Godavari river board
-
కీలకాంశాలపై వాడీవేడిగా
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న కడెం–గూడెం ఎత్తిపోతల పథకం, మొడికుంటవాగు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతుల జారీ/అబ్జర్వేషన్ల నమోదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్ర కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాడీవేడి చర్చకు అవకాశం! కడెం–గూడెం ప్రాజెక్టుపై ఏపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదని గత ఏడాది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం గోదావరి బో ర్డుకు లేఖ రాసింది. అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో 3 టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినందున ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్టు ఇటీవల తెలంగాణ అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు పెద్దవాగు ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకో వడం వల్ల అత్యవసర మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. రూ.7,826 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు తెలంగాణ 2019లో ప్రతిపాదనలు సమర్పించింది. ఆయకట్టు శాతం ఆధారంగా ఏపీ 85.75 శాతం, తెలంగాణ 14.75 శాతం వ్యయం భరించాలని తెలంగాణ కోరగా, ఏపీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇదే దామాషా లెక్కన రూ.92 కోట్లతో అత్యవసర మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకరించింది. ఆధునీకరణతో పాటు అత్యవసర మరమ్మతులపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నీటి లభ్యత ఎంత ? గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటివరకు నిర్ణయించక పోవడంతో రెండు రాష్ట్రా ల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల జారీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదావరి నీటి పంప కాలపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. 1980లో వచ్చిన గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోకూడా నీటి లభ్యతపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3,216 టీఎంసీల జలాల లభ్య త ఉండగా, అందులో ఉమ్మడి రాష్ట్రానికి కేవలం 1,360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్ అధ్య యనంలో తేలిందని ఏపీ వాదిస్తోంది. తెలంగాణకు 1,480 టీఎంసీలు, ఏపీకి 1,486.155 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంటోంది. ఈ నేప థ్యంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ స్థాయి సంస్థతో అధ్యయనం చేయించాలని గోదా వరి బోర్డు ప్రతిపాదించింది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
పరస్పర అంగీకారంతో ముందుకు..
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణపై ఇరు రాష్ట్రాలతో చర్చించి పరస్పర అంగీకారంతోనే ముందుకెళ్లాలని గోదా వరి బోర్డుకు కేంద్ర జల శక్తి శాఖ సూచించింది. నిర్వహణ పరమైన అంశాలేవైనా ఇరు రాష్ట్రాలతో చర్చించే తుది నిర్ణయాలు చేయాలని తెలిపింది. ఇటీవలి గోదావరి బోర్డు సమావేశాల్లో గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొన్న వన్ టైమ్ సీడ్ మనీ, అసెట్ ట్రాన్స్ఫర్ (ఆస్తుల బదిలీ), రెవెన్యూ యుటిలైజేషన్ (ఆదాయ వినియోగం)లపై రాష్ట్రాలు మరింత స్పష్టత కోరిన నేపథ్యంలో బోర్డు దీనిపై గతంలో జలశక్తి శాఖకు లేఖ రాసింది. దీంతో జలశక్తి శాఖ ఈ మూడు అంశాలపై స్పష్టతనిస్తూ గురువారం ప్రత్యుత్తరం పంపింది. అవార్డులకు లోబడి నీటి నిర్వహణ: అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956లో భాగంగా ఏర్పాటైన ట్రిబ్యునళ్లు వెలువరించిన అవార్డులకు లోబడి నీటి నిర్వహణ ఉండాలని జలశక్తి శాఖ తెలిపింది. లేనిపక్షంలో రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా ఒప్పందాలు జరిగి ఉంటే వాటికి అనుగుణంగా నీటి పంపిణీ ఉండాలని సూచించింది. విద్యుత్ సరఫరా విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుందని వెల్లడించింది. ఇక వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమగ్రంగా చర్చించాలని సూచించింది. ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే డ్యామ్‌లు, రిజర్వాయర్లు వంటి ఆస్తుల బదిలీపై బోర్డు తదుపరి చర్యలు ఉండాలని పేర్కొంది. రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున వన్ టైమ్ సీడ్ మనీ కింద గోదావరి బోర్డు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని స్పష్టంగా పేర్కొన్నందున, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
పెద్దవాగుతో మొదలు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిపై ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు ఈ నెల 14 నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పెద్దవాగును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకోనుంది. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ డిమాండ్‌పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. దాంతో.. పరిస్థితులపై అధ్యయనం చేసి ఆ ప్రాజెక్టులను దశలవారీగా బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పెద్దవాగు, సీలేరుపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు సోమవారం పూర్తిస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ కార్యదర్శులు శ్యామలరావు, రజత్‌కుమార్, ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సార్ఎస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు చేపట్టిన అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నుంచే గోదావరి ప్రవాహాలు దిగువకు రావాల్సి ఉందని, ఎగువన తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టి నీటిని వినియోగించడంతో పాటు ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా చెరువులన్నింటినీ నింపుకుంటోందని తెలిపారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులో 13 వేల ఎకరాలు ఏపీలోనే ఉన్నందున ఆ ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయంలో ఏపీ 85 శాతం చెల్లించాలని తెలంగాణ అధికారులు కోరారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా పెద్దవాగును తమ పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. పెద్దవాగును బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ అధికారులు కోరడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ.. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానిపై తర్వాత చర్చిద్దామని చెప్పారు. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ ఇస్తాం బోర్డులకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నించారు. అదీగాక నిధుల విడుదల ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని వివరించారు. కొలిక్కిరాని కృష్ణా బోర్డు పరిధి తెలంగాణ జల వనరులు, జెన్కో అధికారుల దాటవేత ధోరణి వల్ల కృష్ణా బోర్డు పరిధి కొలిక్కి రాలేదు. గెజిట్ నోటిఫికేషన్లో షెడ్యూల్–2 ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని ఆదివారం చెప్పిన తెలంగాణ అధికారులు ఆ తర్వాత మాట మార్చారు. దాంతో పరిధి, స్వభావంపై ముసాయిదా నివేదికను అసంపూర్తిగానే కృష్ణా బోర్డుకు సబ్ కమిటీ కన్వీనర్ ఆర్కే పిళ్లై అందించారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించారు. ఆదివారం కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పడంతో సోమవారం రాత్రి సబ్ కమిటీ మరోసారి భేటీ అయ్యింది. కానీ.. తెలంగాణ అధికారులు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తెలంగాణ వాదనపై ఏపీ జల వనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తుండటం వల్లే జల వివాదం ఉత్పన్నమైన అంశాన్ని ఎత్తిచూపారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులను మాత్రమే పరిధిలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ఈ వాదనతో సబ్‌కమిటీ కన్వీనర్ పిళ్లై ఏకీభవించారు. బోర్డు పరిధి, స్వరూపంపై బోర్డుకు నివేదిక ఇచ్చేందుకు సబ్‌కమిటీ రూపొందించిన ముసాయిదాపై తెలంగాణ అధికారులు సంతకం చేయడానికి నిరాకరించగా.. ఏపీ అధికారులు సంతకం చేశారు. -
