ఫస్ట్ టైమ్
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.
ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్‌ఎఫ్‌లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.
సీఐఎస్‌ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్‌ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్‌ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.
‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్‌ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్‌ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.
‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్‌ఎఫ్ హర్షం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment