ఘజియాబాద్: కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం( సీఐఎస్‌ఎఫ్) ఒక కర్మయోగిలాగా పారిశ్రామికాభివృద్ధి, ప్రైవేట్ ఉత్పత్తి యూనిట్ల రక్షణలో పాలుపంచుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. ఇకపై సంస్థ హైబ్రిడ్ మోడల్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా నాణ్యమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయాలన్నారు. తద్వారా వివిధ పారిశ్రామిక, ఉత్పత్తి యూనిట్ల రక్షణకు ప్రైవేట్ ఏజెన్సీల సేవలు ఉపయోగపడతాయని చెప్పారు.
ఇండియా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉందని, ఇందులో భాగంగా కొత్తగా అనేక ఉత్పత్తి యూనిట్లు పుట్టుకువస్తాయని, వీటి రక్షణలో సీఐఎస్‌ఎఫ్ నూతన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంస్థ 53వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడల్‌ను పెంపొందించడం వల్ల 1–5 వేల మంది సిబ్బందితో సేవలనందించే ప్రైవేట్ సంస్థలు వస్తాయన్నారు. వీటికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా సీఐఎస్‌ఎఫ్ బాధ్యతల బరువు పంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ సిబ్బంది 354 యూనిట్లకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రైవేట్ రంగ ఏజెన్సీలు ప్రస్తుతం కేవలం 11 కంపెనీలకే రక్షణ బాధ్యతలు అందిస్తున్నాయని, ఇవి మరింత పెరిగేలా కృషి చేయాలని షా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment