Indiscriminate firing
-
US Gunfire: అమెరికాలో నరమేధం
లెవిస్టన్ (అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ సైనికుడు నరమేధానికి దిగాడు. చిన్నారులు, వారి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పారిపోతూ దార్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్పైనా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 13 మందికి పైగా గాయపడ్డారు. మెయిన్ రాష్ట్రంలోని లెవిస్టన్లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వేళ ఈ ఘోరం జరిగింది. కాల్పుల అనంతరం చీకటి చాటున తప్పించుకుని పారిపోయిన హంతకుని కోసం భారీ వేట సాగుతోంది. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడు అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో ఆయుధాల ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హంతకుని ఫొటోను విడుదల చేశారు. అందులో అతను చేతిలో ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పిస్తున్నాడు. హంతకుడు పారిపోయేందుకు ఉపయోగించినట్టుగా భావిస్తున్న కారును ఆండ్రోస్కాగిన్ కౌంటీలో స్వా«దీనం చేసుకున్నారు. ఈ దారుణంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెయిన్ గవర్నర్‌తో మాట్లాడారు. బౌలింగ్ పోటీలు జరుగుతుండగా... కాల్పులు జరిగిన స్పేర్‌టైమ్ రిక్రియేషన్, షెమెంగీస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లెవిస్టన్ శివార్లలోని డౌన్టౌన్లో ఉన్నాయి. బుధవారం రాత్రి అక్కడి బౌలింగ్ ఏరియాలో చిన్నారుల బౌలింగ్ లీగ్ జరుగుతోంది. ఆటవిడుపుగా దాంట్లో పాల్గొంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులతో సందడిగా ఉన్న సమయంలో రాబర్ట్ అందులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. హింసాత్మక ప్రవృత్తి రాబర్ట్ది హింసాత్మక ప్రవృత్తి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలిపారు. రెండు వారాల క్రితమే ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కూడా తీసుకున్నాడన్నారు. అతను ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో చెప్పకపోయినా, కంఠధ్వనులు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. బౌలింగ్ ఏరియాలో కాల్పుల మోతకు జనం వణికిపోయారు. ప్రాణభయంతో చెల్లాచెదురైపోయారు. హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. బెలూన్లను పేలుస్తున్నారనుకున్నాం... తాను బౌలింగ్ ఏరియాలోకి వెళ్లిన కాసేపటికే వెంటవెంటనే కనీసం 10సార్లు తుపాకీ పేలి్చన శబ్దం విన్నట్టు బ్రెండన్ అనే వ్యక్తి చెప్పాడు. ‘‘ఆ సమయంలో కాళ్లకు బూట్లు తొడుక్కుంటున్నా. సరదాగా బెలూన్లను పేలుస్తున్నారని తొలుత అనుకున్నా. కానీ డోర్ వద్ద చేతిలో తుపాకీతో హంతకున్ని చూసి వణికిపోయా. వెంటనే నేలపై పాక్కుంటూ బౌలింగ్ మెషీన్‌లోకి దూరి దాక్కున్నా. ఐదారు గంటల పాటు ఉత్తకాళ్లతో గడిపా’’అని వివరించాడు. రెయిలీ దెమోంట్ అనే ఆవిడ తల్లిదండ్రులతో కలిసి తన కూతురి ఆట చూస్తోంది. ఆమె తండ్రి రిటైర్డ్ పోలీసాఫీసర్. ‘‘కాల్పులు మొదలు కాగానే అక్కడున్న వాళ్లందరినీ మా నాన్న హుటాహుటిన ఓ మూలకు తరలించాడు. టేబుళ్లు తదితరాలను వారికి అడ్డుగా పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు’’అని చెప్పింది. బార్లో కూడా కాల్పుల శబ్దం వింటూనే సిబ్బంది వెంటనే తలుపులన్నీ మూసేసి లోపలున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎందుకీ కాల్పులు...? కాల్పులను కళ్లారా చూసిన జోయ్ లెవెస్క్ అనే పదేళ్ల చిన్నారి ఇప్పటికీ దాన్ని తలుచుకుని వణికిపోతోంది! ‘‘బులెట్ నా కాలికి తగులుతూ దూసుకెళ్లింది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎవరైనా ఎందుకిలా ప్రవర్తిస్తారు?’’