పీపీఏలలో అసలు దోషి ఈఆర్‌సీయేనా?
అనుమతి కోసం 2009 లోనే దరఖాస్తు
ఇప్పటివరకు స్పందించని ఈఆర్‌సీ
హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు అంశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అసలు దోషా? పీపీఏల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఈఆర్‌సీ మిన్నకుండిపోవడమే ఇప్పుడీ రాద్ధాంతానికి కారణమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీజెన్‌కోకు చెందిన 6,551 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వివిధ విద్యుత్‌ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 22 డిసెంబర్ 2009లో కొత్తగా పీపీఏలు కుదుర్చుకున్నాయి. ఈ ప్లాంట్లతో గతంలో కుదుర్చుకున్న పీపీఏలు 2002లో రద్దు అయ్యాయి. అనంతరం ఏడేళ్లపాటు వేచిచూసి చివరకు 2009లో పీపీఏలు కుదుర్చుకున్నాయి. ఈ పీపీఏల అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి వెంటనే సమర్పించాయి. అయితే, ఇప్పటివరకు ఈఆర్‌సీ అనుమతి ఇవ్వలేదు. వీటితో పాటు ప్రస్తుతం నడుస్తున్న 2374 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 8 విద్యుత్ ప్లాంట్లతో కూడా డిస్కంలతో జెన్‌కో పీపీఏలు కుదుర్చుకుంది. వీటి అనుమతి కోసం కూడా 2009లోనే ఈఆర్‌సీకి దరఖాస్తులు వెళ్లాయి. వీటికి కూడా ఈఆర్‌సీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న మరో 3210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లకు కూడా పీపీఏల అనుమతి కోసం 2010 నవంబర్ 22న జెన్‌కో, డిస్కంలు దరఖాస్తు చేశాయి. వీటిపై కూడా ఈఆర్‌సీ మౌనం దాల్చింది. కనీసం పీపీఏలు తమకు అందినట్టు పత్రికల్లో ప్రకటన ఇవ్వడం, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు, బహిరంగ విచారణ చేపట్టే కనీస చర్యలను ఈఆర్‌సీ తీసుకోలేదు.
ఫలితంగా ఇప్పుడు పీపీఏల రద్దు అంశం కాస్తా రెండు రాష్ట్రాలమధ్య కొత్త వివాదానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. తమ పీపీఏలను ఆమోదించాలని ఈఆర్‌సీని జెన్‌కో వర్గాలు వ్యక్తిగతంగా కలసి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా, జెన్‌కోకు చెందిన వివిధ విద్యుత్ ప్లాంట్లతో డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలకు అధికారిక ముద్ర పడలేదని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. ‘పీపీఏలకు లభించని అధికారిక ముద్ర’ అనే శీర్షికన ఒక వార్తను కూడా సుమారు ఆరు నెలల క్రితం సాక్షి ప్రచురించింది. అనుమతి లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవని కూడా ఆ వార్తలో ‘సాక్షి’ హెచ్చరించింది.
పీపీఏలు రద్దయితే మార్కెట్లో విక్రయించాల్సిందే
పీపీఏ రద్దు విషయంలో కొత్త చర్చ మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యల నేపథ్యంలో ప్రస్తుత పీపీఏలు రద్దయితే కొత్త పీపీఏలు కుదుర్చుకోవడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు విద్యుత్ చట్టాలు, కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశాలు అడ్డువస్తాయనే ఆందోళన ఇరు రాష్ట్రాల ఇంధనశాఖల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రసుత్త పీపీఏలు రద్దయితే మళ్లీ కొత్తగా ఏ రాష్ట్రంలోని డిస్కంలతో ఆ రాష్ట్ర జెన్‌కో పీపీఏలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, పీపీఏలు కుదుర్చుకోవడం సాధ్యం కానందువల్ల ఇతర ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లతో పోటీపడి మార్కెట్ ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్‌ను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జెన్‌కోల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
పీపీఏల రద్దుకు అనుమతించండి: ఈఆర్‌సీని మళ్లీ కోరిన ఏపీజెన్‌కో
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పం దాల (పీపీఏ) రద్దుకు అనుమతించాలని ఏపీఈఆర్‌సీని ఏపీ జెన్‌కో మరోసారి కోరింది. ఈ మేరకు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీరు శనివారం ఈఆర్‌సీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు డిస్కంలు కూడా పీపీఏల రద్దుకు ముందుకొచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. మరోవైపు ఏపీఈఆర్‌సీ చైర్మన్, సభ్యులతో ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్ శనివారం సమావేశమయ్యారు. పీపీఏలకు ఈఆర్‌సీ అనుమతి లేకపోతే అమల్లో లేనట్టేనన్న అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పును వారి దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.