అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ ఇల్లు నీనా రాకతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోయేది. ఆ ఇంట్లోని పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ కూర్చుని పాఠ్యపుస్తకాలు చదువుతూ కనిపించేవారు.
పెద్ద అక్క అంటే మాటలా మరి! అక్కయ్య అంటే ఆప్యాయత, అనురాగం మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా. ఆ క్రమశిక్షణే ఆమెను పోలీస్‌శాఖలోకి అడుగు పెట్టేలా చేసింది. వివిధ హోదాల్లో మంచి పేరు తెచ్చుకునేలా చేసింది. తాజాగా... సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా చరిత్ర సృష్టించింది నీనా సింగ్...
నీనా సింగ్‌ది బిహార్ రాష్ట్రం. కుటుంబ సభ్యుల్లో తనే పెద్ద. తమ్ముళ్లు, చెల్లెళ్లకు అమ్మ తరువాత అమ్మ. నీనా తండ్రి బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉండేవారు. తల్లి గృహిణి. పట్నా ఉమెన్స్ కాలేజీ, దిల్లీలోని జేఎన్‌యూలో చదివిన నీనా సింగ్ ‘దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. కోసం చేరింది.
హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. రాజస్థాన్ క్యాడర్, 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నీనా సింగ్ పోలీస్‌శాఖలో అడుగు పెట్టిన తొలిరోజు నుంచి పాదరసంలా చురుగ్గా ఉండేది. సివిల్ రైట్స్ అండ్ యాంటి–హ్యూమన్ ట్రాఫికింగ్ ఏడీజీ(ట్రైనింగ్), డీజీగా పని చేసింది. రాజస్థాన్‌లోని డీజీ ర్యాంక్ పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది.
రాజస్థాన్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్‌లో పనిచేసింది. కమీషన్ సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించింది. పాండమిక్ కాలంలో రాజస్థాన్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ(హెల్త్)గా బాధ్యతలు నిర్వహించింది. జాయింట్–డైరెక్టర్ ఆఫ్ సీబీఐగా పీఎన్‌బీ స్కామ్, నీరవ్ మోదీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌లలో కీలకపాత్ర పోషించింది.
‘సివిల్ సర్వీస్‌లో ఉన్న మా నాన్నను చూస్తూ పెరిగాను. నేను ఐపీఎస్ చేయాలనుకోవడానికి నాన్న స్ఫూర్తిగా నిలిచారు. చదువుకు సంబంధించిన విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారు. మమ్మల్ని దగ్గర ఉండి చదివించేవారు. ఇంట్లో ఇతరత్రా విషయాల కంటే చదువుకు సంబంధించిన విషయాలే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం’ అంటుంది నీనా సింగ్.
తన ఉద్యోగప్రస్థానంలో మహిళా సాధికారత భావన కలిగించే ఏ అవకాశాన్నీ, సందర్భాన్నీ వదులుకోలేదు నీనా సింగ్. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నీనా సింగ్‌ను భారతప్రభుత్వం 2015లో ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్’ 2020లో ‘విశిష్ఠసేవా పురస్కారం’తో సత్కరిం చింది.
నాన్న స్ఫూర్తితో...
ఇంటి వాతావరణం మన కలలకు ఊపిరిపోస్తుంది. నాన్న సివిల్ సర్వీస్‌లో ఉండడం వలన ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన ద్వారా ఎంతోమంది ఐకానిక్ ఆఫీసర్‌ల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్‌లో చేరాలనే లక్ష్యం ఏర్పడింది. కెరీర్‌కు సంబంధించి వేరే ఆలోచనలు ఏవీ ఉండేవి కాదు. నా ఏకైక లక్ష్యం సివిల్ సర్వీస్ అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీస్‌లో విస్తృతంగా పనిచేసే అవకాశం దొరుకుతుంది.
ఖాకీ యూనిఫాం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఖాకీ యూనిఫాంలోఉన్న వారిని చూస్తే అపురూపంగా అనిపించేది. యూనిఫాం ఎప్పుడూ ఇతరులను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ...నేను సిరోహి ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాకు మీలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పోలీస్ ఉద్యోగం అంటే శాంతిభద్రతలను కాపాడడం మాత్రమే కాదు రకరకాల సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ధైర్యాన్నీ, భరోసానూ ఇవ్వడం కూడా.
– నీనా సింగ్
నోబెల్ విజేతలతో కలిసి పరిశోధన
పోలీసుల పనితీరులో రావాల్సిన మార్పులు, ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాల గురించి ‘మసాచుసెట్సు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో నీనా సింగ్ భాగం అయింది. తన పరిశోధన తాలూకు అంశాల ఆధారంగా ఎన్నో పోలీస్‌స్టేషన్‌లలో మార్పు తీసుకువచ్చింది. నోటెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డప్లోతో కలిసి ‘ది ఎఫీసియెంట్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పోలీస్ రిసోర్సెస్’ అంశంపై పరిశోధన పత్రాలు రాసింది. హార్వర్డ్‌లో చదివే రోజుల నుంచి వారితో నీనా సింగ్‌కు పరిచయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment