తెలంగాణ, ఏపీలకు కృష్ణా బోర్డు సూచన
సాక్షి , హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసే నీటిని వినియోగించుకొని చేస్తున్న విద్యుదుత్పత్తిలో రెండు రాష్ట్రాలకు సమాన వాటా దక్కుతుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు 9 టీఎంసీల మేర నీటి విడుదల చేసేందుకు బోర్డు అంగీకా రం తెలిపింది. గతవారం జరిగిన బోర్డు వర్కిం గ్ గ్రూప్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నీటి విడుదల మార్గదర్శకాలు, విద్యుదుత్పత్తిలో వాటా తదితర అంశాలను పేర్కొంటూ బోర్డు సభ్య కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు.
లేఖలో పేర్కొన్న మేరకు.. 2 టీఎంసీలు నల్లగొండ జిల్లా, మరో 2 టీఎంసీలు గుంటూరు, ప్రకాశం జిల్లాలు, మిగిలిన 5 టీఎంసీల్లో రాయలసీమ తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ఎగువ నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా 2 టీఎంసీలు, శ్రీశైలం కుడి గట్టు కాల్వల ద్వారా 3 టీఎంసీలు విడుదల చేసుకోవచ్చని తెలిపా రు. అయితే విద్యుత్ పంచుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా విధివిధానాలు ఖరారు చేయని దృష్ట్యా, విద్యుదుత్పత్తిలో చెరిసగం పంచుకోవాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు ఆదేశించింది.
ఈ వాటా తాత్కాలిక నిర్ణయాలు మాత్రమేనని, ఇవి ఈ ఏడాదికే పరిమితమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాల ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని సూచించింది. నీటి విడుదలకు సంబంధించి రోజూవారీ విడుదలపై ఇరు రాష్ట్రాలు సంయుక్త ప్రకటన రూపొందించి సంబంధిత అధికారుల సంతకాలతో బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది.
30న గోదావరి బోర్డు సమావేశం..
ఇక గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 30న జరగనుంది. ఈ మేరకు బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలకు సోమవారం లేఖలు రాశారు. బోర్డు సమావేశ ఎజెండాను ఈ నెల 26న ఖరారు చేస్తామని అందులో పేర్కొన్నారు.
శ్రీశైలం విద్యుత్ చెరిసగం
Published Tue, Oct 20 2015 4:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement