సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు  | Sileru Power Project pioneer in power generation for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు 

Published Thu, Feb 10 2022 5:14 AM | Last Updated on Thu, Feb 10 2022 5:14 AM

Sileru Power Project pioneer in power generation for Andhra Pradesh - Sakshi

సీలేరు విద్యుత్‌కాంప్లెక్సు నమూనా

సీలేరు: సీలేరు విద్యుత్‌ కేంద్రం..50 ఏళ్ల చరిత్ర.. నిరాటంకంగా విద్యుత్‌ కాంతులు..ఇప్పటికీ నంబర్‌ వన్‌..అదే వెలుగు..అదే ఖ్యాతి. విద్యుత్‌ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒకచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి బలిమెల నదిగా పేరు పొందింది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి పచ్చని కొండల మధ్య నుంచి ఒంపుసొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు, ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్‌ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుత్‌ ఉత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా నిరంతరం అందిస్తోంది. 

మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ కేంద్రం  
స్వాతంత్య్రం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటి సారిగా మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి. తొలుత మూడు యూనిట్లు ప్రారంభించి, తర్వాత మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసి 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఏపీ, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉత్పత్తి అయిన విద్యుత్‌ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 కేవీ లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవగా ఏపీ వాటా పెందుర్తి కూడా చేరుతోంది. 

సీలేరు: 240 మెగావాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో మాచ్‌ఖండ్‌ తర్వాత 1960లో సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించారు. ఒకటి, రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. 1964లో 3,4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 220 కేవీ లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్‌ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది.  

డొంకరాయి: 25 మెగావాట్స్‌ 
సీలేరు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్‌ కేంద్రానికి పైన డొంకరాయి డ్యామ్‌ను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృథా కాకుండా రెండు మార్గాల్లో నీరు విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం.  

మోతుగూడెం(పొల్లూరు): 460 మెగావాట్స్‌ 
ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ గొడవలు పడిన విద్యుత్‌ కేంద్రం ఇది. 1976లో నిర్మించిన ఈ జలవిద్యుత్‌ కేంద్రంలో ఒకేసారి నాలుగు యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్‌ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇదే ప్రాజెక్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.537 కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు నిర్మించి మరో 230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.

సీలేరు నది ఇరు రాష్ట్రాలకు సిరి  
సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్‌ కేంద్రాలు, జలాశయాలకు నేటికి గొప్ప చరిత్ర ఉంది. పత్రికల్లో ఎన్నో కథనాలు, ఎన్నో రికార్డులు, అవార్డులు వచ్చాయి. బలిమెల నది బలిమెలలో పుట్టి గోదావరి వరకు చేరుతుంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఐడల్‌ విద్యుత్‌ కేంద్రాలకు నీటిని విడుదల చేయడంలో బలిమెల నదే కీలకం. రెండు రాష్ట్రాల విద్యుత్, వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇక్కడ నుంచే నీటిని సరఫరా చేస్తారు. బలిమెల 32 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. శతకోటి ఘనపుటడుగుల  నీటి సామర్ధ్యంతో ఉంటుంది. ముందుగా మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి అయిన అనంతరం నీరు 86 కిలోమీటర్లు కొండల మధ్య ప్రవహించి బలిమెలలోకి చేరుతోంది.

ఇరు రాష్ట్రాలు నీటిని సమానంగా పంచుకుంటారు. ఏపీ వాటాగా ఉన్న నీరు 18 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడలోకి చేరుతోంది. సీలేరులో విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం పవర్‌ కెనాల్‌ ద్వారా 30 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడ జలాశయంలోకి చేరుతోంది. డొంకరాయిలో విద్యుత్‌ తయారై రెండు మార్గాల్లో నీటి విడుదల జరుగుతోంది. రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోయిన, గోదావరి పంటలకు నీరు కావాల్సి ఉన్న మెయిన్‌ డ్యాం ద్వారా నీరు విడుదల చేస్తారు. అలా కాకుండా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు కెనాల్‌ ద్వారా ఏవీపీ డ్యామ్‌కు చేరుతుంది. అక్కడ నుంచి మోతుగూడెం విద్యుత్‌ కేంద్రానికి చేరుకుని 430 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి 38 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని కలుపుకుని శబరి నదిలో కలుస్తోంది. అక్కడ నుంచి గోదావరిలోకి చేరుతోంది.

గ్రిడ్‌కు విద్యుత్‌ అందించడంలో సీలేరుదే ఘనత  
విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో సీలేరు కాంప్లెక్సుకు నేటికి ఓ రికార్డు ఉంది. 50 ఏళ్లు పూర్తయినా విద్యుత్‌ ఉత్పత్తిలో నంబర్‌ వన్‌గా నిలుస్తోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం విద్యుత్‌ సీలేరు నుంచే అందుతుంది. ఇటీవల సీలేరును సందర్శించినప్పుడు ఇక్కడ విద్యుత్‌ కేంద్రాల గొప్పతనం మరింత తెలుసుకున్నాం.      
– బి.శ్రీధర్, మేనేజింగ్‌ డైరెక్టర్, ఏపీ జెన్‌కో 

ఇంజనీర్లు, కార్మికుల కృషి వల్లే .. 
50 ఏళ్లకు ముందు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగుల కృషి ఈ విద్యుత్‌ కేంద్రాల ఘనత. ప్రతి ఏటా డిస్పాచ్‌ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను మించి సమయానికి తగ్గట్టు విద్యుత్‌ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈ విద్యుత్‌ కేంద్రాలకు ఉంది. ప్రతి ఏటా సీలేరు నుంచి గోదావరి పంట భూములకు నీరు అందిస్తున్నాం.  
– రాంబాబు, చీఫ్‌ ఇంజనీర్, మోతుగూడెం 

అధికారుల ప్రశంసలు మర్చిపోలేను
సీలేరు విద్యుత్‌ కేంద్రంలో ఉద్యోగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యుత్‌కేంద్రాలు కన్నతల్లిలాంటివి. ఇక్కడ ఉద్యోగం చేయడంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంపై అధికారుల ప్రశంసలు మర్చిపోలేను.  
– రమేష్‌కుమార్, ఏడీ, జలవిద్యుత్‌ కేంద్రం, సీలేరు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement