కోతల్లేని కరెంట్‌.. | Yellow Media Fake News On Power Supply In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోతల్లేని కరెంట్‌..

Published Fri, May 19 2023 4:13 AM | Last Updated on Fri, May 19 2023 10:15 AM

Yellow Media Fake News On Power Supply In Andhra Pradesh - Sakshi

విద్యుత్‌ వెలుగుల్లో విజయవాడ

నాడు చీకటి రోజులు
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్ట­ణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయం­త్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్‌ సరఫరా ఉండదు’ అని అధికా­రికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్‌ కట్‌ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పు­డు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్‌ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్‌ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్‌ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు.

నేడు వెలుగు జిలుగులు
ఎక్కడా ‘విద్యుత్‌ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్‌­లోనూ విద్యుత్‌ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్‌ పెరగడంతో అక్కడక్కడ ఓవర్‌­లోడ్‌తో ట్రిప్‌ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్‌ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి.

వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్‌ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తోంది. 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్‌ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్‌ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్‌ జగన్‌ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది.

ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్‌ 248.985 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతోంది.

గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్‌ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్‌ డిమాండ్‌ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్‌ డిమాండ్‌ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది.

అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్‌ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్‌గా చెప్పవచ్చని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.  


ముందు చూపుతో విద్యుత్‌ కొనుగోలు  
ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్‌ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్‌కో హైడల్‌ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్‌ జెనరేటింగ్‌ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్‌ వంటి ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్‌ నుంచి 25.605 మి.యూ, విండ్‌ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్‌ యూనిట్లు చొప్పున విద్యుత్‌ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు.

దీంతో బహిరంగ మార్కెట్‌ నుంచి యూనిట్‌ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక భారీగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్‌లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్‌లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఏర్పడింది.   

సరిపడా బొగ్గు నిల్వలు 
దేశంలోని మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్‌ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్‌ను పెంచాలని ఏపీజెన్‌కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి.

14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి, సింగరేణి కాలరీస్‌ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్‌లో 83,479 మెట్రిక్‌ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్‌ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్‌ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి.   

యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్‌ పునరుద్ధరణ 
సోలార్‌ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్‌ జనరేటర్లు పీక్‌ లోడ్‌లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్‌ వద్ద జనరేటర్‌లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్‌ అయ్యాయి. పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్‌ ఉత్పత్తి అందుబాటులో లేదు.

గ్యాస్‌ పరిమితి కారణంగా గ్యాస్‌ స్టేషన్ల నుంచి ఉత్పత్తి  ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్‌లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరించారు. 

వాస్తవాలు మరచి దుష్ప్రచారం 
ఎక్కడా విద్యుత్‌ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్‌ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్‌ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది.

జిరాక్స్‌ మిషన్లు, పిండి మరలు, కూల్‌ డ్రింక్స్‌ దుకాణాలు, కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్‌ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్‌ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు.

ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ సీఎం జగన్‌ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్‌ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement