బఫెలోలోని ఘటనాస్థలి వద్ద గుమికూడిన జనం
బఫెలో/షికాగో(యూఎస్): అమెరికాలో జాతి విద్వేషం మరోసారి బుసలు కొట్టింది. నల్లజాతి ప్రజలే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేతజాతి యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది బలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. బఫెలో నగరంలోని టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. ఇది జాతి విద్వేషపూరిత హింసాత్మక తీవ్రవాదమేనని పోలీసు అధికారులు అన్నారు.
టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్‌లో ప్రధానంగా నల్ల జాతీయులు షాపింగ్ చేస్తుంటారు. ఇందులో పనిచేసే వారంతా నల్లజాతి కార్మికులే. సైనిక దుస్తులు, తూటా కవచం, హెల్మెట్ కెమెరా ధరించి వచ్చిన యువకుడు మార్కెట్ బయట హఠాత్తుగా రైఫిల్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడు. లోపలికి వెళ్లి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డునూ కాల్చేశాడు. ఇదంతా ‘ట్విచ్’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది! పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
11 మంది నల్ల జాతీయులపై, ఇద్దరు శ్వేత జాతీయులపై కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ గెన్‌డ్రాన్‌గా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్వేతజాతి అహంకారంతో అమాయకులను బలితీసుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు.
షికాగో కాల్పుల్లో బాలుడి మృతి
అమెరికాలో షికాగోలోనూ దారుణం జరిగింది. మిలీనియం పార్కులో శనివారం దుండగుడి కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment