ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్‌లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్‌కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే..
గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు.
గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment