే పరిమితమైన చాలామంది వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. దీంతో గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ అమెజాన్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. రాబోయే నెలల్లో కూడా ఇది కొనసాగుతుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆహార రిటైల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండటం గమనార్హం. చదవండి : అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్: కొత్త పథకాలు షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే -
క్రమబద్ధీకరణపై తర్జనభర్జన
గురువారంతో ముగిసిన గడువు కొనసాగింపుపై ప్రభుత్వానికి లేఖ రాసిన రెవెన్యూ అధికారులు హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగింపుపై రెవెన్యూ యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి గురువారంతో గడువు ముగియడమే ఈ ఆందోళనకు కారణం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆశిం చిన మేరకు క్రమబద్ధీకరణ జరగకపోవడం, అభ్యంతరకరమైన భూముల విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి కూడా పాలుపోకవడం.. తదితర అంశాలపై ‘ఆశలన్నీ భూమి పాలు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో రెవెన్యూ ఉన్నతాధికారులు మేల్కొన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం గడువు ముగిసినందున ఈ ప్రక్రియను ఇకపైనా కొనసాగించడమా లేదా నిలిపివేయడమా.. అన్న సందిగ్ధత నెలకొందని, దీనిపై తగిన విధంగా స్పష్టతనిస్తూ తదుపరి ఆదేశాలివ్వాల్సిందిగా భూపరిపాలన విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హా శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే.. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ప్రస్తుతం సెలవులో ఉన్నందున ప్రిన్సిపల్ కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్య కార్యదర్శి సెలవు నుంచి వచ్చిన తర్వాత (సోమవారం) క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. 10 నుంచే గ్రేటర్లో పట్టాల పంపిణీ! త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మే 10 నుంచి ప్రారంభించాలని, మిగిలిన జిల్లాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2)న పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెవెన్యూ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలందినట్లు సమాచారం. శుక్రవారం అ న్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్ఏ ప్రిన్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా సూచనలు చేయడం దీనికి బలాన్ని చేకూరు స్తోంది.