సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి బోర్డు మాన్యువల్ మాదిరే కృష్ణా మాన్యువల్ సిద్ధం చేయాలని భావించినా.. ప్రస్తుతం గోదావరి మాన్యువల్‌లోనే తెలంగాణ మార్పులు కోరడంతో ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సి వచ్చేలా ఉంది. దీంతో మాన్యువల్ ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు కృష్ణాబోర్డు బుధవారం ఇక్కడి జలసౌధలో భేటీ అయింది.
దీనికి తెలంగాణ ఈఎన్‌సీ నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర జల వనరుల అధికారులు కోటేశ్వర్‌రావుతో పాటే ఏపీ తరఫున సీఈ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాన్యువల్ ఆమోదంపై చర్చ జరగ్గా, గోదావరి మాన్యువల్‌లో పేర్కొన్న చైర్మన్ విస్తృతాధికారాల అంశం, ఓటింగ్ పవర్ అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులపై బోర్డు నిర్వహణ పరిధిపైనా అభ్యంతరాలు తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త మాన్యువల్‌ను సిద్ధం చేయాలని, అది ఆమోదం పొందాకే కృష్ణా మాన్యువల్‌పై చర్చించాలని కోరింది. దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ.. రెండు వారాల్లో తెలంగాణ తన అభ్యంతరాలను తమకు తెలియజేయాలని, అలా తెలియజేయని పక్షంలో ఇప్పటికే ఉన్న మాన్యువల్‌ను ఆమోదిస్తామని స్పష్టం చేసింది.
వీటీపీఎస్ పరిధిలో టెలిమెట్రీకి ఓకే..
ఇక టెలిమెట్రీకి సంబంధించి మొత్తంగా 21 చోట్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే ఇందులో వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్) పరిధిలో మాత్రమే టెలిమెట్రీకి ఓకే చేయగా.. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న వెలిగొండ, కండలేరు తదితర 8 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏర్పాటు వద్దని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల్లో 8 ఎత్తిపోతల పథకాలున్నాయని అయితే ఇందులో 150 క్యూసెక్కుల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాను ఇవ్వాలని కోరగా ఏపీ అందుకు అంగీకరించింది. మరో రెండు ఇప్పటికే సీడబ్ల్యూసీ గేజ్ స్టేషన్లు ఉండటంతో అక్కడ కొత్తగా టెలిమెట్రీ అవసరం లేదనే నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల అనంతరం మళ్లీ సమావేశమై అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment