- త్వరలో సీఐఎస్‌ఎఫ్ అధీనంలోకి విమానాశ్రయం
విజయవాడ
దేశంలో ప్రాధాన్యం కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన గన్నవరం ఎయిర్‌పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఎయిర్‌పోర్టులపై తీవ్రవాద సంస్థలు దాడులకు దిగే ప్రమాదం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేయడంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడు నెలల క్రితం సర్వే నిర్వహించినట్లు సమాచారం.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్), ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి చెందిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. ఈ ఎయిర్‌పోర్టును త్వరలో సీఐఎస్‌ఎఫ్ తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విమానాశ్రయ భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో 35 నుంచి 40 మంది ఉండే భద్రత సిబ్బంది సంఖ్య ఇటీవల 80కి పెరిగింది. ఒక ఏసీపీ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ప్రస్తుతం ఎయిర్‌పోర్టు మెయిన్‌గేట్, పార్కింగ్, టెర్మినల్ బిల్డింగ్, బయటి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్టుకు వీఐపీల తాకిడి పెరగడంతో ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. తాజా ప్రతిపాదన ప్రకారం 150 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది రానున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల, లోపల భద్రతాపరమైన మరిన్ని మార్పులు చేయనున్నారు.