Buffalo City
-
తేరుకుంటున్న బఫెలో
బఫెలో: వారానికి పైగా వణికించిన మంచు తుఫాను బారినుంచి అమెరికా క్రమంగా తేరుకుంటోంది. విమాన సేవలు తదితరాలు గాడిలో పడుతున్నాయి. ముఖ్యంగా తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో పరిస్థితి కుదుట పడుతోంది. ప్రయాణాలపై నిషేధం ఎత్తేశారు. తుఫానులో చిక్కిన వారికోసం ఇంటింటి గాలింపు ఇంకా కొనసాగుతోంది. నగరంలో ఇప్పటిదాకా కనీసం 40 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తుఫాను కారణంగా ఎటుచూసినా అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచు శరవేగంగా కరుగుతోంది. ఇది వరదలకు దారి తీసే ఆస్కారమున్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంచు తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా కనీసం 540 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బీమా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
హమ్మయ్య.. సూర్యుడు కనిపించాడు
న్యూయార్క్: అమెరికాలో గత కొద్ది రోజులుగా మంచు తుఫాన్‌కు అల్లాడిపోయిన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. గురువారం ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్ గార్డ్ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారు ఎలా ఉన్నారో వాకబు చేస్తున్నారు. తీవ్రమైన మంచు కురుస్తున్నప్పుడు కరెంట్ పోయిన సమయంలో ఆక్సిజన్ వెంటిలేషన్ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళనైతే నెలకొంది. బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్ బైరన్ బ్రౌన్ వెల్లించారు. అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కుదిపేసిన మంచు తుఫాన్ కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. -
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ). ఏమిటీ ఎన్ఆర్ఏ? అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్ఆర్ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా. పౌరులదీ అదే దారి తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు. అంగడి సరుకులు మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది. నలుగురు అధ్యక్షులు బలయ్యారు ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు. తుపాకుల నీడలో ► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు. ► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే. ► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. ► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు మరో ముగ్గురి దుర్మరణం లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బుసకొట్టిన జాతి విద్వేషం
బఫెలో/షికాగో(యూఎస్): అమెరికాలో జాతి విద్వేషం మరోసారి బుసలు కొట్టింది. నల్లజాతి ప్రజలే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేతజాతి యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది బలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. బఫెలో నగరంలోని టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో శనివారం ఈ దారుణం జరిగింది. ఇది జాతి విద్వేషపూరిత హింసాత్మక తీవ్రవాదమేనని పోలీసు అధికారులు అన్నారు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో ప్రధానంగా నల్ల జాతీయులు షాపింగ్ చేస్తుంటారు. ఇందులో పనిచేసే వారంతా నల్లజాతి కార్మికులే. సైనిక దుస్తులు, తూటా కవచం, హెల్మెట్ కెమెరా ధరించి వచ్చిన యువకుడు మార్కెట్ బయట హఠాత్తుగా రైఫిల్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడు. లోపలికి వెళ్లి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డునూ కాల్చేశాడు. ఇదంతా ‘ట్విచ్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది! పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నల్ల జాతీయులపై, ఇద్దరు శ్వేత జాతీయులపై కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ గెన్డ్రాన్గా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్వేతజాతి అహంకారంతో అమాయకులను బలితీసుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. షికాగో కాల్పుల్లో బాలుడి మృతి అమెరికాలో షికాగోలోనూ దారుణం జరిగింది. మిలీనియం పార్కులో శనివారం దుండగుడి కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
అమెరికాలో కాల్పుల కలకలం
-
పిల్లి ఆపరేషన్‌కు రూ. 19 లక్షలు!
న్యూయార్క్: పెంపుడు జంతువులంటే ప్రాణమని చాలామంది చెబుతుంటారు. అమెరికాలోని బఫెలో సిటీకి చెందిన ఆండ్రీ గాన్సియర్ దంపతులు మాత్రం తమ పెంపుడు పిల్లిని నిజంగానే కన్న కొడుకులా చూసుకుంటున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో చావుకు చేరువైన తమ పిల్లికి వారు కిడ్నీ మార్పిడి చేయించారు! ఇల్లు కొనేందుకు దాచుకున్న డబ్బును ఖర్చు చేసి మరీ దానికి పునర్జన్మ ప్రసాదించారు! రూ. 19 లక్షలు ఖర్చుచేసి మరీ తమ ‘బిడ్డ’ను కాపాడుకున్నారు! కొన్నేళ్ల క్రితం రుమేనియాలోని ఓ నీటికయ్యలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఒకీని వారు కాపాడి, అప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకీ ఇంతకుముందు 9 గండాలు దాటింది. తాజాగా మూత్రపిండాలు విఫలమయ్యాయి. గాన్సియర్ దంపతులు ఎలాగైనా ఒకీని కాపాడుకోవాలని పెన్సిల్వేనియా వర్సిటీ వెటర్నరీ ఆస్పత్రిని సంప్రదించగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మరో పిల్లిని దత్తత తీసుకుని, దాని నుంచి ఓ కిడ్నీని తీసి ఒకీకి అమర్చారు. రెండు పిల్లులూ కోలుకుంటున్నాయట. ఆపరేషన్‌కే రూ. 10 లక్షలు, ఇతర ఖర్చలు కలిపి రూ. 19 లక్షలైంది. 12 ఏళ్ల ఒకీ కిడ్నీ మార్పిడి చేసినా రెండు మూడేళ్లకు మించి బతకదట. ఈ మాత్రం దానికి అంత ఖర్చెందుకని ఎవరైనా అడిగారనుకోండి.. ‘మీ సొంత బిడ్డో లేక తండ్రో మంచాన పడితే మీరు ఇదే మాటంటారా?’ అని గాన్సియర్ దంపతులు ప్రశ్నిస్తున్నారట!