నీటివసతులున్నా నిర్లక్ష్యం
డొంకరాయి (వై.రామవరం) : రాష్ట్రాన్ని విద్యుత్ కొరత వేధిస్తోంది. ఈనేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకోగానీ డొంకరాయిలోని ఏపీ జెన్‌కో జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దానికి కావాల్సిన నీటివనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. డొంకరాయి విద్యుత్ కేంద్రంలో 4.10.1983న ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ 25 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
డొంకరాయి నదికి పైన ఉన్న సీలేరులో అదే నదిపై ఉన్న ఏపీ జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే నదిపై ఉన్న డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో ఒకే ఒక్క టర్బైన్ ద్వారా 25 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జలవిద్యుత్ కేంద్రం పవర్ కెనాల్ ద్వారా విడుదలయ్యే నీటితో నడుస్తున్న ఖమ్మంజిల్లాలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. డొంకరాయి నది ప్రమాద స్థాయిని మించి పారుతున్నప్పుడు డ్యాం గేట్ల ద్వారా వృథాగా నీరును వదిలేస్తున్నారు. దీంతో పల్లపు ప్రాంతాలైన చింతూరు మండల లోతట్టు గ్రామాలు జలమయం అవుతున్నాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.
సామర్థ్యం పెంచాలి
డొంకరాయిలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంపొం దించాలి. దీనివల్ల విద్యుత్ కొరత తీరడంతోపాటు, ఏపీ జెన్‌కో సంస్థకు అధిక ఆదాయం వస్తుంది.
కంచం పద్మ , బొడ్డగండి 1 ఎంపీటీసీ, వై.రామవరం మండలం
ఉపాధి పెరుగుతుంది
డొంకరాయిలోని ఏపీ జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వలన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. తక్షణమే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి.
ముర్ల దేవి, బొడ్డగండి 2 ఎంపీటీసీ, వై.రామవరం మండలం