సీఐఎస్‌ఎఫ్ నీడలో నాగార్జునసాగర్
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు, విద్యుదుత్పాదన కేం ద్రాలు సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. సోమవారం సీఐఎస్‌ఎఫ్ డీఐజీ వేణుగోపాల్, అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ తమ సిబ్బందితో ప్రాజెక్టు సందర్శించడం ఈ వాదనకు బలం చేకూర్చుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో నాగార్జునసాగర్, జూరాల, శ్రీశైలం, పులిచింత ల ప్రాజెక్టులు అంతరాష్ట్రాల పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటిని కలిపి కృష్ణా రివర్‌బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఇది కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. దీనికి స్వయంప్రతిపత్తి ఉంటుంది.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతా వ్యవహారాలన్నీ ఎస్‌పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్‌ఫోర్స్) చేస్తున్నది. కృష్ణా రివర్‌బోర్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎస్‌పీఎఫ్ స్థానే సీఐఎస్‌ఎఫ్‌కు రక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు డ్యామ్‌ను సందిర్శించిన వారిలో ఎన్‌ఎస్‌పీ అధికారులు డ్యాం ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణుప్రసాద్ ఎస్‌పీఎఫ్ అధికారులు ఆర్‌ఐ భాస్కర్, ఏఎస్‌ఐ రమేశ్‌లున్నారు. వారు అడిగిన సమాచారమంతా ఇచ్చారు.
ఖమ్మంలోనూ సీఐఎస్‌ఎఫ్ బృందం పర్యటన
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సోమవారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) బృందం పర్యటించింది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం నీటి పంపిణీలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కాల్వ పరిధిలో మూడు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ సెక్యూరిటీ బృందం సభ్యులు ముగ్గురు జిల్లాలోని నేలకొండపల్లి, బోనకల్లు, కృష్టాజిల్లాలోని విసన్నపేట పరిధిలో కాల్వలు పరిశీలించేందుకు జిల్లాకు చేరుకున్నారు.
సోమవారం నేలకొండపల్లి ప్రాంతంలో పర్యటించారు. ఎడమ కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటి పంపిణీ విషయంలో ఘర్షణలు తలెత్తకుండా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఇందుకు ముందస్తుగానే ఎడమ కాల్వ రెండో జోన్ పరిధిలో మూడు సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, కల్లూరు, విసన్నపేటల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. పరిశీలన అనంతరం కాల్వలు, ఆయకట్టు వివరాలతో నివేదిక రూపొందించనున్నారు. లోకేశ్