జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి
కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం సీఐఎస్‌ఎఫ్ క్యాంప్‌లో దుశ్చర్య
చెన్నై, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) క్యాంపులో తన పైఅధికారి, సాటి జవాన్లపై ఓ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. తమిళనాడులోని కాంచీపురం కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో ఐదు వేల మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యంత భద్రతా పరమైన అణు విద్యుత్ కేంద్రం కావడంతో 500 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లు షిఫ్టుల వారీగా బందోబస్తులో ఉంటారు. వీరి కోసం కల్పాక్కంనగర్‌లో బ్యారక్స్ క్యాంప్ ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ స్థాయి జవాను విజయ్ ప్రతాప్ సింగ్ (57) బుధవారం తెల్లవారుజామున బ్యారెక్స్‌లోని మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న తన పైఅధికారి, రాజస్థాన్‌కు చెందిన మోహన్‌సింగ్ (42)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
దీంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. తుపాకీ శబ్దం విని కొందరు జవాన్లు బ్యారెక్స్ వద్దకు రాగా వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించడంతో సేలంకు చెందిన స్పెషల్ ఎస్‌ఐ గణేశన్ (38), మదురైకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజ్ (42) మృతి చెందారు. విజయ్ ప్రతాప్ సింగ్‌ను తోటి జవాన్లు పట్టుకుని తుపాకీ లాక్కున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ప్రతాప్ సింగ్ కొంతకాలంగా పైఅధికారులపై కోపంగా ఉన్నాడని, మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడని తోటి జవాన్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కాల్పులకు కారణాలను తెలుసుకుంటున్నారు.