అని ప్రశి్నస్తోంది. కాల్పుల అనంతరం బౌలింగ్ ఏరియాలో, రెస్టారెంట్లో ఉన్నవాళ్లందరినీ పోలీసులు సమీపంలోని స్కూలుకు తరలించారు. ఈ ఏడాది 36వ ఘటన అమెరికాలో ఇది ఈ ఏడాదే ఏకంగా 36వ సామూహిక కాల్పుల ఘటన! ఇక మెయిన్ రాష్ట్రంలో కాల్పుల్లో ఇంతమంది బలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో 2022 మొత్తంలో పరస్పర కాల్పుల ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ రాష్ట్రం వేటకు, షూటింగ్ క్రీడలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ తుపాకీ కోసం లైసెన్సు కూడా అక్కర్లేదు! తుపాకీ కొనేందుకు లైసెన్సును తప్పనిసరి చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానిక ప్రజలే వ్యతిరేకించారు. కనీసం కొనుగోలుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్న ప్రతిపాదనను కూడా బుట్టదాఖలు చేశారు. ఇక కాల్పులు జరిగిన లెవిస్టన్ కేవలం 38 వేల జనాభాతో కూడిన చిన్న పట్టణం. ఇక్కడ ప్రధానంగా ఆఫ్రికన్లు నివసిస్తుంటారు. ప్రస్తుతం పట్టణంలో లాక్డౌన్ విధించారు. నార్త్ కరోలినాలో ఐదుగురు మృతి క్లింటన్: అమెరికాలో గురువారమే మరో కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలోని క్లింటన్లో హైవే సమీపంలోని ఓ ఇంట్లో ఐదుగురు తూటా గాయాలతో చనిపోయి కని్పంచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడిందీ ఇప్పటికైతే తెలియలేదన్నారు. పరస్పర గొడవలే ఇందుకు దారి తీసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. -
మాలిలో దుండగుల కాల్పులు
బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాలిలోని మోప్తీ ప్రాంతంలో తాజాగా ఈ ఘోరం చోటుచేసుకుంది. బందీయాగార పట్టణం సమీపంలోని యారౌ అనే ఓ గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారని, జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో 21 మంది ప్రజలు చనిపోయారని, మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలియజేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మాలిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసిస్ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉగ్రముఠాల అండతో తిరుగుబాటుదారులు కొన్ని భూభాగాలను ఆక్రమించారు. -
మెక్సికోలో కాల్పులు.. 8 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జెరెజ్ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో నైట్‌క్లబ్‌కు చేరుకొని, అక్కడున్న జనంపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో క్లబ్ ఉద్యోగులు, సంగీత కళాకారులు, వినియోగదారులు ఉన్నారని తెలిపారు -
బుసకొట్టిన జాతి విద్వేషం
బఫెలో/షికాగో(యూఎస్): అమెరికాలో జాతి విద్వేషం మరోసారి బుసలు కొట్టింది. నల్లజాతి ప్రజలే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేతజాతి యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది బలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. బఫెలో నగరంలోని టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో శనివారం ఈ దారుణం జరిగింది. ఇది జాతి విద్వేషపూరిత హింసాత్మక తీవ్రవాదమేనని పోలీసు అధికారులు అన్నారు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో ప్రధానంగా నల్ల జాతీయులు షాపింగ్ చేస్తుంటారు. ఇందులో పనిచేసే వారంతా నల్లజాతి కార్మికులే. సైనిక దుస్తులు, తూటా కవచం, హెల్మెట్ కెమెరా ధరించి వచ్చిన యువకుడు మార్కెట్ బయట హఠాత్తుగా రైఫిల్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడు. లోపలికి వెళ్లి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డునూ కాల్చేశాడు. ఇదంతా ‘ట్విచ్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది! పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నల్ల జాతీయులపై, ఇద్దరు శ్వేత జాతీయులపై కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ గెన్డ్రాన్గా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్వేతజాతి అహంకారంతో అమాయకులను బలితీసుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. షికాగో కాల్పుల్లో బాలుడి మృతి అమెరికాలో షికాగోలోనూ దారుణం జరిగింది. మిలీనియం పార్కులో శనివారం దుండగుడి కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
కశ్మీర్లో పాక్ దురాగతం
జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ భారత సైనికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని బలిగొంది. కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి కాగా, మిగిలిన ముగ్గురు జవాన్లు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్ సైనికులు ఆదివారం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆటోమేటిక్ తుపాకులు, మోర్టార్లతో పౌర ప్రాంతాలపైనా దాడి చేశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. తొలుత ఉదయం 11.10 గంటల ప్రాంతంలో పూంచ్‌లోని షాపూర్ సెక్టార్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మైనర్లు, ఓ ఆర్మీ జవాన్ గాయపడ్డారు. భారత సిబ్బంది తమ తుపాకులతో పాక్‌కు దీటైన సమాధానమిచ్చారని ఓ అధికారి చెప్పారు. రాజౌరీ జిల్లాలోని మధ్యాహ్నం 3.40 గంటలకు భీంభేర్ గలీ సెక్టార్‌లోనూ పాక్ సైనికులు మోర్టార్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం తరలిస్తుండగా ఆయనా మృత్యువాత పడ్డారు. రాజౌరీలోనూ పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటుగా సమాధానమిచ్చారు. ఆరు రోజుల్లో పుట్టినరోజు ఉందనగా... చనిపోయిన వారిలో వయసురీత్యా అందరికన్నా చిన్నవాడే ఆ అధికారి. హరియాణకు చెందిన కపిల్ కుందు (22) ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. మరో ఆరు రోజుల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే పాక్ కాల్పులకు కుందు బలయ్యారు. చనిపోయిన జవాన్లలో కశ్మీర్‌కు చెందిన రోషన్ లాల్ (42), శుభం సింగ్ (23)తోపాటు మధ్య ప్రదేశ్‌కు చెందిన రామావతార్ (27) ఉన్నారు. మరోవైపు నియంత్రణ రేఖకు ఐదు కి.మీ. దూరంలో ఉన్న అన్ని పాఠశాలలనూ మూడురోజులపాటు మూసివేస్తున్నట్లు రాజౌరీ ఉప కమిషనర్ చెప్పారు. -
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి
కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో దుశ్చర్య చెన్నై, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్యాంపులో తన పైఅధికారి, సాటి జవాన్లపై ఓ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. తమిళనాడులోని కాంచీపురం కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో ఐదు వేల మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యంత భద్రతా పరమైన అణు విద్యుత్ కేంద్రం కావడంతో 500 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు షిఫ్టుల వారీగా బందోబస్తులో ఉంటారు. వీరి కోసం కల్పాక్కంనగర్‌లో బ్యారక్స్ క్యాంప్ ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ స్థాయి జవాను విజయ్ ప్రతాప్ సింగ్ (57) బుధవారం తెల్లవారుజామున బ్యారెక్స్‌లోని మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న తన పైఅధికారి, రాజస్థాన్‌కు చెందిన మోహన్‌సింగ్ (42)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. తుపాకీ శబ్దం విని కొందరు జవాన్లు బ్యారెక్స్ వద్దకు రాగా వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించడంతో సేలంకు చెందిన స్పెషల్ ఎస్ఐ గణేశన్ (38), మదురైకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజ్ (42) మృతి చెందారు. విజయ్ ప్రతాప్ సింగ్‌ను తోటి జవాన్లు పట్టుకుని తుపాకీ లాక్కున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ప్రతాప్ సింగ్ కొంతకాలంగా పైఅధికారులపై కోపంగా ఉన్నాడని, మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడని తోటి జవాన్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కాల్పులకు కారణాలను తెలుసుకుంటున్నారు.