‘వర్కింగ్ మాన్యువల్’ మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి బోర్డు మాన్యువల్ మాదిరే కృష్ణా మాన్యువల్ సిద్ధం చేయాలని భావించినా.. ప్రస్తుతం గోదావరి మాన్యువల్‌లోనే తెలంగాణ మార్పులు కోరడంతో ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సి వచ్చేలా ఉంది. దీంతో మాన్యువల్ ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు కృష్ణాబోర్డు బుధవారం ఇక్కడి జలసౌధలో భేటీ అయింది. దీనికి తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర జల వనరుల అధికారులు కోటేశ్వర్‌రావుతో పాటే ఏపీ తరఫున సీఈ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాన్యువల్ ఆమోదంపై చర్చ జరగ్గా, గోదావరి మాన్యువల్‌లో పేర్కొన్న చైర్మన్ విస్తృతాధికారాల అంశం, ఓటింగ్ పవర్ అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులపై బోర్డు నిర్వహణ పరిధిపైనా అభ్యంతరాలు తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త మాన్యువల్‌ను సిద్ధం చేయాలని, అది ఆమోదం పొందాకే కృష్ణా మాన్యువల్‌పై చర్చించాలని కోరింది. దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ.. రెండు వారాల్లో తెలంగాణ తన అభ్యంతరాలను తమకు తెలియజేయాలని, అలా తెలియజేయని పక్షంలో ఇప్పటికే ఉన్న మాన్యువల్‌ను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. వీటీపీఎస్ పరిధిలో టెలిమెట్రీకి ఓకే.. ఇక టెలిమెట్రీకి సంబంధించి మొత్తంగా 21 చోట్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే ఇందులో వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్) పరిధిలో మాత్రమే టెలిమెట్రీకి ఓకే చేయగా.. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న వెలిగొండ, కండలేరు తదితర 8 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏర్పాటు వద్దని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల్లో 8 ఎత్తిపోతల పథకాలున్నాయని అయితే ఇందులో 150 క్యూసెక్కుల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాను ఇవ్వాలని కోరగా ఏపీ అందుకు అంగీకరించింది. మరో రెండు ఇప్పటికే సీడబ్ల్యూసీ గేజ్ స్టేషన్లు ఉండటంతో అక్కడ కొత్తగా టెలిమెట్రీ అవసరం లేదనే నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల అనంతరం మళ్లీ సమావేశమై అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. -
12న గోదావరి బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించేందుకు ఈ నెల 12న గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. మొత్తంగా 8 అంశాలను అజెండాలో చేరుస్తూ, వాటిపై చర్చిద్దామని ప్రతిపాదించారు. అజెండాలో తెలంగాణ కోరుతున్న మళ్లింపు జలాల అంశం లేకపోవడం గమనార్హం. డిసెంబర్ రెండో వారంలో భేటీ నిర్వహిస్తామని, అజెండా అంశాలను తమకు పంపాలని బోర్డు కోరింది. ఇందులో తెలంగాణ వర్కింగ్ మాన్యు వల్ అంశాన్ని పక్కనపెట్టి, పట్టిసీమ ద్వారా ఏపీ మళ్లిస్తున్న జలాలపై ఇందులో తేల్చాలని, దీనిపై చర్చించేందుకు ఈ అంశాన్ని అజెండాలో చేర్చాలని కోరింది. అయితే వర్కింగ్ మాన్యువల్, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, టెలిమెట్రీ అంశాలనే అజెండాలో చేర్చింది. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, కాళేశ్వరం, సీతారామ, భక్త రామదాస, తుపా కులగూడెం వంటి ప్రాజెక్టులు పాతవేనని, వాటిని రీఇంజనీరింగ్‌లో భాగంగా మార్పులు చేర్పులు చేస్తున్నా మని ఇదివరకే బోర్డు కు తెలిపింది. అయితే ఈ విషయాన్ని బోర్డు సమావేశంలో లిఖిత పూర్వకంగా అందజేయాలని, అలా అయితేనే ఆమోదం తెలుపుతామని గురువారం రాసిన లేఖ లో తెలిపింది. విభజన సమయంలో మంత్రుల బృందానికి సమర్పించిన ప్రాజెక్టుల జాబితా వివరాలను తమకు అందించాలని బోర్డు కోరింది. -
కాళేశ్వరంపై మరిన్ని కొర్రీలు!
ప్రాజెక్టులోని అనేక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి బోర్డు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పాతదేనన్న రాష్ట్ర వైఖరికి భిన్నంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కొత్తదంటూ కేంద్ర జల సంఘానికి చెప్పిన బోర్డు.. ఇప్పుడు మరిన్ని అంశాలపైనా వివాదాలు లేవనెత్తుతోంది. తాజాగా ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) లోని అనేక అంశాల్లో లోపాలున్నాయని అభ్యంతరాలు లేవనెత్తుతూ కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. ప్రధానంగా నీటిని గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించడాన్ని ఎత్తి చూపింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పాత నల్లగొండ జిల్లాలో 2.6 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 50వేల ఎకరాలకు నీరందించనున్నారని.. హైదరా బాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల మేర కేటాయించారని.. ఇవన్నీ కృష్ణా బేసిన్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఏ నది నుంచైనా కృష్ణా బేసిన్‌కు నీటిని తరలిస్తే బేసి న్‌తో సంబంధమున్న ఏ రాష్ట్రమైనా వాటా కోరే అవకాశం ఉందని, ఆ అంశాన్ని తెలంగాణ డీపీఆర్‌లో ప్రస్తావించలేదని తెలిపింది. నీటి లెక్కల్లో తేడాలు! గోదావరిలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 63 టీఎంసీల మేర కేటాయింపులుండగా.. 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారని, దాని కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉందని సీడబ్ల్యూసీకి బోర్డు వివరించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకుంటున్న 225 టీఎంసీల్లో ఎల్లంపల్లికి మరో 20 టీఎంసీలు చూపారని, వాటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నించింది. ఇక 134.5 టీఎంసీల నీటితో ఖరీఫ్‌లో 18 లక్షల ఎకరాలు, రబీలో 5.5 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని తెలిపారని.. వాస్తవానికి ఇక్కడ నీటి అవసరం చాలా ఎక్కువగా ఉన్నా, ఇలా తక్కువ చూపారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3 చొప్పున రూ.4,067 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారని.. మిగులు విద్యుత్ రాష్ట్రం కానప్పుడు ఇంత తక్కువ ధరకు విద్యుత్ ఎలా అందుతుందన్న దానిపై పరిశీలన చేయాల్సి ఉందని తెలిపింది. కాగా ఈ అభ్యంతరాలపై కేంద్ర జల సంఘం తిరిగి రాష్ట్రానికి లేఖ రాస్తుంది. తర్వాత రాష్ట్రం వివరణ ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదని, దానికి బోర్డు నుంచి అనుమతులు అక్కర్లేదని ఇదివరకే సీడబ్ల్యూసీకి స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది తేలాల్సి ఉంది. -
ముగిసిన గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్
-
సీలేరు విద్యుత్ లెక్క తేల్చండి
* గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు తెలంగాణ వాదన * సమగ్ర సమాచారాన్ని తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ * సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలో చేర్చాలని విజ్ఞప్తి * విద్యుత్ కేంద్రాలపై బోర్డుకు అధికారం లేదన్న ఏపీ * తొలి సమావేశంలో ఎటూ తేల్చని బోర్డు * పూర్తిస్థాయి అధ్యయనం అవసరమన్న బోర్డు చైర్మన్ * ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు * సమగ్ర నివేదిక రూపొందించాలని సూచన.. 2 వారాల గడువు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగంతో దిగువ సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్ లెక్కలను ముందుగా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు పట్టుబట్టింది. సీలేరు నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా విద్యుత్‌ను ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జాప్యానికి కారణాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. సీలేరు జలాశయం నుంచి నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేలా ఏపీని ఆదేశించాలని కోరింది. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని విన్నవించింది. మరోవైపు బోర్డు కేవలం జల వివాదాలకే పరిమితమని, దానికి విద్యుత్ కేంద్రాలతో సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది. తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన బోర్డు సమావేశం బుధవారమిక్కడి కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ ఎ.మహేంద్రన్, సభ్య కార్యదర్శి జి.చంద్రశేఖర్ అయ్యర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, జెన్కో అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సాగగా... మూడున్నర గంటల పాటు సీలేరు జల విద్యుత్ కేంద్రాల అంశంపైనే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. సీలేరు విద్యుత్‌పై ఎవరి వాదనలు ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్: గోదావరి బోర్డు రెండు రాష్ట్రాల మధ్య కేవలం జల వివాదాలకు సంబంధించిన అంశాలకే పరిమితం. సీలేరు జల విద్యుత్ కేంద్రాలతో బోర్డుకు సంబంధం లేదు. బోర్డుకు నియంత్రణ అధికారం అప్పగించడానికి సిద్ధంగా లేం. విద్యుత్‌పై కేంద్రానికే అధికారం ఉంటుంది. విద్యుత్ షెడ్యూలింగ్ కూడా కేంద్రమే చూసుకుంటుంది. అందులో రాష్ట్రం పాత్ర ఏమీ ఉండదు. సీలేరు జలాశయాల నుంచి నీటి విడుదలకు, విద్యుత్ అంశానికి లింకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ: సీలేరులో 470 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. ఈ విద్యుత్‌ను 58:42 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు పంచుకోవాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నా అదేమీ జరగడం లేదు. సీలేరులో విద్యుదుత్పత్తి, వాడకం, తెలంగాణ వాటాపై ఏపీ ప్రభుత్వం ఏమీ తేల్చడం లేదు. ఇప్పటికే ఏపీ రాయలసీమ, విజయవాడ థర్మల్ కేంద్రాల నుంచి 900 మెగావాట్ల మేర విద్యుత్‌ను నిలిపివేయడంతో తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇలాంటి సమయంలో సీలేరు విద్యుత్ వాటా తెలంగాణకు చాలా ముఖ్యం. కానీ దాన్ని ఏపీ లెక్కచేయడం లేదు. ఈ దృష్ట్యా జల విద్యుత్ కేంద్రాలన్నీ బోర్డు పరిధిలోకి తెచ్చి, దాని నియంత్రణలోనే పనిచేసేలా చూడాలి. విద్యుత్ లెక్కలు ఇవ్వని కారణంగా విద్యుత్ గ్రిడ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. సీలేరు నుంచి ఎంత నీరు విడుదల చేస్తున్నారు? ఎంత విద్యుదుత్పత్తి చేస్తున్నారన్న సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఉత్పత్తి ఎంతో తెలిస్తే వచ్చే వాటా మేరకు వినియోగానికి ప్రణాళికలు తయారు చేసుకుంటాం. సీలేరుకు ఆయకట్టు, తాగునీరు లేదు కాబట్టి ప్రాజెక్టు తప్పకుండా బోర్డు పరిధిలో చేర్చాల్సిందే. గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు ఏమీ లేనందున తెలంగాణలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది. అన్ని ప్రాజెక్టులను చేర్చాల్సిందేనని ఏపీ వాదించింది. బోర్డు పరిధిలో చేర్చాల్సిన ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు బోర్డు అప్పగించింది. అధ్యయనం అవసరం: సీలేరు వివాదంపై నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని బోర్డు చైర్మన్ మహేంద్రన్ పేర్కొన్నారు. ‘‘ఇరు రాష్ట్రాల వాదనలపై అధ్యయనం చేసి పూర్తి సమాచారంతో నివేదిక ఇచ్చే బాధ్యతలను వర్కింగ్ గ్రూపునకు అప్పగిద్దాం. బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేద్దాం. విద్యుత్‌పై సమగ్ర నివేదిక సమర్పించడానికి వీలుగా రెండు వారాల గడువు ఇద్దాం. నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం..’’ అని ఆయన సమావేశంలో సూచించారు. బోర్డు నిర్ణయాలు ఇవీ.. భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల తీరు తెన్నులను నిర్దేశించే ప్రోటోకాల్‌లను తయారు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల వారీగా ‘వాటర్ ప్రొటోకాల్’లను రూపొందించాలి. ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు చర్చించుకొని సమగ్ర ప్రొటోకాల్‌లను బోర్డు ముందు ఉంచాలి. బోర్డు స్వరూపం, సిబ్బంది నియామకం, నిర్వహణ వ్యయం, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక అంశాలు.. తదితరాలపై సమగ్ర నివేదికను సమర్పించే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు అప్పగించారు. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి కూడా కేంద్ర జల సంఘం, బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాలి.