సీలేరు విద్యుత్ లెక్క తేల్చండి | Telangana Government Arguments on Sileru Power Project | Sakshi
Sakshi News home page

సీలేరు విద్యుత్ లెక్క తేల్చండి

Published Thu, Aug 7 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

సీలేరు విద్యుత్ లెక్క తేల్చండి

సీలేరు విద్యుత్ లెక్క తేల్చండి

* గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు తెలంగాణ వాదన
* సమగ్ర సమాచారాన్ని తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
* సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలో చేర్చాలని విజ్ఞప్తి
* విద్యుత్ కేంద్రాలపై బోర్డుకు అధికారం లేదన్న ఏపీ
* తొలి సమావేశంలో ఎటూ తేల్చని బోర్డు
* పూర్తిస్థాయి అధ్యయనం అవసరమన్న బోర్డు చైర్మన్
* ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు
* సమగ్ర నివేదిక రూపొందించాలని సూచన.. 2 వారాల గడువు
 
సాక్షి, హైదరాబాద్:  గోదావరి నదీ జలాల వినియోగంతో దిగువ సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్ లెక్కలను ముందుగా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు పట్టుబట్టింది. సీలేరు నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా విద్యుత్‌ను ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జాప్యానికి కారణాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. సీలేరు జలాశయం నుంచి నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేలా ఏపీని ఆదేశించాలని కోరింది. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని విన్నవించింది.

మరోవైపు బోర్డు కేవలం జల వివాదాలకే పరిమితమని, దానికి విద్యుత్ కేంద్రాలతో సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది. తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన బోర్డు సమావేశం బుధవారమిక్కడి కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ ఎ.మహేంద్రన్, సభ్య కార్యదర్శి జి.చంద్రశేఖర్ అయ్యర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సాగగా... మూడున్నర గంటల పాటు సీలేరు జల విద్యుత్ కేంద్రాల అంశంపైనే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి.

సీలేరు విద్యుత్‌పై ఎవరి వాదనలు ఏమిటంటే...
ఆంధ్రప్రదేశ్: గోదావరి బోర్డు రెండు రాష్ట్రాల మధ్య కేవలం జల వివాదాలకు సంబంధించిన అంశాలకే పరిమితం. సీలేరు జల విద్యుత్ కేంద్రాలతో బోర్డుకు సంబంధం లేదు. బోర్డుకు నియంత్రణ అధికారం అప్పగించడానికి సిద్ధంగా లేం. విద్యుత్‌పై కేంద్రానికే అధికారం ఉంటుంది. విద్యుత్ షెడ్యూలింగ్ కూడా కేంద్రమే చూసుకుంటుంది. అందులో రాష్ట్రం పాత్ర ఏమీ ఉండదు. సీలేరు జలాశయాల నుంచి నీటి విడుదలకు, విద్యుత్ అంశానికి లింకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు.

తెలంగాణ: సీలేరులో 470 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. ఈ విద్యుత్‌ను 58:42 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు పంచుకోవాలని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నా అదేమీ జరగడం లేదు. సీలేరులో విద్యుదుత్పత్తి, వాడకం, తెలంగాణ వాటాపై ఏపీ ప్రభుత్వం ఏమీ తేల్చడం లేదు. ఇప్పటికే ఏపీ రాయలసీమ, విజయవాడ థర్మల్ కేంద్రాల నుంచి 900 మెగావాట్ల మేర విద్యుత్‌ను నిలిపివేయడంతో తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇలాంటి సమయంలో సీలేరు విద్యుత్ వాటా తెలంగాణకు చాలా ముఖ్యం. కానీ దాన్ని ఏపీ లెక్కచేయడం లేదు. ఈ దృష్ట్యా జల విద్యుత్ కేంద్రాలన్నీ బోర్డు పరిధిలోకి తెచ్చి, దాని నియంత్రణలోనే పనిచేసేలా చూడాలి.

విద్యుత్ లెక్కలు ఇవ్వని కారణంగా విద్యుత్ గ్రిడ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. సీలేరు నుంచి ఎంత నీరు విడుదల చేస్తున్నారు? ఎంత విద్యుదుత్పత్తి చేస్తున్నారన్న సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఉత్పత్తి ఎంతో తెలిస్తే వచ్చే వాటా మేరకు వినియోగానికి ప్రణాళికలు తయారు చేసుకుంటాం. సీలేరుకు ఆయకట్టు, తాగునీరు లేదు కాబట్టి ప్రాజెక్టు తప్పకుండా బోర్డు పరిధిలో చేర్చాల్సిందే. గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు ఏమీ లేనందున తెలంగాణలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది. అన్ని ప్రాజెక్టులను చేర్చాల్సిందేనని ఏపీ వాదించింది. బోర్డు పరిధిలో చేర్చాల్సిన ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు బోర్డు అప్పగించింది.

అధ్యయనం అవసరం: సీలేరు వివాదంపై నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని బోర్డు చైర్మన్ మహేంద్రన్ పేర్కొన్నారు. ‘‘ఇరు రాష్ట్రాల వాదనలపై అధ్యయనం చేసి పూర్తి సమాచారంతో నివేదిక ఇచ్చే బాధ్యతలను వర్కింగ్ గ్రూపునకు అప్పగిద్దాం. బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేద్దాం. విద్యుత్‌పై సమగ్ర నివేదిక సమర్పించడానికి వీలుగా రెండు వారాల గడువు ఇద్దాం. నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం..’’ అని ఆయన సమావేశంలో సూచించారు.
 
 బోర్డు నిర్ణయాలు ఇవీ..
భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల తీరు తెన్నులను నిర్దేశించే ప్రోటోకాల్‌లను తయారు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల వారీగా ‘వాటర్ ప్రొటోకాల్’లను రూపొందించాలి. ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు చర్చించుకొని సమగ్ర ప్రొటోకాల్‌లను బోర్డు ముందు ఉంచాలి.

బోర్డు స్వరూపం, సిబ్బంది నియామకం, నిర్వహణ వ్యయం, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక అంశాలు.. తదితరాలపై సమగ్ర నివేదికను సమర్పించే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు అప్పగించారు.
     
గోదావరిపై కొత్త ప్రాజెక్టుల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి కూడా కేంద్ర జల సంఘం,  బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement