సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది.
మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్‌శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్‌ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు.
ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్‌కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు.
చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం
Comments
Please login to add a commentAdd a comment