పూర్తయిన జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు జలాశయం పనులను ఇప్పటికే కొలిక్కి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. జలవిద్యుత్కేంద్రం పనులనూ వేగవంతం చేసింది. ఇందులో కీలకమైన ప్రెజర్ టన్నెళ్ల తవ్వకాలు ప్రారంభమైన నాలుగు నెలల్లోనే 150.3 మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల వ్యాసంతో కూడిన ఒక టన్నెల్‌ను పూర్తిచేసింది. మరో టన్నెల్ తుదిదశకు చేరుకుంది. మిగిలిన పది టన్నెళ్ల పనులను వేగవంతం చేసింది.
గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. దీని ప్రధాన ఆనకట్ట ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వం జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ నీటి లభ్యత అధికంగా ఉన్నందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటుచేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్ ఉత్పత్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చౌకగా అందుబాటులోకి వచ్చే ఈ విద్యుత్ రాష్ట్ర విద్యుత్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని.. పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
పోలవరంలో జలవిద్యుదుత్పత్తి ఇలా..
► పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఒక్కో యూనిట్‌లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
► ఇక్కడ 35.52 మీటర్ల నీటి మట్టం నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు.
► ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు.
► ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ చానల్ తవ్వుతారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది.
► టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ చానల్ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలోకి కలుపుతారు.
► ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్‌ఈఎల్ సంస్థ తయారుచేస్తోంది. ఇవి ఆసియాలోనే అత్యంత పెద్దవి.
శరవేగంగా సాగుతున్న పనులు
జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం గోదావరి గట్టుకు అవతల ఎడమ వైపున ఉన్న కొండలో 21,39,639 క్యూబిక్ మీటర్లు తవ్వారు. ఈ కొండ తవ్వకం పనులను దాదాపుగా పూర్తిచేశారు. కొండలో ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూర్తయిన టన్నెళ్లకు సిమెంట్ లైనింగ్ చేసి.. టర్బైన్లను అమర్చడానికి కసరత్తు చేస్తున్నారు. వీటికి వంద మెగావాట్ల సామర్థ్యంతో కూడిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment