గాంధీ సమాధికి సాయుధ భద్రత
న్యూఢిల్లీ: అహింసా సిద్ధాంతానికి మారుపేరుగా నిలిచిన గాంధీ మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌కు భద్రతగా కేంద్ర ప్రభుత్వం సాయుధ సిబ్బందిని నియమించింది. త్వరలో 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉన్న ‘రాజ్‌ఘాట్’కు సమీపంలోని శక్తి స్థల్ (ఇందిరాగాంధీ సమాధి), వీర్ భూమి (రాజీవ్ గాంధీ), విజయ్ స్థల్(లాల్ బహదుర్ శాస్త్రి) సహా తొమ్మిది మంది ప్రముఖుల సమాధులకు 2004 నుంచీ ప్రభుత్వం సాయుధ రక్షణ ఏర్పాటు చేసింది. గాంధీ అహింసను బలంగా నమ్మిన వ్యక్తి అయిన నేపథ్యంలో రాజ్‌ఘాట్‌కు సాయుధ భద్రత కల్పించే అంశంపై ఇన్నేళ్లుగా మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. అయితే నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పట్టణాభివృద్ధి శాఖతోను, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతోనూ కేంద్ర హోం శాఖ పలు దఫాలు చర్చలు జరిపింది. ఆగస్టు 1 నుంచి 24 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని రాజ్‌ఘాట్ వద్ద నియమించింది. అయితే గేటు వద్ద ఉండే సిబ్బంది మాత్రమే ఆయుధాలు కలిగి ఉంటారని, సమాధి వద్ద భద్రతగా ఉండేవారు యూనిఫామ్‌లో ఉంటారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.