telemetri
-
‘వర్కింగ్ మాన్యువల్’ మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి బోర్డు మాన్యువల్ మాదిరే కృష్ణా మాన్యువల్ సిద్ధం చేయాలని భావించినా.. ప్రస్తుతం గోదావరి మాన్యువల్‌లోనే తెలంగాణ మార్పులు కోరడంతో ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సి వచ్చేలా ఉంది. దీంతో మాన్యువల్ ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు కృష్ణాబోర్డు బుధవారం ఇక్కడి జలసౌధలో భేటీ అయింది. దీనికి తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర జల వనరుల అధికారులు కోటేశ్వర్‌రావుతో పాటే ఏపీ తరఫున సీఈ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాన్యువల్ ఆమోదంపై చర్చ జరగ్గా, గోదావరి మాన్యువల్‌లో పేర్కొన్న చైర్మన్ విస్తృతాధికారాల అంశం, ఓటింగ్ పవర్ అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులపై బోర్డు నిర్వహణ పరిధిపైనా అభ్యంతరాలు తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త మాన్యువల్‌ను సిద్ధం చేయాలని, అది ఆమోదం పొందాకే కృష్ణా మాన్యువల్‌పై చర్చించాలని కోరింది. దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ.. రెండు వారాల్లో తెలంగాణ తన అభ్యంతరాలను తమకు తెలియజేయాలని, అలా తెలియజేయని పక్షంలో ఇప్పటికే ఉన్న మాన్యువల్‌ను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. వీటీపీఎస్ పరిధిలో టెలిమెట్రీకి ఓకే.. ఇక టెలిమెట్రీకి సంబంధించి మొత్తంగా 21 చోట్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే ఇందులో వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్) పరిధిలో మాత్రమే టెలిమెట్రీకి ఓకే చేయగా.. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న వెలిగొండ, కండలేరు తదితర 8 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏర్పాటు వద్దని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల్లో 8 ఎత్తిపోతల పథకాలున్నాయని అయితే ఇందులో 150 క్యూసెక్కుల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాను ఇవ్వాలని కోరగా ఏపీ అందుకు అంగీకరించింది. మరో రెండు ఇప్పటికే సీడబ్ల్యూసీ గేజ్ స్టేషన్లు ఉండటంతో అక్కడ కొత్తగా టెలిమెట్రీ అవసరం లేదనే నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల అనంతరం మళ్లీ సమావేశమై అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. -
టెలీమెట్రీ లోపభూయిష్టం!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటుచేసిన టెలీమెట్రీ వ్యవస్థ అంతా లోపభూయిష్టంగా ఉందని కృష్ణాబోర్డు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. టెలీమెట్రీ ఏర్పాటుచేసిన ప్రాంతాలు, పరికరాల ఎంపిక అంతా తప్పులతడకగా ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరికరాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, వేరే రకమైన పరికరాలు, సాంకేతికంగా అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో మొదటి విడతలో 18 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేశారు. ఇందులో పోతిరెడ్డిపాడు కింది నీటి వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనికితోడు ఇక్కడ ఏర్పాటుచేసిన టెలీమెట్రీని ట్యాంపరింగ్ చేసి లెక్కలు తారుమారు చేశారని గత బోర్డు సమావేశంలో తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే టెలీమెట్రీలు అధికారికంగా అమల్లోకి రానందున ట్యాంపరింగ్ అవకాశం లేదని బోర్డు వివరణ ఇచ్చింది. అయినా కూడా కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై టెలీమెట్రీ వ్యవస్థలో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు వారితో అధ్యయనం చేయించింది. పోతిరెడ్డిపాడుసహా నాగార్జునసాగర్, జూరాల పరిధిలో పర్యటించి టెలీమెట్రీ వ్యవస్థల తీరును కమిటీ పరిశీలించి రెండ్రోజుల కిందట నివేదిక ఇచ్చింది. పీఆర్పీ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు జరగాల్సి ఉండగా, దాన్ని అనంతరం 12.26 కిలోమీటర్ వద్దకు మార్చారు. ఇక్కడ అమర్చిన నాన్–కాంటాక్ట్ రాడార్ వెలాసిటీ సెన్సర్ అనువైనది కాదని, అసలు ఆ పాయింట్ కూడా అనువైనది కాదని కమిటీ గుర్తించింది. పీఆర్పీ కాల్వ మూడో కిలోమీటర్ వద్ద సైడ్‌లుకింగ్ అకౌస్టిక్ డాప్లర్ సెన్సర్ అమర్చి పరిశీలిస్తే వాస్తవ డిశ్చార్జి లెక్కలు వచ్చాయని కమిటీ తన నివేదికలో తెలిపింది. లెవల్, వెలాసిటీ సెన్సర్లు కేవలం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల వద్ద తప్ప మిగిలిన ఎక్కడా సరైన డిశ్చార్జీని సూచించడం లేదని కమిటీ పేర్కొంది. టెలీమెట్రీ ప్రాంతాలపై పునఃపరిశీలనతో పాటు సరైన పరికరాలు ఏర్పాటుచేయాలని కమిటీ సిఫారసు చేసింది. -
మాకొద్దీ టెలిమెట్రీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలను అమర్చేందుకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్, తనపరిధిలోని ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ పరిధిలోని పులిచింతల డ్యామ్,ప్రకాశం బ్యారేజీ, తదితర ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని కృష్ణా బోర్డు ప్రతిపాదించగా, ఔట్ ఫ్లో ప్రాంతాల వద్ద మాత్రమే టెలిమెట్రీ సరిపోతుందని, ఇన్‌ఫ్లో ప్రాంతాల్లో వద్దని ఏపీ చెబుతు న్నట్లుగా తెలిసింది. కాగా బోర్డు సభ్యులు బుధవారం నుంచి జూరాల, ఆర్డీఎస్, కేసీ కెనాల్, ముచ్చుమర్రి తదితరాల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలు అమర్చే అంశంపై సభ్యులు పరిశీలన చేయనున్నారు.