Central Industrial Security Force
-
CISF: మరో అడుగు...
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్ఎఫ్లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.సీఐఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్‌ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్ఎఫ్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్ఎఫ్ హర్షం ప్రకటించింది. -
సీఐఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా బెటాలియన్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్)లో మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది. పూర్తిగా మహిళలతో కూడిన ఈ బెబాలియన్లో వెయ్యి మంది సభ్యులుంటారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాలు, ప్రముఖుల భద్రత విధులు సీఐఎస్ఎఫ్కు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ నిర్ణయం వెలువరించినట్లు సమాచారం.సీఐఎస్ఎఫ్కు మంజూరైన 2 లక్షల మంది బలగాల్లోనే మహిళల రిజర్వుడు బెటాలియన్ కూడా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మొత్తం 1,025 మంది సభ్యులకుగాను సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నాయకత్వం వహిస్తారు. తాజాగా ప్రకటించిన బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కేటాయించే విధులకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లోని 1.80 లక్షల మందిలో ఏడు శాతం వరకు మహిళలున్నారు.కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా వ్యవహరించే ఉగ్రవాదులు ఎందరన్న దానిపై నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. మొత్తం 119 మంది ఉగ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదుల ఉనికి, వారి కార్యకలాపాల తీవ్రత, కొత్త వారిని చేర్చుకుంటున్న తీరును బట్టి నిఘా వర్గాలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుమొత్తం 119 మందిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని ఉత్తర ప్రాంతంలో 79 మంది ఉండగా వీరిలో 16 మంది స్థానికులు కాగా, 61 మంది విదేశీయులని తేలింది. పర్వత శ్రేణుల దక్షిణ భాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్న 40 మంది ముష్కరుల్లో ఏకంగా 34 మంది విదేశీయులు కాగా, ఆరుగురు మాత్రమే స్థానికంగా ఎంపికైన వారిగా నిఘా వర్గాలు గుర్తించాయి. -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
Neena Singh: చారిత్రక అడుగు అంకితభావమే ఆభరణమై...
అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ ఇల్లు నీనా రాకతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోయేది. ఆ ఇంట్లోని పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ కూర్చుని పాఠ్యపుస్తకాలు చదువుతూ కనిపించేవారు. పెద్ద అక్క అంటే మాటలా మరి! అక్కయ్య అంటే ఆప్యాయత, అనురాగం మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా. ఆ క్రమశిక్షణే ఆమెను పోలీస్‌శాఖలోకి అడుగు పెట్టేలా చేసింది. వివిధ హోదాల్లో మంచి పేరు తెచ్చుకునేలా చేసింది. తాజాగా... సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా చరిత్ర సృష్టించింది నీనా సింగ్... నీనా సింగ్‌ది బిహార్ రాష్ట్రం. కుటుంబ సభ్యుల్లో తనే పెద్ద. తమ్ముళ్లు, చెల్లెళ్లకు అమ్మ తరువాత అమ్మ. నీనా తండ్రి బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉండేవారు. తల్లి గృహిణి. పట్నా ఉమెన్స్ కాలేజీ, దిల్లీలోని జేఎన్‌యూలో చదివిన నీనా సింగ్ ‘దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. కోసం చేరింది. హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. రాజస్థాన్ క్యాడర్, 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నీనా సింగ్ పోలీస్‌శాఖలో అడుగు పెట్టిన తొలిరోజు నుంచి పాదరసంలా చురుగ్గా ఉండేది. సివిల్ రైట్స్ అండ్ యాంటి–హ్యూమన్ ట్రాఫికింగ్ ఏడీజీ(ట్రైనింగ్), డీజీగా పని చేసింది. రాజస్థాన్‌లోని డీజీ ర్యాంక్ పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్‌లో పనిచేసింది. కమీషన్ సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించింది. పాండమిక్ కాలంలో రాజస్థాన్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ(హెల్త్)గా బాధ్యతలు నిర్వహించింది. జాయింట్–డైరెక్టర్ ఆఫ్ సీబీఐగా పీఎన్బీ స్కామ్, నీరవ్ మోదీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లలో కీలకపాత్ర పోషించింది. ‘సివిల్ సర్వీస్‌లో ఉన్న మా నాన్నను చూస్తూ పెరిగాను. నేను ఐపీఎస్ చేయాలనుకోవడానికి నాన్న స్ఫూర్తిగా నిలిచారు. చదువుకు సంబంధించిన విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారు. మమ్మల్ని దగ్గర ఉండి చదివించేవారు. ఇంట్లో ఇతరత్రా విషయాల కంటే చదువుకు సంబంధించిన విషయాలే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం’ అంటుంది నీనా సింగ్. తన ఉద్యోగప్రస్థానంలో మహిళా సాధికారత భావన కలిగించే ఏ అవకాశాన్నీ, సందర్భాన్నీ వదులుకోలేదు నీనా సింగ్. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నీనా సింగ్‌ను భారతప్రభుత్వం 2015లో ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్’ 2020లో ‘విశిష్ఠసేవా పురస్కారం’తో సత్కరిం చింది. నాన్న స్ఫూర్తితో... ఇంటి వాతావరణం మన కలలకు ఊపిరిపోస్తుంది. నాన్న సివిల్ సర్వీస్‌లో ఉండడం వలన ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన ద్వారా ఎంతోమంది ఐకానిక్ ఆఫీసర్ల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్‌లో చేరాలనే లక్ష్యం ఏర్పడింది. కెరీర్‌కు సంబంధించి వేరే ఆలోచనలు ఏవీ ఉండేవి కాదు. నా ఏకైక లక్ష్యం సివిల్ సర్వీస్ అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీస్‌లో విస్తృతంగా పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఖాకీ యూనిఫాం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఖాకీ యూనిఫాంలోఉన్న వారిని చూస్తే అపురూపంగా అనిపించేది. యూనిఫాం ఎప్పుడూ ఇతరులను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ...నేను సిరోహి ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాకు మీలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పోలీస్ ఉద్యోగం అంటే శాంతిభద్రతలను కాపాడడం మాత్రమే కాదు రకరకాల సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ధైర్యాన్నీ, భరోసానూ ఇవ్వడం కూడా. – నీనా సింగ్ నోబెల్ విజేతలతో కలిసి పరిశోధన పోలీసుల పనితీరులో రావాల్సిన మార్పులు, ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాల గురించి ‘మసాచుసెట్సు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో నీనా సింగ్ భాగం అయింది. తన పరిశోధన తాలూకు అంశాల ఆధారంగా ఎన్నో పోలీస్స్టేషన్లలో మార్పు తీసుకువచ్చింది. నోటెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డప్లోతో కలిసి ‘ది ఎఫీసియెంట్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పోలీస్ రిసోర్సెస్’ అంశంపై పరిశోధన పత్రాలు రాసింది. హార్వర్డ్‌లో చదివే రోజుల నుంచి వారితో నీనా సింగ్‌కు పరిచయం ఉంది. -
సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్
ఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్ నియమితులయ్యారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఆమె.. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రాను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ఈయన మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ అనీష్ దయాళ్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈయన చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(IB)కోసం పనిచేశారు. డిసెంబర్ 11న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దయాళ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
సీఐఎస్ఎఫ్ ఒక కర్మయోగి: అమిత్ షా
ఘజియాబాద్: కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం( సీఐఎస్ఎఫ్) ఒక కర్మయోగిలాగా పారిశ్రామికాభివృద్ధి, ప్రైవేట్ ఉత్పత్తి యూనిట్ల రక్షణలో పాలుపంచుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. ఇకపై సంస్థ హైబ్రిడ్ మోడల్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. హైబ్రిడ్ మోడల్లో భాగంగా నాణ్యమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయాలన్నారు. తద్వారా వివిధ పారిశ్రామిక, ఉత్పత్తి యూనిట్ల రక్షణకు ప్రైవేట్ ఏజెన్సీల సేవలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇండియా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉందని, ఇందులో భాగంగా కొత్తగా అనేక ఉత్పత్తి యూనిట్లు పుట్టుకువస్తాయని, వీటి రక్షణలో సీఐఎస్ఎఫ్ నూతన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంస్థ 53వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడల్‌ను పెంపొందించడం వల్ల 1–5 వేల మంది సిబ్బందితో సేవలనందించే ప్రైవేట్ సంస్థలు వస్తాయన్నారు. వీటికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా సీఐఎస్ఎఫ్ బాధ్యతల బరువు పంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ సిబ్బంది 354 యూనిట్లకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రైవేట్ రంగ ఏజెన్సీలు ప్రస్తుతం కేవలం 11 కంపెనీలకే రక్షణ బాధ్యతలు అందిస్తున్నాయని, ఇవి మరింత పెరిగేలా కృషి చేయాలని షా సూచించారు. -
‘భారత్ బయోటెక్’కు సీఐఎస్ఎఫ్ భద్రత
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 టీకా ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారత్ బయోటెక్ హైదరాబాద్ ప్లాంట్, కార్యాలయాలకు సీఐఎస్ఎఫ్(కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ రిజిస్టర్డ్ ఆఫీసుతోపాటు ప్లాంట్‌కు 64 మంది సీఐఎస్ఎఫ్ సాయుధ సభ్యుల బృందం భద్రత కల్పించనుందని అధికారులు తెలిపారు. -
‘సోషల్’ ఖాతాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తమ 1.62 లక్షల మంది సైనికులకు సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలను ఇచ్చింది. అంతేగాక సైనికులు వాడుతున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటి యూజర్ ఐడీలు వెల్లడించాలని కోరింది. ఆన్లైన్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల రీత్యా, భారత్ పై ఇతర దేశాల నుంచి ఉన్న ముప్పు రీత్యా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశంలోని 63 విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ జవాన్లు సేవలందిస్తున్నారు. వాటితో పాటు కొన్ని ఏరోస్పేస్, న్యూక్లియర్ డొమన్ తో పాటు పలు మంత్రిత్వ శాఖల భవనాల వద్ద వీరు పనిచేస్తున్నారు. సైనికులు ఉపయోగిస్తున్న ఐడీల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు వస్తున్నాయేమో గమనించనున్నారు. తప్పుడు ఐడీలు సమర్పించడంగానీ, కొత్త ఐడీలు క్రియేట్ చేయడంగానీ చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
3 నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదా?
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయం మార్గంలో గత మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత ముఖ్యమైన మార్గంలో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ జాతి భద్రతకు సంబంధించి ఏదైనా జరగరాని ఘటన జరిగితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంటుందని నిలదీసింది. మనిషి సృష్టించే విపత్తుల నుంచి రక్షించుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని న్యాయస్థానం పేర్కొంది. విమానాశ్రయంలో ఎక్కడెక్కడ సీసీ టీవీలున్నాయి..? వాటి ఫుటేజీ వివరాలపై కోర్టు ఆరా తీసింది. వీఐపీ లాంజ్, రెస్టారెంట్లో సీసీ కెమేరాలు లేవనే విషయాన్ని గుర్తించింది. విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బాధ్యతలు ఏమిటి..? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బాధ్యతలు ఏమిటి? అనే అంశాలను ఆరా తీసింది. ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యాయవాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సీఐఎస్‌ఫ్ ఐజీ, సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, విశాఖపట్నం విమానాశ్రయ ప్రధాన భద్రతాధికారి, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రతివాదులుగా చేర్చింది. వీరితోపాటు ఇప్పటికే ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, విశాఖ పోలీస్ కమిషనర్, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌కు కూడా నోటీసులు జారీ చేస్తూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్, వైఎస్సార్ జిల్లాకు చెందిన గుమ్మా అమర్నాథ్రెడ్డిలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఇది ఒక్కరు చేసే పని కాదని, దీని వెనక మరికొంత మంది ఉండి ఉంటారని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బాధ్యతాయుతుడైన అధికారి సాయం తీసుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ తమకు ఇక్కడున్న న్యాయవాదులపై నమ్మకం ఉందని, అధికారుల సాయం ఎంత మాత్రం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఐఎస్ఎఫ్ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. సీఐఎస్ఎఫ్ బాధ్యత అంతవరకే ... ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారిని విమానాశ్రయం లోపలకు పంపడం, ఆ తరువాత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వరకే సీఐఎస్ఎఫ్ బాధ్యతని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్ కోర్టుకు నివేదించారు. వీఐపీ లాంజ్ సీఐఎస్ఎఫ్ పరిధిలోకి రాదని, అది ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల నియంత్రణలో ఉంటుందన్నారు. గాయపడిన వ్యక్తులకు చికిత్స అందించే అంశం కూడా ఆ అ«థారిటీ పరిధిలోకే వస్తుందన్నారు. సీఐఎస్ఎఫ్ ఐజీ సి.వి.ఆనంద్ ఘటన తరువాత విశాఖ విమానాశ్రయానికి వెళ్లి విచారణ జరిపారని చెప్పారు. విమానాశ్రయం లోపల ఏ భాగాలు ఎవరి పరిధిలో వస్తాయో నిర్ధిష్టంగా చెప్పాలని ధర్మాసనం కోరగా.. కొంత గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని లక్ష్మణ్ నివేదించారు. కావాల్సినంత సమయం తీసుకోవచ్చని, ఈ విషయంలో తాము ఎవరినీ తొందరపెట్టబోమని, సీఐఎస్ఎఫ్ను శాసించజాలమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తరువాత ధర్మాసనం సీసీ టీవీలు, వాటి ఫుటేజీల గురించి ఆరా తీసింది. ఘటన తరువాత విమానాశ్రయంలో ఉన్న సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ప్రశ్నించగా... తీసుకున్నామని ఏజీ చెప్పారు. లాంజ్ లోపల, బయట, రెస్టారెంట్ లోపల, బయట సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే లాంజ్‌లో సీసీ టీవీ లేదని, బయట కొద్ది దూరంలో ఉన్న సీసీ టీవీ నుంచి ఫుటేజీ తీసుకున్నామని ఏజీ చెప్పారు. రెస్టారెంట్లో కూడా సీసీ టీవీ లేదన్నారు. అందుకే జగన్ వాంగ్మూలం ఇవ్వలేదు... ఆ తరువాత దర్యాప్తు అధికారుల ముందు వైఎస్ జగన్ వాంగ్మూలం ఇచ్చారా? అంటూ ధర్మాసనం ఆరా తీసింది. ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని... డీజీపీ, ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదు కాబట్టి వాంగ్మూలం ఇవ్వరాదని ఓ స్పష్టమైన వైఖరి తీసుకున్నామని జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, సానుభూతి కోసమే ఈ ఘటన జరిగిందని, దీనికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తంటూ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పారని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జగన్‌పై హత్యాయత్నాన్ని డ్రామాగా అభివర్ణిస్తూ దర్యాప్తును ఏ దిశగా చేయాలో పోలీసులకు నిర్దేశించారని, అలాగే దర్యాప్తు ఫలితం ఎలా ఉండాలో కూడా చెప్పకనే చెప్పారని ఆయన తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆ తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలను తెలుసుకునే మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. నిందితుడు తనకు ప్రాణహాని ఉందని చెప్పాడని, అందుకు సంబంధించి సీడీలు కూడా ఉన్నాయని, వాటిని కూడా వ్యాజ్యాలతో జత చేశామని మోహన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గాయపడిన వ్యక్తిని విమానం ఎక్కేందుకు ఎవరు అనుమతించారంటూ లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. దీంతో సీఐఎస్ఎఫ్కు సంబంధం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. అది ఎయిర్పోర్ట్ వారి పరిధిలోని అంశమన్నారు. వైఎస్ జగన్ విమానం ఎక్కే సమయానికి అక్కడ ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీసులు కూడా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా, రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా తనకున్న విస్తృత ప్రజాభిమానం దృష్ట్యా వైఎస్ జగన్ తాను హైదరాబాద్ వెళ్లాలని కోరి ఉండొచ్చునని, అయితే నిబంధనలు తెలుసుకోకుండా ఆయన్ను విమానం ఎలా ఎక్కనిచ్చారని ప్రశ్నించింది. విమానంలో జగన్‌కు జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. మేం లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది... ఆ తరువాత సిట్ నివేదికను మరోసారి పరిశీలించిన ధర్మాసనం అందులో సీసీటీవీ కోర్ టీం అని పేర్కొని ఉండటాన్ని గమనించి కోర్ టీం ఏం చేస్తుందని ప్రశ్నించింది. ఇదే సమయంలో విమానాశ్రయ మార్గంలో గత మూడు నెలలుగా సీసీ టీవీలు పనిచేయడం లేదన్న విషయాన్ని నివేదికలో పేర్కొని ఉండటాన్ని గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను నిలదీసింది. సిట్ నివేదిక పరిశీలించిన తరువాత తాము మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలను పరిశీలించేందుకు సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన పలువురు అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ విచారణను వాయిదా వేసింది. -
‘విమానాశ్రయాల్లో బాడీస్కానర్లకు ఓకే’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని పౌర విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లను అమర్చేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) తెలిపింది. ప్రస్తుతం 27 విమానాశ్రయాల్లో అమలుచేస్తున్న ట్యాగ్‌లెస్ హ్యాండ్ బ్యాగేజ్ విధానాన్ని త్వరలోనే మొత్తం 59 ఎయిర్‌పోర్టులకు విస్తరిస్తామని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ వెల్లడించారు. బాడీ స్కానర్ యంత్రాల వల్ల చేతులతో తనిఖీచేసే అవసరం ఉండదన్నారు. ఓ బాడీ స్కానర్ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షించినట్లు తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్న 96 మంది స్వదేశీ, విదేశీ ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సింగ్ వెల్లడించారు. -
స్కూళ్లకూ భద్రత కల్పిస్తాం
న్యూఢిల్లీ: పాఠశాలల్లోని విద్యార్థులకు ఆరోగ్యకరమైన, సురక్షిత వాతావరణం కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లకు కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) తెలిపింది. ఈ మేరకు నవోదయ విద్యాలయ కమిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, కేంద్రీయ విద్యాలయ, డూన్ స్కూల్, స్ప్రింగ్డేల్స్, సల్వాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, సంస్కృతి మదర్స్ ఇంటర్నేషనల్, శ్రీరామ్ అండ్ అప్పీజే ఎడ్యుకేషనల్ సొసైటీ, సింధియా స్కూల్, చిత్తూరు జిల్లాలోని రిషీవ్యాలీ తదితర పాఠశాలలకు లేఖలు రాసింది. ఇటీవల గురుగ్రామ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో క్లాస్ విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురైన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ ఈ మేరకు స్పందించింది. విమానాశ్రయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, సెబీ, ఎయిమ్స్ సహా దాదాపు 200 ప్రతిష్టాత్మక సంస్థలకు భద్రత కల్పిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ తెలిపారు. ప్రైవేటు భద్రతా సంస్థలు ఒక్కో పాఠశాలలో రక్షణ ఏర్పాట్లకు రూ.20 లక్షల వరకు వసూలు చేస్తే అదే పనికి సీఐఎస్ఎఫ్ రూ.4– 4.5 లక్షలే వసూలు చేస్తుందన్నారు. తొలుత క్లయింట్‌తో ఒప్పందం ఖరారైన వెంటనే సీఐఎస్ఎఫ్కు చెందిన ప్రత్యేక నిపుణుల కమిటీ పాఠశాలను తనిఖీ చేసి 3–4 నెలల్లో నివేదిక సమర్పిస్తుందన్నారు. స్కూళ్లలోకి వచ్చేవాళ్లను తనిఖీ చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, భద్రతా సిబ్బంది మోహరింపు, అత్యవసర ప్రతిస్పందన పరికరాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి విషయాలను ఈ నివేదికలో పొందుపరుస్తామన్నారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా తనిఖీల్లో పాఠశాలల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలను కూడా చేర్చినట్లు పేర్కొన్నారు. 1969లో స్థాపించిన సీఐఎస్ఎఫ్ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. -
హనీమూన్ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!
