విద్యుత్ కొనుగోలుకు అనుమతివ్వండి
ఈఆర్‌సీని కోరిన తెలంగాణ డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రానున్న 25 ఏళ్ల పాటు ఏటా వెయ్యి మెగావాట్‌ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ని తెలంగాణ డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఈఆర్‌సీకి తెలంగాణ డిస్కంలు శనివారం దరఖాస్తు చేసుకున్నాయి. దీర్ఘకాలానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్‌ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటుచేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అయితే, విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ ద్వారా చేయాలా? లేక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ద్వారానా అన్నది నిర్ణయించాల్సి ఉంది. ఎంఓయూ ద్వారా కొనుగోలుకు అనుమతించాల్సిందిగా ఈఆర్‌సీని ప్రభుత్వం అభ్యర్థించే అవకాశముంది. కానీ, బిడ్డింగ్ ద్వారానే కొనుగోలు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేస్తోంది.
ఆగస్టు 30 నాటికి కృష్ణపట్నం రెడీ: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 800 మెగావాట్‌ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ తొలి యూనిట్ ఆగస్టు 30 నాటికి సిద్ధం కానుంది. దాంతో ఆగస్టు 30 నుంచి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని శనివారం జరిగిన ఏపీసీపీడీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 200 మెగావాట్‌ల రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 30 నాటికి గ్రిడ్‌కు అనుసంధానించాలని తీర్మానించారు. అయితే, కృష్ణపట్నం ప్లాంట్ ఒప్పందం మేరకు తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో తెలంగాణ డిస్కంల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు.
మీ ఆదేశాలు పాటించడం లేదు: సీలేరు ప్లాంట్ నుంచి విద్యుత్‌ను తెలంగాణకే ఇవ్వాలని గోదావరి జల నియంత్రణ బోర్డు చైర్మన్ మహేంద్రన్ రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాలు జారీ అయి 48 గంటలు దాటినప్పటికీ తమకు విద్యుత్ ఇవ్వడం లేదని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర శనివారం గోదావరి జల నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.