న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన వధువు అదృశ్యమైంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులోని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వధువు ఎంతకు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)ను ఆశ్రయించాడు. దీంతో అతను, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నీలిరంగు చీర కట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన అతని భార్య.. బయటకు వచ్చేటప్పుడు మాత్రం బురఖా ధరించింది. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె ఎత్తు, బరువు, నడకతీరును గమనించిన భర్త బురఖాలో ఉన్నది తన భార్యేనని తెలుసుకొని బిత్తరపోయాడు. ఆమె బురఖా ముసుగు కప్పుకొని వెళ్లి ఓ వ్యక్తిని కలిసింది. అతనికి మరొకడు జత కలిశాడు. ఆ ముగ్గురు ట్యాక్సీల వద్దకు వెళ్లి జనంలో కలిసిపోయారు. ఈ దృశ్యాలన్నింటినీ చూసి బిత్తరపోయిన ఆ నూతన వరుడు లబోదిబోమంటున్నాడు. లక్నో చెందిన ఓ వ్యక్తి విషయంలో ఈ ఘటన జరిగింది. పెళ్లయి హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అతని భార్య తన ప్రియుడితో కలిసి లేచిపోయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఉద్దేశపూరితంగానే ఆమె తన హ్యాండ్ బ్యాగ్‌ను, సెల్‌ఫోన్‌ను భర్త వద్ద వదిలేసి వెళ్లిందని భావిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసి దిగ్భ్రాంతుడైన సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతని భార్య స్వచ్ఛందంగా వెళ్లిపోవడంతో ఆమె ప్రియుడితో కలిసి వెళ్లి ఉంటుందని, బాధితుడు ఫిర్యాదు చేయనందున కేసు కూడా నమోదు కాకుండానే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని పోలీసులు అంటున్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత కట్టుదిట్టం!
- త్వరలో సీఐఎస్ఎఫ్ అధీనంలోకి విమానాశ్రయం విజయవాడ దేశంలో ప్రాధాన్యం కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన గన్నవరం ఎయిర్‌పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఎయిర్‌పోర్టులపై తీవ్రవాద సంస్థలు దాడులకు దిగే ప్రమాదం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేయడంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడు నెలల క్రితం సర్వే నిర్వహించినట్లు సమాచారం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి చెందిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. ఈ ఎయిర్‌పోర్టును త్వరలో సీఐఎస్ఎఫ్ తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విమానాశ్రయ భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో 35 నుంచి 40 మంది ఉండే భద్రత సిబ్బంది సంఖ్య ఇటీవల 80కి పెరిగింది. ఒక ఏసీపీ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ప్రస్తుతం ఎయిర్‌పోర్టు మెయిన్‌గేట్, పార్కింగ్, టెర్మినల్ బిల్డింగ్, బయటి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు వీఐపీల తాకిడి పెరగడంతో ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. తాజా ప్రతిపాదన ప్రకారం 150 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రానున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల, లోపల భద్రతాపరమైన మరిన్ని మార్పులు చేయనున్నారు. -
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి
కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో దుశ్చర్య చెన్నై, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్యాంపులో తన పైఅధికారి, సాటి జవాన్లపై ఓ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. తమిళనాడులోని కాంచీపురం కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో ఐదు వేల మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యంత భద్రతా పరమైన అణు విద్యుత్ కేంద్రం కావడంతో 500 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు షిఫ్టుల వారీగా బందోబస్తులో ఉంటారు. వీరి కోసం కల్పాక్కంనగర్‌లో బ్యారక్స్ క్యాంప్ ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ స్థాయి జవాను విజయ్ ప్రతాప్ సింగ్ (57) బుధవారం తెల్లవారుజామున బ్యారెక్స్‌లోని మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న తన పైఅధికారి, రాజస్థాన్‌కు చెందిన మోహన్‌సింగ్ (42)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. తుపాకీ శబ్దం విని కొందరు జవాన్లు బ్యారెక్స్ వద్దకు రాగా వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించడంతో సేలంకు చెందిన స్పెషల్ ఎస్ఐ గణేశన్ (38), మదురైకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజ్ (42) మృతి చెందారు. విజయ్ ప్రతాప్ సింగ్‌ను తోటి జవాన్లు పట్టుకుని తుపాకీ లాక్కున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ప్రతాప్ సింగ్ కొంతకాలంగా పైఅధికారులపై కోపంగా ఉన్నాడని, మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడని తోటి జవాన్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కాల్పులకు కారణాలను తెలుసుకుంటున్నారు. -
సీఐఎస్ఎఫ్ నీడలో నాగార్జునసాగర్
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు, విద్యుదుత్పాదన కేం ద్రాలు సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. సోమవారం సీఐఎస్ఎఫ్ డీఐజీ వేణుగోపాల్, అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ తమ సిబ్బందితో ప్రాజెక్టు సందర్శించడం ఈ వాదనకు బలం చేకూర్చుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో నాగార్జునసాగర్, జూరాల, శ్రీశైలం, పులిచింత ల ప్రాజెక్టులు అంతరాష్ట్రాల పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటిని కలిపి కృష్ణా రివర్‌బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఇది కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. దీనికి స్వయంప్రతిపత్తి ఉంటుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతా వ్యవహారాలన్నీ ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్ఫోర్స్) చేస్తున్నది. కృష్ణా రివర్‌బోర్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎస్పీఎఫ్ స్థానే సీఐఎస్ఎఫ్కు రక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు డ్యామ్‌ను సందిర్శించిన వారిలో ఎన్ఎస్పీ అధికారులు డ్యాం ఎస్ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణుప్రసాద్ ఎస్పీఎఫ్ అధికారులు ఆర్ఐ భాస్కర్, ఏఎస్ఐ రమేశ్‌లున్నారు. వారు అడిగిన సమాచారమంతా ఇచ్చారు. ఖమ్మంలోనూ సీఐఎస్ఎఫ్ బృందం పర్యటన ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సోమవారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) బృందం పర్యటించింది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం నీటి పంపిణీలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కాల్వ పరిధిలో మూడు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ సెక్యూరిటీ బృందం సభ్యులు ముగ్గురు జిల్లాలోని నేలకొండపల్లి, బోనకల్లు, కృష్టాజిల్లాలోని విసన్నపేట పరిధిలో కాల్వలు పరిశీలించేందుకు జిల్లాకు చేరుకున్నారు. సోమవారం నేలకొండపల్లి ప్రాంతంలో పర్యటించారు. ఎడమ కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటి పంపిణీ విషయంలో ఘర్షణలు తలెత్తకుండా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఇందుకు ముందస్తుగానే ఎడమ కాల్వ రెండో జోన్ పరిధిలో మూడు సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, కల్లూరు, విసన్నపేటల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. పరిశీలన అనంతరం కాల్వలు, ఆయకట్టు వివరాలతో నివేదిక రూపొందించనున్నారు. లోకేశ్ -
గాంధీ సమాధికి సాయుధ భద్రత
న్యూఢిల్లీ: అహింసా సిద్ధాంతానికి మారుపేరుగా నిలిచిన గాంధీ మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌కు భద్రతగా కేంద్ర ప్రభుత్వం సాయుధ సిబ్బందిని నియమించింది. త్వరలో 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉన్న ‘రాజ్‌ఘాట్’కు సమీపంలోని శక్తి స్థల్ (ఇందిరాగాంధీ సమాధి), వీర్ భూమి (రాజీవ్ గాంధీ), విజయ్ స్థల్(లాల్ బహదుర్ శాస్త్రి) సహా తొమ్మిది మంది ప్రముఖుల సమాధులకు 2004 నుంచీ ప్రభుత్వం సాయుధ రక్షణ ఏర్పాటు చేసింది. గాంధీ అహింసను బలంగా నమ్మిన వ్యక్తి అయిన నేపథ్యంలో రాజ్‌ఘాట్‌కు సాయుధ భద్రత కల్పించే అంశంపై ఇన్నేళ్లుగా మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. అయితే నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పట్టణాభివృద్ధి శాఖతోను, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతోనూ కేంద్ర హోం శాఖ పలు దఫాలు చర్చలు జరిపింది. ఆగస్టు 1 నుంచి 24 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని రాజ్‌ఘాట్ వద్ద నియమించింది. అయితే గేటు వద్ద ఉండే సిబ్బంది మాత్రమే ఆయుధాలు కలిగి ఉంటారని, సమాధి వద్ద భద్రతగా ఉండేవారు యూనిఫామ్‌లో ఉంటారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.